ఎవరైనా డీలర్లు నిబంధనలను ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్ళించినా, MRP ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయించినా, వారి లైసెన్సులను రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ హెచ్చరికలు జారీచేసింది.
రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు ముద్రించిన MRP ధరలను చూసి, ఆ ధర ప్రకారమే డబ్బు చెల్లించి, తప్పనిసరిగా డీలర్ నుండి రసీదు పొందాలని సూచించింది.
ఖరీఫ్ 2025 సీజన్‌కు ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన మొత్తం 16.76 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో 6.22 లక్షల టన్నుల యూరియా, 2.60 లక్షల టన్నుల డి.ఎ.పి, 0.70 లక్షల టన్నుల ఎం.ఒ.పి, 0.94 లక్షల టన్నుల ఎస్.ఎస్.పి, మరియు 6.30 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి.
ఏప్రిల్ 1, 2025 నాటికే 7.14 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 1, 2025 నుండి జూన్ 6, 2025 వరకు రాష్ట్రానికి 2.07 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయ్యాయి.
జూన్ 6, 2025 నాటికి రైతుల కోసం 11.09 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉంచబడ్డాయి. ఇందులో 4.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.92 లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పి, 0.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎం.ఒ.పి, 0.72 లక్షల మెట్రిక్ టన్నుల ఎస్.ఎస్.పి, మరియు 4.27 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి.
ఏప్రిల్ 1, 2025 నుండి జూన్ 6, 2025 వరకు రాష్ట్రంలో మొత్తం 2.00 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి.
జూన్ 6, 2025 నాటికి కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్.ఎస్.కె.లు, మార్క్ ఫెడ్ గోదాములు, రిటైల్/హోల్‌సేల్, మరియు కంపెనీ గోదాములలో మొత్తం 9.09 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. మార్క్ఫెడ్ మరియు కోఆపరేటివ్ సొసైటీలలో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాబోయే ఖరీఫ్ సీజన్‌లో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
జూన్ 2025 నెలకు భారత ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించబడ్డాయి. వీటి సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఈ ఎరువులను కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల కొరత లేదని, దేశీయంగా అన్ని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేస్తున్నాయని, విదేశాల నుండి కూడా అవసరమైన ఎరువుల దిగుమతులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేయబడింది. కాబట్టి, రాబోయే పంట కాలంలో కూడా ఎరువులకు ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేయబడింది.
నూతనంగా రూపొందించబడిన నానో యూరియా, నానో డి.ఎ.పి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవి సాంప్రదాయ ఎరువులకు నూరు శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.