– జగన్‌ను ఓడిస్తేనే ఆంధ్రాకు బతుకు
– ప్రచారానికి హైదరాబాద్ నుంచి ‘చలో సత్తెనపల్లి ’
– కన్నాను గెలిపిద్దాం- సత్తెనపల్లి ని రక్షిద్దాం
– హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసుల ఆత్మీయసమ్మేళనం
– కన్నా కోసం ప్రచారానికి వస్తామన్న హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసులు
– ఏపీని బతికించుకోవలసిన బాధ్యత మీదేనని కన్నా పిలుపు
( మహానాడు, హైదరాబాద్ ప్రతినిధి)
రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణను గెలిపించేందుకు సతె్తనపల్లికి తరలివెళ్లాలని హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసులు తీర్మానించారు. హైదరాబాద్‌లో జరిగిన సత్తెనపల్లి వాసుల ఆత్మీయ సమ్మేళంలో ఆ మేరకు ప్రతిజ్ఞచేశారు.
‘కన్నాను గెలిపిద్దాం- సత్తెనపల్లి ని రక్షిద్దాం’ అనే నినాదంతో, హైదరాబాద్‌లో ఉన్న సత్తెనపల్లి వాసులు సత్తెనపల్లి లో ప్రచారం నిర్వహించాలని సమ్మేళనంలో మాట్లాడిన పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి కి తరలివెళ్లాలని కోరారు.
‘‘కన్నాను గెలిపించే బాధ్యత మనందరిదీ. మనకోసం కాదు. సత్తెనపల్లి ప్రతిష్ఠకోసం. కన్నాను గెలిపిస్తేనే మన సత్తెనపల్లి క్షేమంగా ఉంటుంది. కబ్జాదారులు, దౌర్జన్యకారుల నుంచి సత్తెనపల్లి ని కాపాడుకోకపోతే మన సత్తెనపల్లి చరిత్ర గర్భంలో కలసిపోతుంద’’ని పలువురు ప్రముఖులు హెచ్చరించారు.
‘‘ఇది పార్టీలు-కులాలు-మతాలకు అతీతంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం. మన లక్ష్యం సత్తెనపల్లి ని రక్షించుకోవడం. అది కన్నా లక్ష్మీనారాయణకే సాధ్యం. ఆయన అందరి మనిషి. అందరికీ అందుబాటులో ఉండే మనిషి. హుందాగా ఉండే నాయకుడు. ఇప్పటి ఎమ్మెల్యే మాదిరిగా అడ్డగోలుగా మాట్లాడే నాయకుడు కాదు. ఆయన జనం మనిషి. నమ్మినవారికోసం ఎక్కడిదాకానయినా వెళ్లే నిజమైన నాయకుడు. కన్నా మనకు, మన జిల్లాకు కొత్తకాదు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేశారో చూశాం. కన్నాతో సత్తెనపల్లి ప్రతిష్ఠ పెరగాలంటే టీడీపీకి ఓటు వేయాలి. మీరు మాత్రమే కాదు. సత్తెనపల్లి లో ఉన్న మీ బంధువులందరికీ కన్నాను గెలిపించాలన్న సందేశాలను యుద్ధప్రాతిపదికన పంపించండి’’ అని ఆత్మీయసమ్మేళంలో మాట్లాడిన వక్తలు పిలుపునిచ్చారు. కన్నాను గెలిపించుకునే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సత్తెనపల్లి లో టీడీపీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో జగన్ నియంతపాలనకు సత్తెనపల్లి నుంచే తెరదించాలి. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరం. ఈ నియంత కొనసాగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే కాదు. ప్రజలూ బతికి బట్టకట్టడం కష్టం. మీ ఇళ్లలోకి వచ్చి నేరుగా దోపిడీ చేస్తారు. కూల్చే ప్రభుత్వం కావాలో, నిర్మించే ప్రభుత్వం కావాలో తేల్చుకోండి. ఎన్నికల ప్రచారానికి మీరంతా వచ్చి సత్తెనపల్లి పరిరక్షణ-అభివృద్ది నినాదంలో పాలుపంచుకోండి.నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. మీ సహకారం మరువను. నన్ను పిలిచి పెద్ద భరోసా ఇచ్చారు. మనమంతా కలసి ఏపీని బతికించుకోవలసి ఉంది. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయమిది. హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసులంతా ప్రచారానికి రావాలని ఆహ్వానిస్తున్నా’’నని కన్నా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా యెల్లినేడి సాంబశివరావు. మొక్కపాటి రామచంద్రరావు. నర్రా బాబురావు.వాసిరెడ్డి నరేంద్ర కుమార్. ప్రత్తిపాటి త్రినాథ్. గుంటూరు ఆశీర్వాదం. మేడిపల్లి మోహన్. పాతూరి సుబ్బారావు. వెంకట్రావు. పద్మా చౌదరి. మరియు వివిధ హోదాలో ఉన్న నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.