Suryaa.co.in

Andhra Pradesh

మీరే నేరం చేసి ఎదుటి వారిపై నెట్టడం మీ ట్రేడ్‌ మార్క్‌ కాదా?

– సీఎం జగన్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ

తేది : 18.10.2022
బహిరంగ లేఖ
వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌.
విషయం : మీరే నేరం చేసి ఎదుటి వారిపై నెట్టడం మీ ట్రేడ్‌ మార్క్‌ కాదా?
భస్మాసురుడు తన నెత్తిన తానే చేయిపెట్టుకున్నట్లు మీరు సృష్టిస్తున్న ప్రాంతీయ చిచ్చులో మిమ్మల్ని మీరే కాల్చుకుంటున్నారు.

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే అధికారం మీకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసీ మూడుముక్కలాడటం ప్రాంతీయ చిచ్చు పెట్టడం కాదా? పన్నుల మోత, ధరల వాత, సంక్షేమ పథకాల కోత, విద్యుత్‌ కోత, మీ దోపిడి, మీ నేరాలు – ఘోరాలపై వచ్చే ప్రజా వ్యతిరేకతను డైవర్షన్‌ చేయడానికే ప్రాంతీయ, కుల చిచ్చు పెట్టడం నిజం కాదా?

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీకుందా?
1. 73 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇంతలా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు గతంలో ఏప్పుడైనా వచ్చాయా? ఇప్పుడే పెచ్చురిల్లడమంటే ఈ నేరం అధికారంలో ఉన్న వాళ్లది కాదా?
2. మూడు ముక్కలు చేసే అధికారం మీకు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పాక కూడా గర్జనలు చేపట్టడం అంటే ప్రాంతీయ చిచ్చు పెట్టడం కాదా?
3. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎమ్మెల్యే చెన్నారెడ్డి ద్వారా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తెలుగు జాతి మధ్య విద్వేషం సృష్టించింది నిజం కాదా?
4. నేడు మీరు రాయలసీమ లిప్ట్‌ పేరుతో ప్రాంతీయ చిచ్చు పెట్టే పని చేయలేదా? ఈ చిచ్చు వల్ల బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏపీకి కృష్ణ, గోదావరి జలాలలో కల్పించిన ప్రత్యేకహక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేసింది నిజం కాదా?
5. మీరే అసెంబ్లీలో 30వేల ఎకరాలున్న ప్రాంతమే రాజధానిగా ఉండాలని అమరావతికి సంపూర్ణ మద్ధతు ప్రకటించి నేడు మడమ తిప్పి అమరావతిపై విద్వేషం రెచ్చగొట్టడం ప్రాంతీయ చిచ్చుపెట్టడం కాదా?
6. మూడున్నరేళ్లల్లో పన్నుల మోతలు, ధరల వాతలు విచ్చలవిడి లూఠీ, సంక్షేమ పథకాల కోతలపై ఇంటింటికి వెళ్లే మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్‌ కోసం ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం నిజం కాదా?
7. గొడ్డలి వేటును గుండెపోటుగా మీ అవినీతి సాక్షిలో ప్రసారాలు చేయలేదా? మీ గొడ్డలి పోటును నారా వారిపై నెట్టడం నిజం కాదా?
8. మీరే కోడికత్తి నాటకం ఆడి ఆ నేరాన్ని టీడీపీపై నెట్టడం నిజం కాదా?
9. కోనసీమలో మీ మంత్రి ఇల్లు మీరే తగలబెట్టించుకొని కులచిచ్చుపెట్టే యత్నం చేసింది నిజం కాదా?
10. 39 మంది డీఎస్పీ ప్రమోషన్లలో 35 మంది కమ్మ వారు ఉన్నారని ఆనాడు అబద్దం చెప్పి నేడు అసెంబ్లీ సాక్షిగా అది అబద్దమని హోం మంత్రి చెప్పడం నిజం కాదా?
11. అమరావతిని కమ్మరావతి అని పదే పదే కులచిచ్చుతో రెచ్చగొడుతున్నది నిజం కాదా?
12. 73 ఏళ్ల ఏపీ చరిత్రలో దేవాలయాలపై ఎన్నడూ జరగనన్ని దాడులు చేసింది నిజం కాదా? 226 దేవాలయాలపైన దాడులు వాస్తవం కాదా?
13. పింక్‌ డైమెండ్‌ నారా వారి ఇంట్లో ఉందని ఆనాడు అబద్దాలు చెప్పి, నేడు అసలు పింక్‌ డైమెండ్‌ లేదని కోర్టులో కేసు ఉపసంహరించుకున్నది నిజం కాదా?
14. అవినీతి పాపపు సొమ్ముతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సాక్షి లైసెన్స్‌ కూడా రద్దు చేశారు. కోర్టు స్టేలో నడుపుతున్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని సాక్షి మీడియాకు తరలిస్తూ నీలిమీడియా సామ్రాజ్యం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న మీడియాపై దుష్ప్రచారం చేస్తే మరోసారి నమ్మి మోసపోవడానికి ఆంధ్రులు సిద్ధంగా లేరని తెలుసుకోలేకపోతున్నారా?
15. మూడున్నరేళ్లల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలో తట్ట మట్టి అయినా వేశారా? ఆ ప్రాంతాల్లో భూకబ్జాలు, గనుల దోపిడీ కాక చేసింది ఏముంది?
16. మీరు నేరాలు చేయడం.. వాటిని ఎదుటివారిపై నెట్టడం.. మీ ట్రేడ్‌ మార్క్‌ గా ఉంది. ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య పెడుతున్న చిచ్చులో మీరు కాలిపోక, కూలిపోక తప్పదని నడుస్తున్న చరిత్ర రుజువు చేయడం లేదా?

కింజరాపు అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు

LEAVE A RESPONSE