– బోగస్ సర్వేతో పోయింది కాంగ్రెస్ పరువే
– బడుగుల గొంతు కోసిన రేవంత్
– కాంగ్రెస్ తెలంగాణకు చీడ, ప్రజలకు పీడ
– బీసీలకు అండగా గులాబీ జెండా
– కామారెడ్డిలో కొడితే రేవంత్ రెడ్డి కోమాలోకి పోవాలి
– కులగణన రీసర్వే జరిగే వరకు పోరు ఆగదు
– మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్: బీసీల నెత్తిపై కాంగ్రెస్ కత్తి వేలాడుతోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కులగణన పేరుతో ఇటీవల నిర్వహించిన బోగస్ సర్వేతో పోయింది కాంగ్రెస్ పరువేనని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఎద్దేవా చేశారు.
ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టడం కాంగ్రెస్ నైజమని, బడుగులను ఏమార్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు వారి గొంతు కోసిందని ఆయన మండిపడ్డారు.
‘కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే బోగస్. రాజకీయ స్వార్థం, కుయుక్తులు లేకుండా రీసర్వే చేస్తేనే బీసీల జనాభా ఎంత అన్న విషయంలో ఖచ్చితమైన గణాంకాలు వెలుగు చూస్తాయి. బీసీల ఓట్ల కోసం వారిని ఏమార్చేందుకు పచ్చి అబద్దాలతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచింది. బీసీల జనాభాను ఐదున్నర శాతం తక్కువగా చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవం పైనే దెబ్బ కొట్టింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. కాంగ్రెస్ డ్రామాలో భాగంగా జరిగిన కులగణన చిత్తుకాగితం విలువ కూడా చేయదు. కాంగ్రెస్ కులతత్వ రాజకీయాలు చూసి బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనల చెందుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రేషన్ కార్డుల మంజూరు, ఇండ్ల కేటాయింపు ల్లో, ఆరు గ్యారంటీల వర్తింపులో తమ వాటా తగ్గుతుందనే భయం ఎంబీసీలు, బీసీ ప్రజల్లో నెలకొంది. బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి సభలో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని కాంగ్రెస్ నమ్మబలికింది.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, ప్రోక్యుర్మెంట్లలో 42% బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ ఆశజూపింది. కానీ 15 నెలలు గడిచినా బీసీ డీక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వం నయాపైసా కేటాయించలేదు.
కొత్తగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఒక్కో కార్పొరేషన్ 50 కోట్ల బడ్జెట్ ఇస్తామని ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు. బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్నీతిని బీసీ సోదరులు ఎండగట్టాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ కులగణన అసంబద్ధమని నిరసన గళమెత్తాలి’ అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణకు చీడ, ప్రజలకు పీడ అని ఆయన అభివర్ణించారు.బీసీలకు అండగా గులాబీ జెండా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ చీటింగ్ చేసిన చోట నుంచే సర్కారుపై ఫైటింగ్ మొదలు కావాలన్నారు. కామారెడ్డిలో కొడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమాలోకి పోవాలి. బీసీల దెబ్బకు కాంగ్రెస్ ఏసీ కోటలు కూలాలి.
కేసీఆర్ హయాంలోనే బీసీలకు స్వర్ణయుగం. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు బీసీల పోరులో కదం తొక్కాలని, బీసీలకు జరిగిన ద్రోహంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన కోరారు.కులగణన రీసర్వే జరిగే వరకు, బీసీలకు న్యాయమైన వాటా దక్కేంత వరకు పోరు ఆగదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.