-గోదావరి జలాలతో రాయపర్తి రైతుల కాళ్ళు కడుగుత
-కాంగ్రెస్ వి కల్లబొల్లి కబుర్లు
-బిజెపి వి మాయ మాటలు
-ప్రతిపక్షాల అబద్ధాలను నమ్మొద్దు
-పచ్చని పల్లెల్లో మత చిచ్చు పెడుతున్న బిజెపి
-సర్వమతాలను సమానంగా చూస్తున్నం
-గ్రామాల్లో దేవాలయాల, విద్యాలయాల అభివృద్ధికి పెద్ద పీట
-పల్లె ప్రగతి వల్ల పట్టణాలతో పోటీ పడుతున్న పల్లెలు
-ఆకు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న పచ్చని పల్లెలు
-వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం తిరుమలాయపల్లె, గన్నారం, కేశవాపురం, జింకురాం తండా, ఎర్రకుంట తండా, తెట్టెకుంట తండా గ్రామాలకు కలిపి, తిరుమలాయపల్లె, గన్నారం మధ్య తోటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తిరుమలాయపల్లె (రాయపర్తి), మే 23ః కరువు కాటకాలు, అతి వృష్టి అనా వృష్టి, అడుగంటిన భూగర్భ జలాలు, నెర్రెలుబాసి బీళ్ళుగా మారిన నేలలు, ఎండిన చెరువులు, చేలు చెలకలు, నిత్యం కరువు తాండవించి అన్యాయమై పోయిన రైతాంగానికి, తెలంగాణ తెచ్చి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో చెరువులను నింపి, నీటి కరువు తీర్చి, పంటలు, దిగుబడులు పెంచి, ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చి, రైతు బంధు ద్వారా ఎదురు పెట్టుబడుటు ఇచ్చి, దిగుబడులు పెంచి, చివరకు పంటలను కూడా కొనుగోలు చేస్తూ, రైతుల రంధిని శాశ్వతంగా తీర్చిన ఘనత సీఎం కెసిఆర్ దేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గోదావరి జలాలతో రాయపర్తి రైతుల కాళ్ళు కడుగుత! మీ రుణం తీర్చుకుంటానని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం తిరుమలాయపల్లె, గన్నారం, కేశవాపురం, జింకురాం తండా, ఎర్రకుంట తండా, తెట్టెకుంట తండా గ్రామాలకు కలిపి, తిరుమలాయపల్లె, గన్నారం మధ్య తోటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి. రైతుల కష్టాలు కడతేర్చిన ఘనాపాటి. రైతుల కోసం ఇంతగా చేసిన సీఎం చరిత్రలో లేరు. నేను నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంని చూడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మనకు సీఎంగా ఉండటం మన అదృష్టం. ఆయన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అన్నారు.
కాంగ్రెస్ వి కల్లబొల్లి కబుర్లు
కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నిజాయితీగా పని చేసి ఉంటే, ఇవ్వాళ ఇన్ని కష్టతాలు మనకు ఉండేవా? అధికారంలో ఉన్నన్నాళ్లూ దోచుకోవడం, దాచుకోవడమే తప్ప, ప్రజలకు కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
బిజెపివి మాయ మాటలు
కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా, పెంచిన పెట్రో, డీజీల్, గ్యాస్ ధరల వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి, ప్రజలంతా పెనుభారంతో తల్లడిల్లే పరిస్థితి తెచ్చిందని విమర్శించారు.
ప్రతిపక్షాల అబద్ధాలను నమ్మొద్దు
ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయరు. ఇక్కడ అధికారంలోకి రావడానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. తమ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇవ్వని ఈ కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణలో ఇస్తామని వస్తున్నారని, మరి ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు? అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
పచ్చని పల్లెల్లో మత చిచ్చు పెడుతున్న బిజెపి
పచ్చని పల్లెలు, పట్టణాల్లో మత చిచ్చు పెడుతున్న బిజెపి, ప్రజల్ని మతం, కులం పేరుతో విడగొట్టి, అధికారం కోసం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని మంత్రి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు. వారికి అధికారం కావాలి. మత చిచ్చుల్లో చలి కాచుకునే నీత సంస్కృతిలోకి బిజెపి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వమతాలను సమానంగా చూస్తున్నం
సీఎం సర్వ మతాలను సమానంగా చూస్తున్నారు. అన్ని మతాల పండుగలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేశారు. మన చరిత్రను సుసంపన్నం చేసిన ప్రముఖుల జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తున్నారు. ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నారు. అన్ని కులాలు, మతాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో దేవాలయాల, విద్యాలయాల అభివృద్ధికి పెద్ద పీట
గ్రామాల్లో పురాతన దేవాలయాలను పునరుద్ధరించారు. ధూపదీప నైవేద్యాలకు నోచని దేవాలయాను అభివృద్ధి పరిచారు. పూజారులు, ఇమామ్ లు, ఫాస్టర్లకు వేతనాలు ఇస్తున్నారు. వేతనాలు పెంచారు. మన సంస్కృతికి పూర్వ వైభవం తెస్తూ, సమాజంలో భక్తి భావాన్ని పెంపందిస్తున్నారు. శాంతిని విస్తరింప చేస్తున్నారు. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
పల్లె ప్రగతి వల్ల పట్టణాలతో పోటీ పడుతున్న పల్లెలు
సీఎం కెసిఆర్ గారి మానస పుత్రిక పల్లె ప్రగతి వల్ల ఇవ్వాళ తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అన్ని రకాల సదుపాయాలు కలిగి, పల్లెలు అభివృద్ది చెందాయి. పట్టణాలతో పోటీ పడుతున్నాయి. వలసలు పోయిన ప్రజలు తిరిగి పల్లెలకు వాపస్ వస్తున్నారు అని మంత్రి తెలిపారు.
ఆకు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న పచ్చని పల్లెలు
పల్లెలు పచ్చదనాన్ని పరచుకున్నాయి. ఆకు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్నాయి. హరిత హారం పథకం కింద నాటిన మొక్కలతో గ్రీనరీ 7.7శాతం పెరిగింది. పర్యావరణానికి, సకల ప్రజల ప్రయోజనాల కోసం సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు వివరించారు.
తాను నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూస్తున్నదని, ప్రజలు సీఎం కెసిఆర్ కి అండగా నిలవాలని, సీఎం కెసిఆర్ ప్రజలకు అండగా ఉంటారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
వరంగల్ జిల్లా brs పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రానికి, దేశానికి.సీఎం కెసిఆర్ పాలన మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని, పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అదృష్ట వంతులు అని ఆయన చెప్పారు.
అంతకుముందు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు సిఎం కెసిఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కడుతున్నది. ఇంతగా ఎప్పుడూ అభివృద్ధి జరగలేదు. ఇటు నియోజకవర్గంలో దయన్నను, అటు రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ను కాపాడుకుంటేనే, వారు ప్రజలను కాపాడగలుగుతారని, ప్రజలు వారికి అండగా నిలవాలని కోరారు.
కాగా, ఆత్మీయ సమ్మేళనాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్రమేనని, తాను కూడా కార్యకర్తలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి భోజనాలు చేశారు. వారికి వడ్డించారు. అందరినీ పలకరిస్తూ, కుశల ప్రశ్నలు వేస్తూ మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.