Suryaa.co.in

Andhra Pradesh

సమస్యలపై పోరాడుతున్నందుకే చంపేందుకు కుట్ర

-బెదిరింపు కాల్స్, రెక్కీపై పోలీసులకు ఫిర్యాదు
– డూండి రాకేశ్

విజయవాడ : అధికార పార్టీ నేతల నుండి తనకు ప్రాణ హాని ఉందని తక్షణమే భద్రత కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ సింగ్ నగర్ పోలీసులకు, విజయవాడ నగర కమిషనర్ కు, డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, బాధితులైన ప్రజల తరపున నిలబడి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నందుకు అధికార పార్టీ నాయకులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి అర్ధరాత్రి కాల్స్ చేసి బెదిరిస్తున్నారని, తాజాగా మార్చి 19న ఇంటి చుట్టూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకుని ఇంటి చుట్టూ తిరిగారంటూ అందుకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులకు సమర్పించారు.

వైసీపీ నేతల బెదిరింపులు, రెక్కీ, నేను ఇంటిలో లేని సమయంలో అర్ధరాత్రి వేళ తలుపు తడుతుండడం వంటి ఘటనలతో తన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. గతంలో జరిగిన కొన్ని అసాంఘిక సంఘటనల నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆవేదన చెందుతున్నారు. సదరు ఫోన్ కాల్స్, రెక్కీ నిర్వహణ ఘటనలపై పోలీసులు తక్షణమే విచారణ జరిపించాలి. తన ప్రాణ, ఆస్తికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోలీసులు తగు రక్షణ ఏర్పాట్లు కల్పించాలని, ప్రజాస్వామ్యం కల్పించిన జీవించే హక్కును కాపాడాలంటూ పోలీసులను కోరారు.

LEAVE A RESPONSE