Suryaa.co.in

Political News

జన నేతగా మారిన లోకేష్!

2014 నుంచి….2019, 20,21 ప్రాంతాల వరకు నారా లోకేష్ పై రాజకీయ వర్గాలలో పేలిన జోకులు, ఎత్తిపొడుపులు, ఎకసెక్కాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ కి చెందిన రాజకీయ వర్గాల వారి మాటల ట్వీట్ల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. లోకేష్ పై వైసీపీ అనుకూల సోషల్ మీడియా లో మాటల దాడి ఒక రేంజ్ లో జరిగింది.

ఒక దశలో, తెలుగుదేశం నేతలు కూడా లోకేష్ పై మాటల దాడిని తిప్పికొట్టలేక,ఆత్మరక్షణ లో పడి పోయారా అని పించేది. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న తెలుగుదేశం అభిమాన శ్రేణులు కూడా… లోకేష్ సమర్ధత పై ఆలోచనల్లో పడ్డాయి. చంద్రబాబు తరువాత, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమైంది. ఈ కారణం గానే, ఎవరో రావాలి, పార్టీని కాపాడాలి అంటూ అక్కడక్కడా ఫ్లెక్సీలు కూడా దర్శనం ఇచ్చాయి.
ఇదంతా గతం.

రాష్ట్ర రాజకీయాలపైన, తాను మాట్లాడదులుచుకున్న అంశాల పైన, అప్పటికప్పుడు ఎదురయ్యే సంఘటనల పై స్పందించవలసిన తీరుపైన తిరుగులేని పట్టును లోకేష్ ఇప్పుడు సాధించారు అనే భావన కలుగుతున్నది, ఆయన వ్యవహార శైలిని కొంచెం పరిశీలించినప్పుడు.
పాదయాత్రల్లో నాయకులు సహజంగానే వ్యక్త పరిచే మ్యానరిజం లలో లోకేష్ -మాస్టర్స్ డిగ్రీ చేశారా అన్నంతగా జనం తో కలిసి పోయారు.

పార్టీ పరంగా జరిగే అన్ని కీలక సమావేశాల లోనూ క్రియాశీలకం గా వ్యవహరించడం తో పాటు, ప్రతి అంశం లోనూ సర్వే లపై ఆధారపడి లోతుగా అధ్యయనం. చేస్తూ,నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీ పై పట్టును పెంచుకుంటూ వచ్చారు.

ఇప్పుడు లోకేష్ లో పరిణితి చెందిన… తెలుగుదేశం ‘ఉత్తరాధికారి’ కనిపిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను నిక్ నేమ్ లతో ట్వీట్లు చేసి ఇప్పుడు ఎంతకాలం అయిందో. తెలుగుదేశం జనాలలో కూడా – ఎవరో రావాలీ… ఈ పార్టీని కాపాడాలీ…అనే కూనిరాగాలు ఇప్పుడు వినపడడం లేదు.

అయితే, చంద్రబాబు వ్యవహార శైలి కి లోకేష్ వ్యవహార శైలి భిన్నం గా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతుంటారు.చంద్రబాబు ఒక పట్టాన నిర్ణయాలు తీసుకోరనే భావం టీడీపీ వర్గాలలో ఉంది. వీలైనంత వరకు అందరినీ కలుపుకు పోవాలనే తత్వం ఆయనది.

వళ్ళు నొప్పులు వచ్చి, డాక్టర్ కు కబురంపితే ; ఆయన వచ్చి చూసి, ” ఓ డోలే 650 టాబ్లెట్ వేసుకోండి సర్ ” అని సలహా ఇస్తే, చంద్రబాబు వెంటనే ఆ టాబ్లెట్ వేసుకోరు. అందుబాటులో ఉన్న నాయకులకు కబురుపెట్టి, వారితో ఓ అయిదారు గంటలు చర్చిస్తారు. అప్పటికి వళ్ళు నొప్పులు వాటంతట అవే తగ్గుతాయి.

ఇందుకు లోకేష్ భిన్నం అని తెలుగుదేశం వర్గాలు అంటుంటాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకోడానికి, లోకేష్ ఒక నిముషం కూడా సంకోశించరు అని టీడీపీ పార్టీ ఆఫీస్ వర్గాలు అంటుంటాయి. బహుశా, తరం మార్పువల్ల చోటుచేసుకున్న పరిణామ క్రమమే లోకేష్ లోని ఈ దూకుడు స్వభావం కావచ్చు.

రేపటి ఎన్నికల్లో అధికారం లభించినా, లభించకపోయినా నారా లోకేష్ మాత్రం రాజకీయంగా చాలా పరిణితి చెందారనడంలో సందేహం లేదు. జనాభాలో నలభై శాతానికి పైబడి జనంలో తెలుగుదేశం పట్ల ఉన్న అభిమానాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెడతారనే అభిప్రాయం టీడీపీ లో ఉంది.రాజకీయ వారసత్వం విషయం లో చంద్రబాబు నాయుడు మాత్రమే అదృష్టవంతులు అని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలను అమితం గా ప్రభావితం చేసే రెండు ప్రాంతీయపార్టీలు – ఇప్పటికి తెలుగుదేశం, వైసీపీ లే కదా. తెలుగుదేశం కు చంద్రబాబు తరువాత లోకేష్ అని జనం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు.

తమిళనాడు లో కరుణానిధిని ముఖ్యమంత్రి స్టాలిన్ మరిపింప చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ యోధుడు ములాయం సింగ్ యాదవ్ ను ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ మరిపింప చేస్తున్నాడు. ఒరిస్సా లో బిజూ పట్నాయక్ ను , ఆయన కుమారుడు…., ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరిపిస్తున్నారు.

వీరంతా తండ్రులను మించిన తనయులుగా ప్రజల మన్ననలను పొందుతున్నారు.నారా లోకేష్ కూడా, ఏదో ఒక రోజున – తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపుకు నోచుకుంటారని అనిపిస్తున్నది.

భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE