Suryaa.co.in

Political News

చెంప దెబ్బలతో అంపశయ్యపై కాంగ్రెస్!?

( ఎలిశెట్టి సురేష్ కుమార్ జర్నలిస్ట్ 9948546286 )

ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో..
ఒకరి వెంట ఒకరుగా పలాయనం చిత్తగిస్తున్నారు..దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని
ఆ మహావృక్షం నీడన బతుకులు వెళ్ళబుచ్చి..
పదవులు వెలగబెట్టి..
ఆస్తులు కూడగట్టి..
పనిలో పనిగా దేశానికి కాకపోయినా నమ్ముకున్న..
నమ్మిన పార్టీకి అంతో ఇంతో సేవ చేసిన ప్రభుద్దులు ఇప్పుడు తలవని తలంపుగా పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు..
ఇది దేనికి సంకేతం..!

సరే..వెళ్ళిపోయిన వారు చాలా మందే ఉన్నా ప్రధానంగా హార్ధిక్ పటేల్..
కపిల్ సిబాల్..ఇప్పుడు గులాం నబీ ఆజాద్..
వీరి నిష్క్రమణ
ఏం సూచిస్తోంది…
పార్టీ పనైపోయిందనా..
గతంలో ఇంతకంటే పెద్ద తలకాయలు వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకునే పనేలే…కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం..
వచ్చే జనం…పోయే జనం..
కాని ఇప్పటి పరిస్థితి
అది కాదు…ఇప్పటికే అధికారం కోల్పోయి ఎనిమిదేళ్లకు పైగా
నడిచింది బండి..మరో రెండేళ్లలోనో.. ఈలోగానో జరిగే ఎన్నికల్లో
గెలుస్తామనే ఆశలేదు..
ఉన్న నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లింది..
పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం నాస్తి..ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకరొకరుగా పార్టీకి
గుడ్ బై చెప్పేస్తున్నారు.
కిం కర్తవ్యం!?

మహానాయకి ఇందిరా గాంధీ పురుడుపోసిన పార్టీ..
ఇప్పుడు తానుగా భూస్థాపితం కాబోతోందా..!
ఘన చరిత్ర త్వరలో సమాప్తమేనా..!?
ఇది ఊహించని
పరిణామమే కావచ్చు..
కాని అనివార్యంలా కనిపిస్తోంది..
రాహుల్ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. ఓహో అనుకున్న ప్రియాంక కూడా ప్రజలపై బలమైన ముద్ర వెయ్యలేకపోయారు.పార్టీలో ఉద్దండులతో కూడిన తరం నెమ్మదిగా తెరమరుగు అవుతుండగా రాష్ట్రాల్లో గాని..జాతీయ స్థాయిలో కాని ఘనాపాటీలు అనదగ్గ కొత్త తరం నాయకులు ఎవరూ కూడా
కానరావడం లేదు.

కేంద్రంలో 2019 లో మరోసారి శృంగభంగం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు దాపురించాయి.రాష్ట్రాలు చెయ్యి జారిపోయాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలలో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి.
రాహుల్ ఇంటింటికీ తిరిగినా..సోనియా ప్రతి ఇంటి తలుపు తట్టినా భంగపాటు తప్పలేదు.
సోనియా.. రాహుల్
ఇద్దరూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుందామనుకున్నా తప్పించుకోలేకపోతున్నారు.
నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇతరులు సిద్ధంగా లేరు.పార్టీనే వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్న వారు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు పెట్టుకుంటారు. ఒకరొకరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ తో సహా కొన్ని రాష్ట్రాలలో ఉనికినే కోల్పోతున్న పార్టీ ఇక ఆయా రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రావడం మాట అటుంచితే కనీసం తన వంతు ఓట్లు తెచ్చుకోవడం గగనమే అనుకునే పరిస్థితి.

ఎప్పుడైతే రాష్ట్రాల్లో.. కేంద్రంలో అంత బలమైన పార్టీ ఉనికి కోల్పోవడం మొదలైందో ఆపుడు
ఇతర శక్తులు శక్తి పుంజుకున్నాయి.
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా విరాజిల్లుతూ గతంలో మాదిరి కాంగ్రెస్ పార్టీతో
పొత్తు కోసం వెంపర్లాడే పరిస్థితి లేదు.మరోపక్క కేంద్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి
2014 ఎన్నికల్లో అంతకు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చినా 2019 లో కొంత సొంత బలం..ఇంకొంత కాంగ్రెస్ బలహీనత ప్రాతిపదికగా అధికార పీఠం ఎక్కింది.వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి.నిజానికి కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి పాలనపై నూటికి నూరు శాతం ప్రజలందరూ సంతృప్తితో లేకపోయినా ప్రత్యామ్నాయం కనిపించని నేపథ్యంలో మరోసారి జనం కమలంవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇలాంటి పరిణామాల నడుమ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పరాభవం ఎదురైతే అయిదు వేళ్ళ చేతి గుర్తు పార్టీ
అయిదు ప్లస్ అయిదు ప్లస్
అయిదు..మూడైదులు..పదిహేనేళ్ల పాటు ఆధికారానికి దూరంగా ఉండి ఇంక అటు తర్వాత ఉనికిని మిగుల్చుకునే పరిస్థితి ఉంటుందా..జనాల్లో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని ఇంకో అయిదేళ్ల తర్వాత అప్పటికి కొత్తగా జాబితాలో చేరే నవతరం ఓటర్లు గుర్తిస్తారా..
అంటే..కాంగ్రెస్ పార్టీ
ఇక ఇంతే సంగతులేనని
చిత్తగించవలసిందేనా..!?=

LEAVE A RESPONSE