– మన్మోహన్ స్మారకకేంద్రంపై రాహుల్ విమర్శలు దారుణం
– మేం ఏడురోజులు సంతాపదినాలు ప్రకటిస్తే రాహుల్ న్యూయర్ సెలబ్రేషన్స్‌కు వియత్నాం వెళ్లారు
– పివి, ప్రణబ్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది
– పివి శవాన్ని కూడా పార్టీ ఆఫీసులో పెట్టలేదు
– ఢిల్లీలో ఆయన సంస్మరణకు గజం జాగా ఇవ్వలేదు
– పివికి భారతరత్న ఇచ్చి గౌరవించింది మోదీ మాత్రమే
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరనిలోటు. నేను కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాజ్యసభలో అనేకసార్లు మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చేవారు. వారిని కలిసి నమస్కరించుకునే అవకాశం అనేకసార్లు లభించింది. మన్మోహన్ సింగ్ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం చూసి దేశ ప్రజలు బాధపడుతున్నారు.
మన్మోహన్ సింగ్ .. దేశ ప్రజలందరూ గౌరవించుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు, అమానవీయం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారహీనానికి అద్దం పడుతున్నది. మన్మోహన్ సింగ్ దేశానికి పదేళ్ల పాటు అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, అనేక అవమానాలను ఎదుర్కొని సేవలు అందించిన విషయాన్ని దేశ ప్రజలెవ్వరూ మర్చిపోరు. మన్మోహన్ సింగ్ మరణించారని తెలియగానే వెంటనే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
అటల్ బిహారీ వాజ్ పేయి కి ఏవిధంగా అంతిమ సంస్కారాలు నిర్ణయించారో.. మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అదేవిధంగా అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి అప్పగించడం జరిగింది. అందుకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అటల్ బిహారీ వాజ్ పేయి కి స్మారక కేంద్రాన్ని నిర్మించినట్లుగానే.. మన్మోహన్ సింగ్ గారికి కూడా స్మారక కేంద్రాన్ని నిర్మించాలని.. మన్మోహన్ స్వర్గస్తులైన మూడు గంటల్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గతంలో ట్రస్టుల ద్వారానే స్మారక కేంద్రాలు నిర్మించారు. అదేవిధంగానే ట్రస్టు ఏర్పాటు చేసేందుకు మన్మోహన్ సింగ్ సతీమణితో మాట్లాడటం జరిగింది. ట్రస్ట్ పేరుతో భూమిని ట్రాన్స్ఫర్ చేసి స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మన్మోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు, కేబినెట్ మంత్రులు అంతిమసంస్కార కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు.
దేశ మాజీ ప్రధానులందరికీ ఏ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారో.. అదేవిధంగా మన్మోహన్ సింగ్ స్మారక కట్టడం విషయంలో ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, చివరికి బోర్లా పడటం ఆయనకు అలవాటైంది. ఒక మహానుభావుడి విషయంలో అలానే వ్యవహరించడం చూసి ప్రజలందరూ బాధపడ్డారు.
మొదటి నుంచి నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించిన వారు ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించినా.. వారిపట్ల నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పట్ల, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ పట్ల కాంగ్రెస్ పార్టీ అవమానకరంగా వ్యవహరించింది. మన్మోహన్ సింగ్ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ మొసలికన్నీరు కారుస్తోంది.
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా కుటుంబం ఏ విధంగా అవమానపర్చారో, అవహేళన చేశారో ప్రజలందరికీ తెలుసు. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను… రాహుల్ గాంధీ మీడియా సమక్షంలో “బక్వాస్” అంటూ ఆర్డినెన్స్ కాపీని మీడియా ముఖంగా చించివేశారు. స్వర్గస్థులైన మన్మోహన్ సింగ్ రి పట్ల.. రాహుల్ గాంధీ రాజకీయం కోసం దొంగప్రేమను ఒలకబోస్తున్నారు.
దేశంలో విద్యావంతులు, మేధావులు, మీడియా, పార్టీలు.. రాహుల్ గాంధీ అహంకారపూరిత, దివాళాకోరుతనాన్ని ఖండిస్తున్నారు. పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ గౌరవార్థం టెన్ జనపథ్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలి.
2007లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2 జీ స్పెక్ట్రం వేలం వేయాలని టెలికాం మంత్రి ఏ. రాజాకు ఉత్తరం రాశారు. కానీ, మన్మోహన్ సింగ్ నిర్ణయానికి విరుద్ధంగా, సోనియా గాంధీ ఆదేశాలతో 2 జీ స్పెక్ట్రం కుంభకోణానికి తెరలేపారు. దీంతో టెలికం మంత్రి ఏ.రాజా జైలుకెళ్లారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ ని అనేక రకాలుగా అవమానించారు. ఆరోజు ఏ కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదు.
కానీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్ వ్యాఖ్యల పట్ల ఖండించారు. యూపీఏ ప్రభుత్వంలో పూర్తి నిర్ణయాధికారాలు యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ చేతుల్లోనే ఉండేవి. తమ కనుసైగల్లోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పనిచేయాలనే భావనతో, బలవంతంగా ఆదేశాలిచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి ఒక ఉదాహరణ 2జీ స్పెక్ట్రం కుంభకోణం.
షాడో ప్రైమ్ మినిస్టర్స్ గా సోనియా గాంధీ- రాహుల్ గాంధీ ప్రవర్తించారు. మన్మోహన్ సింగ్ ని అడుగడుగునా అవమానించే విధంగా వ్యవహరించారు. 2008లో బీజింగ్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే అనేక దేశాల అధినేతలను, ప్రపంచస్థాయి నాయకులందరినీ ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కానీ, భారత ప్రధానమంత్రికి ఆహ్వానం అందలేదు. సోనియా గాంధీ-రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు వచ్చాయి. అలా ఆహ్వానాలు తెచ్చుకుని మన్మోహన్ సింగ్ ని అవమానించారు.
చైనా ఒలింపిక్స్ క్రీడల సమయంలో విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. చైనాకు సంబంధించిన జిన్ పింగ్ ను కలిసి భారత్-చైనా మధ్య సమాచార మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ని దూరంగా పెట్టిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్ల కాలంలో సాధించిన ప్రభుత్వ ఘనతలను సోనియా-రాహుల్ గాంధీ అకౌంట్ లో వేసుకున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉంటే మన్మోహన్ సింగ్ పై నెట్టారు. ఎలాంటి అవినీతి ముద్రలేకుండా ప్రధానిగా మన్మోహన్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన కుంభకోణాలకు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీయే కారణం. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు అనేకమంది గొప్ప నాయకులను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నెహ్రూ కుటుంబానిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు ఢిల్లీలో నివాసం ఉండేందుకు అనుమతి కోరితే.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇల్లు కూడా కేటాయించలేదు.
2004లో తెలుగుబిడ్డ, దేశానికి ఎనలేని సేవలు చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని అవమానపర్చింది, అగౌరవపర్చింది. పీవీ ఢిల్లీలో మరణిస్తే.. కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకులకు దక్కిన గౌరవాన్ని కూడా పీవీకి దక్కకుండా అవమానపర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సోనియాగాంధీ బెదిరింపులతో.. పీవీ అంతిమయాత్ర తర్వాత ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకుపోనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. పీవీ స్మారక కేంద్రాన్ని నిర్మించలేదు.
పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు 2024లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం గౌరవించింది. పీవీకి భారతరత్న అవార్డు ఇస్తున్న సమయంలో కనీసం కాంగ్రెస్ నాయకులు ప్రశంచించిన పాపాన కూడాపోలేదు. రాష్ట్రపతి భవన్ లో మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు వచ్చినా చప్పట్లు కొట్టలేదు. కాంగ్రెస్ పార్టీ.. తమ సొంత పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రుల పట్ల కూడా అగౌరవంగా, అవమానపర్చింది.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఏక్తా స్థల్ పేరిట ప్రముఖ స్మారకాన్ని ప్రారంభించారు. భారతదేశ ప్రధానమంత్రులకు సంబంధించిన జీవిత చరిత్రను తెలియజేసేలా నిర్మాణాలను ఏర్పాటు చేశారు. పీవీ నర్సింహారావు – మన్మోహన్ సింగ్ ఇద్దరూ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. సొంత పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రులను కూడా అగౌరవపర్చిన వక్రబుద్ధి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ కాదన్నట్లుగానే ఒరవడిని ప్రదర్శిస్తున్నారు.
యూపీఏ పాలనలో దేశంలో అనేక రహదారులు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ పథకాలకు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పేర్లు మాత్రమే పెట్టారు. దేశంలో ప్రముఖులు, నాయకుల పేర్లు పెట్టలేదు. క్రీడలకు కూడా రాజీవ్ గాంధీ పేరిట ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏడు రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు సంతాప దినాలుగా ప్రకటిస్తే ఆ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మాత్రం, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లాడు. మన్మోహన్ సింగ్ ని, పీవీని అవమానించిన రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు నీతులు వల్లించడం సిగ్గుచేటు.