క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు మూడో విడత కార్యక్రమం – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం వైయస్.జగన్.ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే… :
5,10,462 మందికి మంచి చేస్తూ..
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా ఈ రోజు మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ ప్రతి ఒక్కరికీ, ప్రతి చిరువ్యాపారికీ రూ.10వేలు వడ్డీ లేకుండా రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. వీరికి వడ్డీ పడకుండా రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 5.10 లక్షల మందితో కలుపుకుంటే… ఇప్పటిదాకా 14,16,091 మందికి మంచి చేయగలిగామని చాలా సంతోషంగా మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈ ఆనందాన్ని పాలుపంచుకుంటున్నాను.
నామ మాత్రపు లాభాలకు సేవలందించే గొప్ప వర్గం
ఈ వ్యాపారాలు పెద్ద ఆదాయాలు వచ్చే పరిస్థితులు కూడా కావు. అయినా కూడా తమకు తాము ఉపాధిని కల్పించుకుంటూ… నామమాత్రపు లాభాలకు సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు.
నిజానికి చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం అనే దానికన్నా వారు మనకు అందిస్తున్నది గొప్ప సేవ అని కచ్చితంగా చెప్పుకోవడం ఇంకా మంచిగా అనిపిస్తుంది.
వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని పుట్‌పాత్ మీద, తోపుడు బళ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్ సైకిళ్ల మీద, ఇంటి ముందుకు, ఇంటి సమీపంలో కూడా అమ్ముతారు. అక్కచెల్లెమ్మలు అయితే ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. ఇలాంటి లక్షలమంది చిరువ్యాపారులు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతున్నారు. మనం చేస్తున్న ఈ సహాయం ఇలాంటి వాళ్లు, వాళ్ల కాళ్లమీద నిలబడ్డానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వీళ్ల కష్టాలను దగ్గరగా చూశాను…
వీరు మాత్రమే కాకుండా… వీళ్ల ద్వారా ఇంకా అనేకమందికి కూడా మేలు జరుగుతుంది. వీళ్ల ద్వారా రవాణా చేస్తున్న ఆటోళ్ల వారికి, మూటలు ఎత్తే కూలీలకు, మిగతా రంగాల్లో ఉన్నవాళ్లకు కూడా ఉపాధి కలిగే గొప్ప కార్యక్రమం, గొప్ప వ్యవస్ధ ఇది. ఇటువంటి చిరు వ్యాపారం చేసుకుంటున్నవాళ్లు జీవితాలను గతంలో నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో బాగా దగ్గరగా చూశాను. వీళ్లందరూ అర్గనైజ్డ్ సెక్టార్‌లో లేకపోవడం వల్ల వీళ్లకు బ్యాంకుల్లో రుణాలు కూడా పుట్టని పరిస్థితిని, వీళ్ల కష్టాలు, అవసరాలను కూడా చాలా దగ్గరనుంచి నా పాదయాత్రలో చూశాను. ఏదైనా బ్యాంకులో రుణాలు ఇస్తే గ్యారంటీ ఎవరు ఇస్తారనేది పెద్ద మీమాంస.
వీళ్లకు తోడుగా నిలబడాలనే జగనన్న తోడు…
ఇటువంటి పరిస్తితుల్లో ఈ చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి, వీరికి ఏదైనా మంచి జరగాలి, వీళ్లకు అండగా ఉండాలి అని అంటే.. వీళ్లకేం చేయాలన్న ఆలోచనలోనుంచే జగనన్న తోడు అనే పథకాన్ని తీసుకొచ్చాం.
వీళ్లందరికీ కూడా ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి బ్యాంకులతో రుణాలు ఇప్పించాం. అంతే కాకుండా మేం వీరికి పూచీకత్తుగా ఉంటాం.. మీరు రుణాలు ఇవ్వండి, వీళ్లు కట్టవలసిన వడ్డీని కూడా క్రమం ప్రకారం వీళ్లు కట్టేటట్టుగా మేం మోటివేట్ చేస్తాం. వీళ్లు క్రమం ప్రకారం కడితే ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ తోడుగా నిలబడుతుందని బ్యాంకులను కూడా ఒప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
ఇందులో భాగంగానే మూడో విడత కింద ఇవాళ 5.10 లక్షల మందితో కలుపుకుని… మొత్తం 14 లక్షల మందికి మంచి చేయగలిగాం. వీళ్లంతా కూడా హోల్‌సేల్‌గా వస్తువులు కొంటారు. రోజువారీగా రిటైల్‌గా అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి అంతా కూడా వీళ్లకు బ్యాంకుల దగ్గర నుంచి గతంలో తక్కువ వడ్డీ సదుపాయం కల్పించే పరిస్థితి లేదు కాబట్టి… వీళ్లకు మరో మార్గం లేక వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకోవడం.. వాళ్లకు రూ.100కు రోజుకు రూ.10 సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చే పరిస్థితిలో వడ్డీ ఇచ్చే కార్యక్రమం. రూ.10 వడ్డీకి తీసుకుని వ్యాపారం చేసుకునే అధ్వాన్నమైన పరిస్థితిలో ఈ రంగం ఉండేది.
ఇటువంటి వారందరికీ మంచి జరగాలనే గొప్ప ఆలోచనతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున ఈ 5,10,462 మంది చిరువ్యాపారులకు ఈ రోజు రూ.510 కోట్లు వడ్డీలోని రుణాలు ఇస్తున్నాం. అంతే కాకుండా ఆరునెలలకు ఒకసారి వీళ్లందరికీ వడ్డీలు మరలా తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగా రూ.16.16 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద ఇస్తున్నాం. ఈ రెండూ కలిపి రూ.526 కోట్లు లబ్ధి చిరువ్యాపాలకు జరగనుంది.
ఇప్పటివరకు 14.16 లక్షల నిరుపేదలకు లబ్ధి
ఇప్పటివరకు 14,16,091 మంది నిరుపేదలకు ఈ లబ్ధి జరిగింది. దీనిద్వారా రూ.1416 కోట్లు వడ్డీ లేని రుణాలిచ్చే కార్యక్రమం చేపట్టాం. క్రమం తప్పకుండా వడ్డీ కట్టినవారందరికీ కూడా దాదాపుగా రూ.32.51 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కూడా ఇచ్చాం.
గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం
ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్ధను నీరుకారనీయకండి. ఇది కనుక నీరుకారిపోతే, మనం తీసుకున్న రుణాలు మళ్లీ బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్ధే కుప్పకూలిపోతుంది. కట్టిన ప్రతి ఒక్కరికీ కూడా బ్యాంకులు మళ్లీ కచ్చితంగా రుణాలిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఉంది. ఇదొక రివాల్వింగ్ ఫండ్ మాదిరి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకొండి, ఆ తర్వాత టైం ప్రకారం కట్టండి. అలా చేస్తే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తం మీకు వెనక్కి తిరిగి ఇస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లో ఉంటుంది. కానీ మనం కట్టకపోతే బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. ఇంకా లబ్ధిదారులకు ఎవరికైనా మంచి జరిగే అవకాశం కూడా మనం తీసేసినట్టవుతుందని అందరూ గుర్తెరిగి మనసులో పెట్టుకొండి. మీ కుటుంబ సభ్యుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక్కొక్కరికి మూడు, నాలుగు పథకాలన్నా లబ్ధి
జగనన్న తోడు అనే పథకం ద్వారా 14.16 లక్షల మందికి మంచి జరుగుతుందే… వీళ్లందరికీ కూడా కచ్చితంగా జగనన్న అమ్మఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణం, వైయస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు ఇటువంటి పథకాలలో ఒక్కొక్కరికి కనీసం మూడు, నాలుగు పథకాలన్నా కచ్చితంగా మీకు లబ్ది జరిగే ఉంటుందని నా ప్రగాఢమైన నమ్మకం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే… వీటన్నింటి ద్వారా మార్పు రావాలి. వీళ్ల జీవితాలు మారాలి, వీళక్లు ఇంకా మెరుగైన పరిస్థితులు రావాలి అన్న తపనతో ఇవన్నీ చేస్తున్నాం.
సాంప్రదాయ చేతి వృత్తులవారికీ…
నిరుపేదలైన చిరు వ్యాపారులకు మాత్రమే కాకుండా, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణల తయారీ దారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారీ దారులు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్కర్లు, కుమ్మర్లు ఇలా చేతివృత్తుల మీద ఆధారపడి బ్రతికేవాళ్లందరినీ కూడా జగనన్న తోడు పథకం కింద తీసుకురావడం జరిగింది. వాళ్లకు కూడా వడ్డీ లేకుండా రూ.10వేలు రుణమిచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. వాళ్లందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ పథకం పొరపాటున రాకపోతే కంగారుపడాల్సిన అవసరం లేదు. గతంలో చెప్పినట్లు.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి, అర్హులెవరూ మిస్ కాకూడదని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికైనా పొరపాటున రాకపోతే కంగారుపడకుండా మీ గ్రామ, వార్డు వాలంటీర్‌ని సంప్రదించండి. మీ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో మీరు వెళ్లి మరలా దరఖాస్తు పెట్టుకొండి. ఇటువంటి చిరు వ్యాపారుల కోసం, చిన్న కళాకారుల కోసం జగనన్న తోడు పథకాన్ని సెర్ఫ్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేకంగా www.gramasachivalayam.ap.gov.in
పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశాం. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులు అందరికీ కూడా స్మార్ట్ కార్డులు కూడా ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరిపించడం దగ్గర నుంచి రుణాలు ఇప్పించడం వరకు పూర్తిగా గ్రామ, వార్డు వాలంటీర్లు అన్ని రకాలుగా చేయిపట్టుకుని నడిపిస్తారు. ఏ ఒక్కరికి అవసరం ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి రుణాలు ఇప్పిండం వరకు కూడా ప్రతి అడుగులోనూ ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తారు.
ఏమైనా సందేహాలుంటే…
ఈ లబ్ధిదారులకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక టెలిఫోన్ నంబరు 0891 2890525 పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సందేహాలుంటే కచ్చితంగా ఈ నంబరుకు ఫోన్ చేస్తే అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటూ, మీ సమస్యను పరిష్కరిస్తారు.
దేశంలో చిరువ్యాపారులల్లో దాదాపుగా 82 శాతం కోవిడ్ కారణంగా ఆదాయాన్ని కోల్పోయి.. ఆహారం లేక అనేక అవస్ధలు పడ్డారు అని ఈ మధ్య కాలంలో రకరకాల రిపోర్టులలో మనం చూస్తున్నాం.
ఈ మధ్య కాలంలోనే అటువంటి రిపోర్ట్ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్ధ సర్వే చేసిన వివరాలను కూడా చూశాం. అటువంటి అవస్ధల నుంచి మన రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని కాపాడేందుకు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమం పథకం కూడా… నేరుగా బటన్ నొక్కిన వెంటనే మీ అకౌంట్లలోకి వెళ్లేటట్టుగా డీబీటీ పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచాలకు అవకాశం ఇవ్వకుండా నేరుగా దాదాపు రూ.1.29 లక్షల కోట్లు పేదలకు వారి ఖాతాల్లోకి అందించాం. కాబట్టే దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే పేదలను మన ప్రభుత్వం అక్కున చేర్చుకుందని సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఇంకా దేవుడు మంచి అవకాశాలు ఇవ్వాలని, మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని, మీ అందరికీ మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో సీఎం జమ చేశారు.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.