వేరే ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పి వుంటే నవ్వేసే వాడిని. కానీ స్లైడ్స్ వేసి, తెలుగుతల్లికి జలహారతి అని ప్రాజెక్టుకు నామకరణం చేసి, గోదావరి టు గేట్వే ఆఫ్ రాయలసీమ బనకచర్ల వరకు నదులు అనుసంధానం చేసి, రిజర్వాయర్లు కూడా అనుసంధానం చేసి, వరద నీటిని, వాటాల నీటిని, లిఫ్టులు, టన్నెల్లు, గ్రావిటీల ద్వారా జల వికేంద్రీకరణ చేసి, ప్రతి పొలం తడిసేలా, ప్రతి గొంతు తాగేలా, ఎన్ని పరిశ్రమలు వస్తే అన్నిటికీ సరిపోయేలా.. అందులోనే పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ జనరేషన్ చేయవచ్చు, వరదలను నియంత్రించవచ్చు.. రిజర్వాయర్లను బ్యాలన్సింగ్ చేయవచ్చు వరకు మాత్రమే చెప్పి ఆపేసి వుంటే.. వరల్డ్ క్లాస్ వాటర్ ప్రాజెక్టు సినిమా కథ అనుకొనేవాడిని.
ప్రాజక్టులో మూడు స్టేజ్‌లు చూపిస్తూ, లెఫ్ట్ రైట్ కెనాల్ స్కెచ్చులు, ఆంధ్రా మ్యాపులో మార్కింగ్, ప్రాజెక్టు ఫ్లో డయాగ్రాం, ప్రాజెక్టు వర్క్‌ఫ్లో, ప్రాజక్టులో ఫీచర్స్, ప్రాజక్టుకు కావాల్సిన స్థలం, నిధులు, కరెంటు లాంటి రిక్వైర్మెంట్స్, లీస్ట్ కాస్ట్ మోడెల్, సెంట్రల్, స్టేట్, హైబ్రిడ్ మోడెల్, 80,112 కోట్లు అవుతుంది అని లెక్కగట్టి, ఆంధ్రా గురించి అణువణువూ ఆకళింపుజేసుకొన్న పరిశోధకుడిలా.. ఎత్తుపల్లాల గురించి చెబుతూ.. వివరిస్తుంటే.. ముక్కుమీద వేలుసుకొని ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిధుల లెక్కన నాకు కూడా కాసేపు మైండ్ బ్లాంక్ అయ్యింది.
తేరుకొని మీడియా వారు కురిపించిన ప్రశ్నల వర్షానికి పులకరిస్తూ.. ఎంతో ఉత్సాహంతో.. ఉద్వేగభరితంగా.. ఉత్కంఠంగా.. నవ్వుతూ.. సహనంతో వివరింగా చెబుతుంటే.. నా మెదడు పనిచెయ్యడం ప్రారంభించింది. దేశంలో ఏ నాయకుడైనా ఇలాంటి ప్రాజెక్టు తయారు చెయ్యించి, అర్థం చేసుకొని, స్లైడ్స్ చెయ్యించి, ఇంత బాగా అర్థం అయ్యేలా ధైర్యంగా మీడియాను ఆహ్వానించి వివరించగలడా.. ఇలాంటి ఆలోచనలు వస్తాయా.. వస్తే ఎలా వస్తాయి.. కలలో కూడా రావే.. ఇది ఎలా.. ఈయనకే సాధ్యమా? ఇలా ఎన్నో ప్రశ్నలు?
నేను నవ్వను. హైటెక్ సిటీ.. జీనోం వ్యాలీ వరకే కాదు, ఈ మధ్య పట్టి సీమ విషయంలో కూడా నవ్వి నవ్వి నేనే పశ్చాత్తాప పడ్డాను. బురదలో బస్సు దిగబడిన చోట, నవ్విన వారికి కసిగా తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టి ఇన్నేళ్లుగా అమరావతి నుండే పాలించేలా చేసిన పరిపాలకుడు, నాయకుడు ఆయన.
తెలుగు తల్లికి జలహారతి
మన నేలకు జలధార
ఆంధ్రాకు జీవనధార
గోదావరి-బనకచర్లతో
పొలాలన్నీ బంగారాలే
నదులకు కొత్త నడకలు
ప్రతి రిజర్వాయరుకూ ప్రవాహాలు
త్రాగు, సేద్య, పరిశ్రమలకు సమృద్ధిగా నీరు
ఆంధ్రాలో అభివృద్ధి పరవళ్లు
ఒక ఆంధ్రుడిగా పుట్టినందుకు ఆ అద్భుత ఆలోచనలు వింటూ.. చూస్తూ.. గర్వపడుతూ
ఎంత వేగంగా అయితే అంత వేగంగా నాయుడి ఆలోచనలన్నీ సాకారం అవ్వాలని
మనసా వాచా కోరుకొంటున్నాను.