– తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని సీఎం స్టాలిన్ ఆదేశం !
చెన్నై: ఆర్భాటాలకు ఆమడ దూరంలో వుంటూ దేశంలోనే అతిశక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచిన సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో ఎలాంటి హడావుడి వుండరాదని భద్రతా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తన కాన్వాయ్‌లో వుంటున్న 12 వాహనాలను కుదించి, ఆరుకు తగ్గించారు. అంతేగాక రోడ్లపై అన్ని వాహనాలతో పాటే తన కాన్వాయ్ కూడా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, తన కాన్వాయ్ కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపొద్దని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన తన వ్యక్తిగత భద్రతా విభాగాన్ని, రాష్ట్ర పోలీస్‌శాఖను ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 1వ తేదీన అడయార్‌లో జరిగిన దివంగత నటుడు శివాజీ గణేశన్ 96వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్న విషయం తెలిసిందే. స్మారక మందిరం రోడ్డు పక్కనే వుండడంతో సీఎం పాల్గొన్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో 25 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వచ్చింది. దీంతో వందలాదిమందితో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. ఆ కారణంగా ఆయన ఆ రోజు ఆలస్యంగా విధులకు హాజర వ్వాల్సివచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తనను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు హైకోర్టు హక్కుల ఉల్లంఘన కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ రాష్ట్ర హోంశాఖను ప్రశ్నించారు.
‘సీఎం, మంత్రులు విధులకు వెళ్లేటప్పుడు కూడా వారి వాహనాలను ఇలాగే నిలిపేయగలరా?.. వారి సమయంలానే న్యాయమూర్తుల సమయం కూడా విలువైనదే కదా?.. వారికిచ్చే గౌరవమర్యాదలు న్యాయమూర్తులకు కూడా ఇవ్వాల్సిందే కదా?’ అని ప్రశ్నించారు. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పట్ల సీఎం కూడా అధికారుల దగ్గర విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు కూడా ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. న్యాయమూర్తుల విధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది