Home » చలనచిత్ర రంగానికి తీరని లోటు: కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

చలనచిత్ర రంగానికి తీరని లోటు: కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడు గా, నిర్మాత గా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారని గుర్తు చేసుకున్నారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారని అన్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు సీఎ వైఎస్ జగన్.

Leave a Reply