అది నవంబర్ ఫస్ట్ 1988
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
హైదరాబాద్ టాంక్ బండ్ పై జరిగిన ఉత్సవంలో పాల్గొని తిరిగివస్తూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సెక్రటేరియట్ దగ్గర ఆగారు.
మామూలుగా అయితే రామారావు గారు ఇనేగేట్ ద్వారా లోపలికి ప్రవేశించాలి. అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులంతా చుట్టుముట్టివున్నారు. ఆ రోజు వారంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు అంతకుముందే అప్పాయింట్మెంట్ అడిగారు. నిజానికి ఆ రోజు సెలవుదినమైనప్పటికీ రామారావు గారు వారిని తప్పక కలుస్తానని చెప్పారు.
ప్రవేశద్వారం దగ్గర కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా ఎన్టీఆర్ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఆందోళనకారులు అలా దారికి అడ్డంగా ప్రదర్శన చేస్తుండగా, ఎవ్వరూ ఊహించని విధంగా రామారావు గారు కారు నుంచి దిగి సెక్రెటేరియట్ ప్రవేశద్వారానికి సమీపంలో రోడ్డుపై కూర్చున్నారు. అక్కడే వినతిపత్రం తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు దానికి సమ్మతించలేదు. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 12:30కు సచివాలయంలో ఆయన ఆఫీసులో కలుస్తామన్నారు.
ప్రవేశద్వారం వరకు వస్తే ఆయన సచివాలయంలో ప్రవేశించడానికి దారి కల్పిస్తామని చెప్పారు. కానీ దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. రోడ్డుపై కూర్చుని వారితో అక్కడే మాట్లాడతానని చెప్పారు. ముగ్గురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి అనేకమంది సిబ్బంది తన చుట్టూ ఉండగా, ఒక ముఖ్యమంత్రి మండుటెండలో రోడ్ లో కూర్చోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు.
కొద్దిసేపు కూర్చున్న తర్వాత, ఎన్టీఆర్ తన ఉత్తరీయాన్ని రోడ్డుపై పరిచి,దానిపై నిర్వికారంగా పడుకున్నారు. నాలుగున్నర గంటల తరువాత ఆయన అక్కడినుంచి కదిలి తన నివాసానికి వెళ్లేముందు విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలు తనపై ఎప్పుడూ అభిమానం చూపిస్తూనే ఉన్నారని, తాను హిందూపూర్ ఎమ్మెల్యేను కూడా కావడం వల్ల రాయలసీమకు దత్తపుత్రుణ్ణయ్యానని చెప్పారు. రోడ్డుపై అలా ఎందుకు కూర్చున్నారని అడిగినప్పుడు.. తనని సచివాలయంలోకి ప్రవేశించకుండా ఉద్యమకారులు అడ్డుకున్నందువల్ల అలా చేశానన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, జరిగిన సంఘటనకు ఎవరినీ నిందించడం లేదని చెప్పారు.
ఎన్టీఆర్ సానుకూల ధోరణి వల్ల, ఆయన అసాధారణ ప్రతిస్పందన వల్ల రాయలసీమ ఆందోళన విషమించలేదు. ఉద్యమకారులు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు ఉత్తేజితులై వారితో చేయి కలపలేదు. క్రమంగా ఆందోళన తగ్గుముఖం పట్టింది. రాయలసీమ ప్రజలు ఎన్టీఆర్ నుా ప్రాంతీయ పక్షపాతం లేని నాయకుడిగా గుర్తించారు. ఆయన అన్ని ప్రాంతాలనూ సమదృష్టితో చూశారు.అందువల్ల ఎన్టీఆర్ అధికారంలో ఉన్నంతకాలం స్వార్థపరశక్తులు రెచ్చగొట్టిన వేర్పాటువాదం ఆందోళనలేవీ విజయవంతం కాలేదు.
జోహార్ ఎన్టీఆర్