– మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్
– రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు
– కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటు
– నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు
– తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించి, చట్టాన్ని మార్చేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు.
పలు రంగాలకు భూకేటాయింపులు జరిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తామని తెలిపారు. కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.
నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసిందని అన్నారు. నల్సార్ యూనివర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తామని, రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేశామని అన్నారు. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసినట్లు పొంగులేటి తెలిపారు.