Suryaa.co.in

Telangana

సీఎం గారూ… టెంట్లు పీకేయడం కాదు.. వారి సమస్యకు పరిష్కారం చూపండి

– రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి.

అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారు. ఇది హేయమైన చర్య.

నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE