Suryaa.co.in

Andhra Pradesh

చిట్టి తల్లుల కోసం-ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు

– మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
– స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కిశోర బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ
– స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌
ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:
చిట్టి తల్లుల కోసం – ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల స్కూల్‌ చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే అని చెప్పి యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ సఫ్లై అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదికలో స్పష్టంగా చెప్పారు.
ఇటువంటి పరిస్ధితులు మారాలి, ఈ చిట్టి తల్లులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వీరికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
పరిస్ధితి మారాలి
ఇందులో భాగంగానే నాడు–నేడు పథకం ద్వారా బాత్రూమ్‌లు బాగుచేయడం దగ్గర నుంచి మొదలుపెడితే, శుభ్రమైన నీరు మొదలుకుని ఇవాళ ప్రారంభిస్తున్న స్వేచ్ఛ కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతుంది.
దేవుడి సృష్టిలో భాగమైన ఈ రుతుక్రమానికి సంబంధించిన అంశాలను, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అన్న పరిస్ధితి మారాలి. ఈ పరిస్ధితి పోయి ఇటువంటి విషయాలలో ఆ చిట్టితల్లులకు తగినంత అవగాహన కూడా ఇవ్వాలి.
నెలకొక్కసారి- అవగాహన సదస్సు
ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు వారితో పాటు గ్రామ సచివాలయంలో ఉన్న ఏఎన్‌యంలు, వీళ్లందరూ కూడా ఈ పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టి, వీరిని ఎడ్యుకేట్‌ చేయాలి.
ఇందులో భాగంగానే మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు వారితోపాటు గ్రామసచివాలయంలో ఉన్న ఏఎన్‌ఎంలు భాగస్వామ్యులై 7 నుంచి 10 వరకు చదువుతున్న పిల్లలకు నెలకు ఒకసారి కచ్చితంగా అవగాహనా కార్యక్రమాలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి.
నెలకొకసారి జరిగే ఈ ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో మనం నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్న మహిళా అధ్యాపకురాలతో పాటు, అదే గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
దిశా పైనా అవగాహన
ఈ కార్యక్రమంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై చెప్పడమే కాకుండా, మహిళా పోలీసు దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్‌ చేసుకోవాలన్నదానిపై కూడా అవగాహన కలిగించాలి. దిశ యాక్టు గురించి కూడా అవగాహన వచ్చేలా అర్ధమయ్యేలా చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యశాఖలు కలిసికట్టుగా చేపట్టాలి. ఈ మొత్తం కార్యక్రమం ప్రతి జిల్లాలోనూ జేసీ ఆసరా పర్యవేక్షణలో జరగాలి.
10 లక్షల మంది పిల్లలకు ఉచితంగా పంపిణీ
ఈ రోజు ప్రారంభిస్తున్న స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షలకు పైగా 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న టీనేజ్‌ పిల్లలందరికీ కూడా సుమారు రూ.32 కోట్లు వ్యయంతో నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అన్నింటిలోనూ 7 నుంచి 12 తరగతి వరకు చదువుతున్న దాదాపు 10 లక్షల పై చిలుకు ఉన్న ఈ చిట్టి తల్లులందరికీ కూడా ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్, హైజీన్‌ అండ్‌ హె ల్త్‌ కేర్‌కు చెందిన విస్పర్‌ బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు గోరఖ్‌పూర్‌ (యూపీ)కు చెందిన ప్రఖ్యాత నైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా నాప్‌కిన్స్‌ సరఫరా చేస్తోంది.
ఈ కంపెనీలు నాణ్యమైన బ్రాండెడ్‌ నాప్‌కిన్స్‌ను ఒక్కొక్క చిట్టితల్లికి నెలకు పదిచొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందజేస్తారు. వేసవి సెలవుల్లో ఉన్నప్పుడు సెలవుల కంటే ముందే ఒకేసారి స్కూళ్లో పంపిణీ చేస్తారు.
స్వేచ్ఛ- నోడల్ అధికారిగా మహిళా ఉపాధ్యాయురాలు
ఈ స్వేచ్ఛా పథకం అమలు కోసం ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్‌ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నాం. ఆమె ఈ మొత్తం కార్యక్రమం అమలు బాధ్యతను సంబంధిత స్కూలు, కాలేజీలో పర్యవేక్షిస్తుంది.
వినియోగించిన శానిటరీ నాప్‌కిన్స్‌ పర్యావరణానికి నష్టం జరగకుండా ఎలా డిస్పోజ్‌ చేయాలన్నదానిపై కూడా అవగాహన కలిగించే కార్యక్రమం జరుగుతుంది. వీటిని సురక్షితంగా డిస్ఫోజ్‌ చేసేందుకు, వాటిని భస్మం చేసి పర్యావరణ హాని రహితంగా మార్చేందుకు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6417 ఇన్సినరేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాల్టీలలో అయితే ప్రత్యేకంగా డస్ట్‌బిన్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కూళ్లలో కూడా బాత్రూమ్‌లలోనే ఇన్సినరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపధ్యంలో డిస్పోజల్‌ ఎలా చేయాలన్నది చాలా ముఖ్యం కాబట్టి, దానిపైన కూడా నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్న మహిళా అధ్యాపకురాలు అవగాహన కలిగించాలి.
వైయస్సార్ చేయూత దుకాణాల ద్వారా గ్రామ స్ధాయిలోకి కూడా స్కూళ్లు, కళాశాలల్లో ప్రారంభమవుతున్న ఇవి గ్రామ స్ధాయిలోకి కూడా ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఉపయోగపడేలా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇవే నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నాం. అందుకోసం వైయస్సార్‌ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం చేపడుతున్నాం. ఇవి ఆయా దుకాణాల్లో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. చేయూత ద్వారా షాపులు నడుపుతున్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్ధికంగా మరో వనరు లభిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 56703 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో మనబడి నాడు–నేడు కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ… నిరంతర నీటిసరఫరాతో కూడిన బాత్రూమ్‌లను చిట్టితల్లుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నాం. ఇవి ఇప్పటికే జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ నాడు–నేడు కింద 15,715 పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం పూర్తయింది. జూలై 2023 నాటికి అన్ని పాఠశాలల్లో కూడా నిర్మాణం పూర్తి చేసి, ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్‌మాష్టారుతో కూడిన పేరెంట్స్‌ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశాం.
మహిళా సాధికారితలో 28 రాష్ట్రాల కంటే ముందున్న ఏపీ
మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే మనం ముందున్నాం. వైయస్సార్‌ అమ్మఒడి, వైయస్సార్‌ సంపూర్ణ పోషణం, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ సున్నావడ్డీ రుణాలు, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఇళ్ల పట్టాలు, వైయస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మనది అని ఈ రెండున్నర సంవత్సరాల మన ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.చరిత్రను మార్చే శక్తి రాష్ట్రంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలకు ఉంది అని గట్టిగా నమ్మే ప్రభుత్వం మనది.
చివరగా..
కచ్చితంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ చేస్తున్నదానికన్నా కూడా ఇంకా మెరుగైన పరిపాలన ఇవ్వాలని ప్రార్ధిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.అనంతరం స్వేచ్ఛ కార్యక్రమాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం, స్వేచ్ఛ పోస్టర్‌ను విడుదల చేశారు.
కార్యక్రమంలో భాగంగా సీఎం వైయస్‌.జగన్ సమక్షంలో వైయస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా తక్కువ ధరకే నాప్‌కిన్స్ సరఫరా చేయడానికి పి అండ్ జి (విష్పర్‌), నైన్ బ్రాండ్‌ల ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలు మార్చుకున్న సెర్ఫ్ సిఈఓ ఇంతియాజ్‌.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, సెర్ఫ్‌ సీఈఓ ఇంతియాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రి సెల్వి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి, మెప్మా డైరెక్టర్‌ వి విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE