తెలంగాణ రాష్ట్ర సమితి డైరెక్షన్లోనే కాంగ్రెస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర సమితి డైరెక్షన్లోనే కాంగ్రెస్ పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజుల్లోనే, కాంగ్రెస్ పార్టీ సైతం అదే పనిగా కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉద్యమాలతో బీజేపీకి ప్రజల్లో పేరొస్తుండటంతో ఓర్వలేని సీఎం కేసీఆర్… అదే సమయంలో కాంగ్రెస్ సైతం కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయిస్తున్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్ ను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.

గతంలో బీజేపీ పక్షాన నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్ సైతం కార్యక్రమాలు చేపట్టింది. నిర్మల్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించిన రోజే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ లోనూ పోటీగా సభ నిర్వహించింది. మహబూబ్ నగర్ లో బీజేపీ సభ నిర్వహించిన రోజే పీసీసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించింది.

తాజాగా బీజేపీ తెలంగాణ శాఖ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆగస్టు 2న ప్రారంభించాలని నిర్ణయిస్తే… అదే రోజున కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది కాలంలో ప్రజల పక్షాన బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన అనేకసార్లు పోటీగా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించింది. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా భావిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు. ఒకే తాను ముక్కలు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థికి ఇరు పార్టీలు మద్దతిస్తున్నాయి.

గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు మద్దతిచ్చిన సందర్భాలున్నాయి. 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేశాయి. ఆ తరువాత ప్రభుత్వంలోనూ భాగస్వాములయ్యాయి. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయి. ఇరు పార్టీల మధ్య లోపాయికారీగా సీట్ల ఒప్పందం కూడా కుదిరింది. విజ్ఝులైన తెలంగాణ ప్రజలు వాస్తవాలను గమనించాలని, టీఆర్ఎస్-కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం.

Leave a Reply