-ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్ధం
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే దేశంలో బిజెపి కార్యాలయాలు ఒక్కటి కూడా మిగలవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు.ఈ.డీ విచారణ పేరిట రాహుల్గాంధీని మోడీ ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన దీక్ష చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై మఫ్టీలో ఉన్న పోలీసులుగా ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పై విధంగా భట్టి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధేయ వాదులు, దేశభక్తులు, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని గౌరవించి సహనంతో ఉంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించడం సారి కాదని, ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే రోడ్ల పైకి కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే తట్టుకోలేరని హెచ్చరించారు.
దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన నేషనల్ హెరాల్డ్ పత్రిక నష్టాల్లో ఉంటే ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సోనియా, రాహుల్ రుణ సహాయం చేయడం నేరమా? అని ప్రశ్నించారు.
ఆర్థిక కష్టాల్లో ఉన్న పత్రిక వల్ల జీతాలు లేక ఆ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ రుణ సహాయం చేసిందని వివరించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక తిరిగి పున ప్రారంభం కావడంతో బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకాలు, అవినీతి గుట్టు, హిందుత్వం పేరిట చేస్తున్న మతోన్మాద రాజకీయాల బండారాన్ని బయట పడుతుందనే భయం పట్టుకొని బిజెపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు.
ఈ నేరం చేయని AICC అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులు, 30 గంటల పాటు ఆరెస్సెస్ భావజాలం కలిగిన అధికారితో విచారణ పేరిట వేధింపులకు పాల్పడటాన్ని యావత్ జాతి ఖండిస్తున్నది.
సోనియా రాహుల్ గాంధీలకు ఈ దేశం మొత్తం అండగా నిలబడింది. బిజెపి బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు. ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ గాంధీ వారసులు భయపడతారా?
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లను స్వదేశానికి తీసుకురాని చేతగాని అసమర్థ బీజేపీ ప్రభుత్వం దేశభక్తుల కుటుంబం అయిన సోనియా, రాహుల్ పై ఆర్థిక నేరం మోపి విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్న ఈ సర్కార్ పతనం కావడం ఖాయం.