– ప్రజా పాలనలో 90 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు
– జడ్చర్ల నియోజకవర్గం లో 16. 33/11కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించిన అనంతరం నవాబుపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
జడ్చర్ల: కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అన్నారు. మేం మిగులు విద్యుత్తు లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పాలనలో ఉత్పత్తి, జీవన ప్రమాణాలు పెరిగాయి. విద్యుత్ డిమాండ్ పెరిగింది. తెలంగాణ రైసింగ్ ను కుట్ర దారులు ఆపలేరు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని ఎన్నికల ముందు టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు, మేం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే కాదు మిగులు విద్యుత్తు లక్ష్యంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉత్పత్తులు పెరిగాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని డిప్యూటీ సీఎం వివరించారు. మార్చి 2023లో టిఆర్ఎస్ పాలనలో విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు కాగా మార్చి 2025న కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు పిక్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరింది, ఒకేసారి 2,000 మెగావాట్ల మేరకు డిమాండ్ పెరిగినప్పటికీ రెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళామని డిప్యూటీ సీఎం వివరించారు.
2035 నాటికి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 33, 775 మెగావాట్లుగా అంచనా వేశాం, అందుకు తగిన విధంగా ఉత్పత్తి, సరఫరా కు అవసరమైన ప్రణాళికలను ఇప్పుడే సిద్ధం చేశామని తెలిపారు.
రాష్ట్రంలో సమృద్ధిగా విద్యుత్ సరఫరా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నారని వారందరికీ అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తాం, ప్రపంచం తోనే పోటీ పడతామని తెలిపారు.
తెలంగాణ రైసింగ్ను కుట్ర దారులు ఆపలేరు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ప్రభుత్వం ద్వారానే సాధ్యం అన్నారు.
రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఈ సంక్షేమాన్ని చూడలేని పథకాలు ప్రజలకు చేరవద్దు అనుకునే కొద్దిమంది మా ఆశయానికి సోషల్ మీడియా ద్వారా తూట్లు కొడవాలని చూస్తున్నారు అని డిప్యూటీ సీఎం అన్నారు.
ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగవద్దని దయ్యాలు విక అట్టహాసం చేస్తున్నాయి, ప్రజలకు పథకాలు అందవద్దు, వారిలాగే దోపిడీ చేయాలని గత పాలకులు భావిస్తున్నారు కానీ ప్రజలే కేంద్రంగా పాలన జరగాలని మా తపన అని డిప్యూటీ సీఎం తెలిపారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను కష్టపెడుతుంది అని టీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ ప్రభుత్వం పాలకుల కోసం కాదు ప్రజల కోసమే అని గుండెపై చేయి వేసుకొని తాను ధైర్యంగా చెబుతున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.
ఒక ఇంట్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శక్తి ఉండి పనిచేసుకుంటాం అంటే ఉపాధి పని, చదువుకునే పిల్లలకు బలమైన ఆహారం అందించేందుకు 40 శాతం డైట్ చార్జీలు పెంచాం, ఉన్నత చదువులు చదువుకునే పిల్లల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం.
ఆ ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకం, ఆ ఇంట్లో రెండు లక్షల వరకు అప్పు తెచ్చుకున్న రైతుకు రుణమాఫీ నేరుగా రైతు అకౌంట్లో జమ చేశాం.
ప్రతి రైతుకు రైతు భరోసా కింద 12000, భూమిలేని ఇంట్లో వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12000, ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు, ఇంట్లో వృద్ధులు వితంతువులు ఉంటే వారికి పెన్షన్ ప్రతినెల ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు.
గత ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే ఉద్దండపూర్ రిజర్వాయర్ కింద భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చాం, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఉదండాపూర్ రైతులకు 70 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు.
జూరాల నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ తోనే సాధ్యం అయ్యాయి అన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టు పరిధిలో ఒకరోజు స్విచ్ ఆన్ చేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం మినహా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు అని విమర్శించారు.