– తమ కుటుంబంపై రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, కడియం శ్రీహరి కుట్రలు
– అయినా మేం భయపడేది లేదు
– మా ఇంటికి పోలీసులు ఎలా వచ్చారు?
– మేం కాంగ్రెస్‌లో ఉన్నామా? మరో పార్టీలో ఉన్నామా?
– మాపై రెడ్లు కుట్ర చేస్తున్నారు
– బాంబు పేల్చిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత
– మంత్రి కొండా సురేఖ క్వార్టర్‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు
– ఓఎస్డీ కోసం వచ్చామన్న పోలీసులు
– కారులో వెళ్లిపోయిన మంత్రి సురేఖ
– క్యాబినెట్ భేటీకి మంత్రి సురేఖ డుమ్మా
– రేవంత్‌తో విబేధాలు లేవన్న కొండా మురళి
– పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, ఇన్చార్జి నటరాజన్‌తో భేటీ
– తనను లక్ష్యంగా చేసుకుని రేవంత్, ఉత్తమ్, పొంగులేటి ఇబ్బందిపెడుతున్నారని కొండా ఫిర్యాదు?
– ఇదంతా సమాచారం లోపంతోనేనన్న మహేష్‌గౌడ్
– కాంగ్రెస్‌కు సి‘మంట’
(మార్తి సుబ్రహ్మణ్యం)
అసలే 42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో.. సుప్రీంకోర్టు తీర్పుతో నిలువెల్లా గాయాలయి, రాజకీయంగా క్షతగాత్రురాలయిన రేవంత్‌రెడ్డి సర్కారుపై పడిన ‘కొండంత’ బాంబు.. కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, మంత్రి కొండా సురేఖ కుటుంబ లక్ష్యంగా జరుగుతున్న కుట్రలు.. ఆమె కుమార్తె ఆరోపణలతో భళ్లున పేలింది. ఫలితంగా.. తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డిరాజ్యం నడుస్తూ, బడుగులకు పాతర వేస్తున్నారన్న సంకేతం, తెలంగాణ సమాజంలోకి వెళ్లేందుకు కారణమయింది.
సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన బంధువులకు చెందిన డెక్కన్ సిమెంట్ యజమానిని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ సురేఖ ఓఎస్డీ గన్ పెట్టి బెదిరించారని స్వయంగా ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి మూలకారణమయింది. దానితో స్పందించిన సీఎం.. పీసీబీలో పనిచేసే కొండా ఎస్డీని తొలగించడంతోపాటు, అరెస్టు చేయాలని ఆదేశించారన్న వార్తలు సంచలనం సృష్టించాయి.
దానితో మంత్రి కొండా సురేఖ క్వార్టర్లో ఉన్న ఓఎస్డీని అరెస్టు చేసేందుకు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు మినిష్టర్స్ క్వార్టర్‌కు వెళ్లడం.. వెంటనే కొండా సురేఖ కారులో బయటకు వెళ్లడం మీడియాలో హల్చల్ చేసింది. నిజానికి పోలీసులు ఏకంగా మంత్రి ఇంటికే వెళ్లి, అక్కడున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లడం చరిత్రలో ఇదే ప్రథమం.
ఈ వ్యవహారంపై అక్కడే ఉన్న మంత్రి సురేఖ కుమార్తె సురేఖ విడుదల చేసిన వీడియో, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. తన కుటుంబాన్ని బద్నామ్ చేసేందుకు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారంటూ విడుదల చేసిన వీడియో కాంగ్రెస్‌లో కుల రాజకీయాలను బట్టబయలు చేసింది. ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని, కార్యకర్తలు మనోస్థైర్యం కోల్పోవద్దని, తాము అందరికీ దన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో జరిగిన క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షితో భేటీ కావడం మరింత సంచలనం సృష్టించింది. అప్పటికే 42 శాతం రిజర్వేషన్ల జీఓను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమయింది. ఈ సమయంలో కొండా సురేఖ క్యాబినెట్‌కు డుమ్మా కొట్టడంతో, అందరి చూపూ సురేఖ వైపు మళ్లేందుకు కారణమయింది.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరె డ్డి తమ కుటుంబాన్ని అణచివేయాలని కుట్ర చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దానికి స్పందించిన మీనాక్షి న టరాజన్.. అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని హితవు పలికినట్లు తెలుస్తోంది.
