కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేది
రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని మరిచిపోయావా?
నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు
నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు
కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది
91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
చిన్నారెడ్డి నాకు పెద్దన్నలాంటి వారు…ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి.తెలంగాణలో వనపర్తికి ఒక ప్రాముఖ్యత ఉంది. 1952లో సురవరం ప్రతాప్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1959లో ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజి ప్రారంభించారు. నేను చదువుకుంది వనపర్తిలోనే.. నాకు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. నాడు ఉద్యమ సమయంలో ఏముండే… ఇప్పుడు వందలాది ఎకరాలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకుంటే వారి శిష్యుడు నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు
అభివృద్ధిలో ముందుండాల్సిన వనపర్తికి నిరంజన్ రెడ్డి చెడ్డపేరు తెచ్చారు.వనపర్తి ఎమ్మెల్యే అంటే అత్యంత అవినీతిపరుడనే ముద్ర పడింది నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు అని రాష్ట్రమంతా కోడై కూస్తోంది.ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం కాదు..మన అభివృద్ధి.. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి. పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా మీరు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటుండు. చింతమడకకు రోడ్డు వేసింది…సిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజి కట్టింది కాంగ్రెస్.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేది. తెలంగాణ వస్తే రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండవు అనుకున్నాం.తెలంగాణ వస్తే సింగరేణి, విద్యుత్ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని కలలు కన్నారు.దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం… పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత కలలు నెరవేరాయి తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు.
కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది.కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు దోచుకుండు పదేళ్లు కేసీఆర్ దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని దోచుకుంది. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు… ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వండి.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది.
మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫైర్
పంచె కట్టుకుని నిరంజన్ రెడ్డి తనకు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుకుంటుండు.లాల్చీ వేసుకున్న ప్రతీ వాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు..2018 నుంచి 2021 వరకు 83వేల మందికి రైతుబీమా ఇచ్చామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.మూడేళ్లలో 83వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న నరహంత ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వం.తెలంగాణ వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్…కేసీఆర్ కాదా? రైతు ఆత్మహత్యలను ఆపేందుకే కాంగ్రెస్ రైతు భరోసా పథకం ప్రకటించింది.
పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదు ?
నాగర్ కర్నూల్ : 30ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో జనార్దన్ రెడ్డి పేరు మారుమోగుతోంది. అది నాగం జనార్దన్ రెడ్డి కావొచ్చు.. మర్రి జనార్దన్ రెడ్డి కావొచ్చు. ఆయన సంగతి ఈయన… ఈయన సంగతి ఆయన చెప్పిండ్రు.. కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 75 ఏళ్ల తరువాత మీ పాలమూరు బిడ్డనైన నాకు సోనియమ్మ గొప్ప బాధ్యతను ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపించే అవకాశం సోనియమ్మ ఇచ్చినందుకు మీరు ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. పాలమూరు బిడ్డలు ఆలోచన చేయండి…మీ బిడ్డగా మీ ముందు నిలబడి విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఒక్క అవకాశం వచ్చింది.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పాలమూరును పసిడి పంటల పాలమూరుగా మార్చుకుందాం.
ఆదరించి అందలం ఎక్కిస్తే పాలమూరుకు కేసీఆర్ అన్యాయం చేశారు.కేసీఆర్ పాలనలో పాలమూరులో వలసలు ఆగలేదు.కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా.. పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదు?మా ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు.. మా జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించలేదు? డిసెంబట్ 9, 2023 తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.. నేను నాగర్ కర్నూల్ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా..దొరల రాజ్యాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం.
ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని ఇక్కడి ప్రజలు భరించరు.ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందని అడుగుతావా కేసీఆర్.సాగునీటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో 70లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది ఇందిరమ్మ రాజ్యం.కేసీఆర్ ఊరికి రోడ్డు వేసింది.. ఆయన చదివిన డిగ్రీ కాలేజీ కట్టింది ఇందిరమ్మ రాజ్యం ఐటీని అభివృద్ధి చేసి ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది.
ఆనాడు సింగిల్ విండో డైరెక్టర్ గా పోటీ చేయించింది కాంగ్రెస్ కాదా?యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే ఇందిరమ్మ రాజ్యం. 2004లో రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని మరిచిపోయావా?దొరల రాజ్యం కావాలో… ఇందిరమ్మ రాజ్యం కావాలో నిర్ణయించుకోండి.ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.25 వేల మెజారిటీతో రాజేష్ రెడ్డిని గెలిపించండి. వట్టెం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. మీ బిడ్డగా అడుగుతున్నా… నేను ఈ మట్టిలోనే పుట్టా.. ఈ మట్టిలోనే కలుస్తా.ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా. పాలమూరు జిల్లాలో 14కు 14కు గెలిపించండి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాది.
ఇక నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది
అచ్చంపేట : అచ్చంపేటలో చీమలదండుగా కదలివచ్చిన మిమ్మల్ని చూస్తోంటే 50 వేల మెజారిటీతో వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.నియోజకవర్గంలో గువ్వల బాలరాజు రౌడీ మూక ప్రజలపై దాడి చేస్తున్నా ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఇక నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది.ఇకనుంచి దాడులను తిప్పికొడతాం.. దాడులు చేసేవాళ్లను ఇక్కడే బొందపెడతాం. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల స్వప్నం నెరవేరలేదు. తెలంగాణలో దొరల రాజ్యం కావాలో.. ఇందిరమ్మ రాజ్యం కావాలో నిర్ణయించుకోండి.గడీల పాలన పోవాలి.. ప్రజా పాలన రావాలి.
ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ గడీ నేలమట్టమవుతుంది..బీఆరెస్ ను బొంద పెట్టడం ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు సాయం అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. తెలంగాణలో మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి.