Suryaa.co.in

Andhra Pradesh

విశాఖలో ప్రతిష్టాత్మక సదస్సులపై సీఎం సమీక్ష, ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు

విశాఖలో త్వరలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్-2023, జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్-2023 వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నఅపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలని సీఎం సూచించారు. దీనికి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలని ఆకాంక్షించారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామని అధికారులు వివరించగా..విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరీశించాలని సూచించారు. అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయడంతోపాటు వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్నారు ముఖ్యమంత్రి.

విశాఖలో మార్చి 28 నుంచి 29వరకు జరగనున్న జీ–20 సన్నాహక సదస్సుకు ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. *పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆతిథ్యం, రవాణా ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, ఏర్పాట్లకు సంబంధించిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు.

ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జీ-20 సన్నాహాక ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

LEAVE A RESPONSE