-రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్కైవాక్ నిర్మాణం
-ఉప్పల్ స్కైవాక్ ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు
హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టును పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటి రామారావు గారు సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బాటసారి భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ఎంతో దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.తొలుత మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ శిలాఫలకాన్ని మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి మంత్రి మల్లారెడ్డి తో కలిసి మంత్రి కేటీఆర్ స్కైవాక్ ఎస్కలేటర్ వద్ద రిబ్బన్ కత్తిరించి స్కైవాక్ ను ప్రారంభించారు.
స్కైవాక్ పైన హెచ్ఎండిఏ ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను, స్కైవాక్ మోడల్ ను సందర్శించి వాటి వివరాలు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
స్కైవాక్ పైన మొత్తo కలియతిరిగి దేశంలోని ప్రధాన పట్టణాలకు మార్గదర్శకంగా స్కైవాక్ ప్రాజెక్టును అద్భుతంగా చేశారని స్పెషల్ సిఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ ను, ఇంజనీర్లను, మంత్రి కేటీఆర్ అభినందించారు. స్కైవాక్ పరిసర ప్రాంతాలను గ్రీనరీతో అందంగా మలచిన అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ బి.ప్రభాకర్ ను మంత్రి అభినందించారు.
ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్, అసిస్టెంట్ ఇంజనీర్ మధులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.