కాగా తాజా వివాదంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి.. తన కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డితో ఎలాంటి విబేధాలు లేవని, నిజానికి రేవంత్ తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వైఎస్ తర్వాత రేవంత్‌ను ఆ స్థాయిలో గౌరవించాం. ఆయన సీఎం కావాలని కోరుకున్నాం. నాకు ఏమైనా అవసరం ఉంటే రేవంత్, ఉత్తమ్ ఉంటికే వెళ్తాననని వెల్లడించారు. అయితే తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తనకు తెలియవని, ఆమెకు ఏ పదవిలేదు. మాట్లాడే స్వేచ్ఛ ఉందని లౌక్యంగా చెప్పడం ప్రస్తావనార్హం.
మంత్రి సురేఖ.. తన శాఖకు చెందిన సమ్మక్క జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారంలో మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకోవటమే ఈ వివాదానికి అసలు కారణంగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్‌లో రేగిన ఈ ‘కుల’కులం భవిష్యత్తులో మరిన్ని మలుపులు తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల మంత్రులు పొన్నం, వివేక్-లక్ష్మణ్ మధ్య తలెత్తిన కుల పంచాయితీ కాంగ్రెస్ పరువు తీయగా.. ఇప్పుడు ఏకంగా ఒక క్యాబినెట్ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీస
ులు రావడంతో పూర్తిగా రోడ్డునపడినట్లయింది.
ఇది రెడ్ల కుట్ర: సుస్మిత
తన కుటుంబంపై రెడ్లు కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి కుమార్తె కొండా సుస్మిత పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వారితో వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ వారెంట్ చూపించాలని పోలీసులను అడిగారు. దానితో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన తండ్రి కొండా మురళికి ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సుస్మిత ఏమన్నారంటే.. “మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా? వేరే ప్రభుత్వంలో ఉన్నామా? ప్రభుత్వంలో ఉన్న వారిపైనే ఇలా వ్యవహరిస్తారా?బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అణగదొక్కేందుకు పార్టీలోని కొందరు ‘రెడ్లు’ కుట్ర పన్నుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారు ”
మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేస్తారా?
తన బంధువైన డెక్కన్ సిమెంట్ కంపెనీని మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్‌తో బెదిరించారన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుతో, ఒక బీసీ మంత్రి దగ్గర పనిచేసే ఓఎస్డీని ఎలా అరెస్టు చే స్తారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నిజంగా మంత్రి ఓఎస్డీ డెక్కన్ సిమెంట్ కంపెనీని బెదిరిస్తే, ఆ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేయాలేగానీ, మంత్రి ఉత్తమ్‌కు ఏం సంబంధం అని బీసీ సంఘాలు నిలదీస్తున్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏని అరెస్టు చేసేందుకే భయపడే పోలీసులు, ఏకంగా ఒక బీసీ మంత్రి క్వార్టర్‌కు ఎవరి ధైర్యంతో వెళ్లారని విరుచుకుపడుతున్నారు. రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, దళిత కులాలకు చెందిన మంత్రుల క్వార్టర్స్‌కు పోలీసులు ఇంతే ధైర్యంతో వెళ్లగలరా? కొండా సురేఖ మహిళ- బీసీ కాబట్టే ఆమె క్వార్టర్‌కు వె ళ్లారా? అంటే బీసీలంటే మీకు అంత అలుసా? సురేఖ ఇంటికి వెళ్లాలని ఆదేశించిన అధికారి ఎవరో చెప్పాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.