Suryaa.co.in

Family

తోడూ నీడగా..

ప్రతి మనిషికి తోడూ నీడా అవసరమే. పెళ్ళికి ముందు ఈడూ జోడూ అందం.. తరువాత ముఖ్యంగా అరవై దాటాక తోడూ నీడా అవసరం. అసలు ప్రణాళిక ఎలా ఉండాలంటే 25-35 మధ్య వివాహం, ఒకరిద్దర్ని కనే ప్రక్రియ ఐపోవాలి.

60-65 దాటేసరికి పిల్లలు జీవితంలో సెటిల్ ఐపోవాలి ఉద్యోగ వివాహ బంధాల్లో. బాధ్యతల నుంచి విముక్తులం కావాలి. ఎటువంటి ఋణభారం EMI లు ఉండకూడదు. అప్పుడు మన అవసరాలకి సరిపోయేలా 2BHK తీసుకుని అందులో ఉంటూ ప్రశాంతంగా జీవితంలో చివరి 20-25 ఏళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకి నచ్చిన విధంగా గడిపేయాలి.

పిల్లలు ఎక్కడున్నా టచ్ లో ఉంటూ ఉండాలి. మనపై గౌరవం ఉండే విధంగా మనం వాళ్ళని పెంచగలగాలి. ఆర్ధికంగా మనం వాళ్ళకి భారం కాకుండా ముందు నుంచే మంచి ప్రణాళికలు వేసుకుని అమలు పరచాలి. ఎవరి జీవితం వారిదే అన్నట్లు అవకాశం కుదిరినప్పుడు కలుస్తుండాలి. వాళ్ళ స్వేచ్ఛకి మనం, మన స్వేచ్ఛకి వాళ్ళూ అవరోధం కాకూడదు.

పూర్వంలా మన పిల్లలు మన దగ్గరే ఉండాలి, మన తల్లిదండ్రులు మన వద్దే ఉండాలి అనుకునే రోజులు కావు ఇవి.‌. స్వేచ్ఛ అందరికీ ముఖ్యమే. ప్రస్తుతం ట్రెండ్, అందరి ఆలోచనా సరళి ఈ మాదిరిగానే ఉంటోంది. మనకి.. 60-65 + వాళ్ళకి మనశ్శాంతి ప్రశాంతత ఆరోగ్యం చాలా చాలా అవసరం. అలాగే తోడూ నీడా కూడా.

భార్యాభర్తలే ఒకరినొకరు అంటిపెట్టుకుని చివరి వరకూ ఉండేది. జీవితం శాశ్వతం కాకపోయినా జీవితంలో అతి ముఖ్యమైన వివాహ బంధం మాత్రం శాశ్వతమే. మనకి తోడూ నీడా మన జీవిత భాగస్వామే.. మన కన్నబిడ్డలు వారి భర్తలకు భార్యలకు శాశ్వతం గానీ మనక్కాదనే విషయం మనం గ్రహించాలి. అంతమాత్రాన కుటుంబ బాంధవ్యాలకు దూరమైపోవాలని కాదు.

పరస్పర సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి.. అందుబాటులో ఉండాలి.. ఆవసరాల్లో ఆదుకోవాలి. మనవల్ల మన పిల్లలు, మన పిల్లల వల్ల మనం ఆనందంగా ఉండగలగాలి. ఇక.. 60-65 దాటిన వృద్ధాప్యంలో ఆలుమగలు ఇద్దరే ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా నీడగా అర్ధం చేసుకునే విధంగా ఉండాలి. వాదోపవాదాలు మనస్పర్ధలు ఉండకూడదు.

ఇప్పుడు మన సమాజంలో 60-70 దాటిన వారు అనేక మంది అనేక విధాలుగా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.. ఎమోషన్స్ ఆదుపులో ఉంచుకో లేకపోతున్నారు.. కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారు.. సరియైన ప్లానింగ్ అవగాహన లేక ఆర్ధికంగా ఇతరత్రా కూడా మోసపోతున్నారు. మనశ్శాంతి కోల్పోతున్నారు.. అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు.

రాకూడని ముందస్తు మరణాలకు గురౌతున్నారు.. మిగిలిపోయిన భార్య/భర్త తీవ్ర ఆవేదన ఇబ్బందులకు లోనవుతున్నారు. అంతా కాకపోయినా చాలా వరకూ మనం నివారించగలం. అరవై వరకు బ్రతకడం ఓ కల అని, అరవై దాటాక మరో అరవై వరకు బ్రతకడం ఓ కళ అని .. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిపుణులు అంటారు. హార్ట్ లోనే ఆర్ట్ ఉంది. మన శేష జీవితం కళాత్మకంగా మలచుకోవడంలో ఓ కళ ఉంది. heartful artistic life మన సొంతం కావాలనే ధ్యేయంగా.. 101 not out . still active.. అనే విధంగా మన జీవితం కొనసాగాలి.

– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం,
ఫోన్ 99855 61852

LEAVE A RESPONSE