Suryaa.co.in

Andhra Pradesh

సీఎం గారూ.. పోలవరం నిర్వాసితుల సంగేతేమిటి?

జగన్‌కు లోకేష్ బహిరంగలేఖ
పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం అటకెక్కించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఆయన, ఏపీ సీఎం జగన్‌కు బహిరంగలేఖ రాశారు. లోకేష్ లేఖ సారాంశం ఇదీ..
బ‌హిరంగ‌లేఖ
గౌర‌వ‌నీయులు శ్రీ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి గారు
ముఖ్య‌మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
విష‌యం :- పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌పై ప‌రిష్క‌రించ‌డం, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఇచ్చిన హామీలు త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చ‌డం గురించి..
అయ్యా!
ముఖ్య‌మంత్రి గారూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్వ‌స్వం త్యాగం చేసిన నిర్వాసితులు అత్యంత ద‌య‌నీయ‌స్థితిలో వున్నారు. వారి స‌మ‌స్య‌లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌పై ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇటీవ‌ల నిర్వాసిత గ్రామాల‌లో నేను ప‌ర్య‌టించాను. నిర్వాసితులు నా దృష్టికి తీసుకొచ్చిన స‌మ‌స్య‌లు, నేను ప్ర‌త్య‌క్షంగా చూసిన ద‌య‌నీయ ప‌రిస్థితులు ఈ లేఖ ద్వారా మీకు తెలియ‌జేస్తున్నాను. అలాగే మీరు ప్ర‌తిప‌క్ష నేత‌గా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఇచ్చిన హామీల‌ను ఈ సంద‌ర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తాన‌ని ఒకసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారు, భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తాన‌ని, వ‌ల‌స వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమ‌లు, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే ప‌ట్టా భూమి ఇస్తాన‌న్న హామీలిచ్చారు. మీరు సీఎం అయినా ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదు.


ఎకరానికి రూ.1.15 లక్షలు పరిహారం ఇచ్చిన భూములకు..రూ.5 లక్షలు ఇస్తాన‌ని, 18 సంవత్సరాలు నిండినవారికి పరిహారం ప్యాకేజీ ఇస్తాన‌ని, 25 రకాల సౌకర్యాలతో నిర్వాసితులందరికీ అన్ని వసతులతో కాలనీలు నిర్మిస్తాన‌ని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తాన‌ని నాడు బ‌హిరంగ‌స‌భ‌లో మీరు ప్ర‌క‌టించిన హామీల‌న్నీ నెర‌వేర్చాలి. నిర్వాసితుల సమస్య చిన్నదంటున్న మీ ప్ర‌భుత్వంలోని మంత్రులు… ఆ చిన్న స‌మ‌స్య ప‌రిష్కారానికి చిన్న ప్ర‌య‌త్న‌మైనా చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం. పోల‌వ‌రం నిర్వాసితులైన‌ 275 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో అరకొరగా మాత్రమే పరిహారం అందించారంటే ఎంత నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల ప‌రిహారం, పున‌రావాసం కోసం రూ.3,200 కోట్లు కావాల్సి ఉంటే రూ.550 కోట్లు విడుదల చేసి, అందులో వంద కోట్లు మింగేయ‌డం చాలా దారుణం. జూన్ 2020 నాటికే 18 వేల మంది నిర్వాసితులను ఇళ్లలోకి పంపిస్తామన్న నీటిపారుద‌ల శాఖా మంత్రి మాట‌లు నీటిమూట‌లేనా? మీ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి రూ.200 కోట్లు కేటాయించారు, వ‌ర‌ద‌ల్లో నిండామునిగిన నిర్వాసితుల‌కు ఒక కొవ్వొత్తి, 2 బంగాళాదుంపలు ఇచ్చి అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించారు. నిర్వాసితులు ఉండ‌డానికి ఇళ్లు లేక‌, తాగ‌డానికి మంచి నీళ్లు లేక‌, విద్యుత్ సౌక‌ర్యంలేక, చీక‌ట్లో కంటిమీద కునుకు లేకుండా స‌మ‌స్య‌ల‌తో స‌హ‌వాసం చేస్తుంటే, అధికారులు రారు. ప్ర‌భుత్వం స్పందించ‌దు. ఇదేమి అన్యాయం? క‌నీసం మీరిచ్చిన హామీల‌లో ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌క‌పోవ‌డం నిర్వాసితుల ప‌ట్ల స‌ర్కారు నిర్ల‌క్ష్యాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. నిర్వాసిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన జాతీయ ఎస్టీ క‌మీష‌న్ ప‌రిహారం, పునరావాసం క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, ఇది గిరిజ‌నుల రాజ్యాంగ‌హ‌క్కుల్ని కాల‌రాయ‌డ‌మేన‌ని ఆక్షేపించినా స్పంద‌న లేక‌పోవ‌డం ఘోరం. ఇప్ప‌టికైనా పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్య‌లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించాలి. మాట త‌ప్ప‌న‌ని చేసుకునే ప్ర‌చారానికి క‌ట్టుబ‌డి నిర్వాసితుల‌కు మీరిచ్చిన హామీలన్నీ త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాలి.

ఇట్లు
నారా లోకేష్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
అమ‌రావ‌తి

LEAVE A RESPONSE