(రాజేష్)
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తమకు తాము తెలంగాణ స్వతంత్ర యోధులమని ఫీలవుతుంటారు. తెలంగాణ తెచ్చింది తమ కుటుంబమేనని భావిస్తుంటారు. కేసీఆర్ అయితే పబ్లిగ్గానే తెలంగాణ తనవల్లే వచ్చిందని చెప్పుకుంటారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకునే వాడు. ఓడిపోయాక జరిగిన సభల్లోనూ అదే మాట చెప్పాడు.
కేసీఆర్ చావు నోట్లో తల పెట్టాడని అనుకుందాం. మరి తెలంగాణా కోసం ప్రాణాలను వదిలేసినవారి సంగతేమిటి ? వారి బలిదానాల సంగతేమిటి? తెలంగాణ డిమాండ్ కేసీఆర్ చేసి ఉండొచ్చు. కానీ పార్లమెంటులో దానికోసం అనేకమంది పోరాడారు కదా. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న జైపాల్ రెడ్డి తెర వెనుక చేసిన కృషిని, మంత్రాంగాన్ని కాదనగలమా?
తెలంగాణా కోసం అన్నీ పార్టీలవారు పోరాడారు. కానీ చాలా చాకచక్యంగా తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కొట్టేశాడు. నాయకులతో తెలంగాణ జాతిపితగా పొగిడించుకున్నాడు. బాపు అని పిలిపించుకున్నాడు.
కేసీఆర్ ను గానీ, ఆయన కుటుంబాన్నిగానీ ఎవరైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనని ప్రచారం చేశారు. అలాంటివారికి తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేశారు. అదే దారిలో ఉన్నారు ఆయన కొడుకు, కూతురు, ఇతర కుటుంబ సభ్యులు. బహిరంగ సభల్లో ప్రసంగం ముగించాక జై తెలంగాణ… జై జై తెలంగాణ అనడం కేసీఆర్ అలవాటు. ఇదే పాటిస్తారు ఆయన కొడుకు, కూతురు.
సరే.. బహిరంగ సభలో అలా నినదించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడబడితే అక్కడ జై తెలంగాణ అని పిడికిలి పైకెత్తి నిందిస్తారు. పిడికిలి పైకెత్తి నినదించే అలవాటు కేసీఆర్ కు, కొడుకు కేటీఆర్ కు, కవితకు ఉంది. ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి కారులో ఢిల్లీకి తీసుకుపోతున్నప్పుడు కూడా కవిత ఫ్రీడమ్ ఫైటర్ మాదిరిగా కారులోనే పిడికిలి పైకెత్తి జై తెలంగాణ అని నినాదాలు చేసింది. తాను అరెస్టయింది అవినీతి కేసులో అన్న సోయి ఆమెకు లేనట్లు ఉంది.
నిన్న ఢిల్లీ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా కవితకు మరో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు చెప్పారు. ఆ తీర్పు చెప్పగానే జై తెలంగాణ …జై జై తెలంగాణా అనే కవిత నినాదాలు చేసింది. అది బహిరంగ సభ కాదు.. కోర్టు అన్న సోయి ఆమెకు లేదు.
ఈ అవినీతి కేసు కవిత వ్యక్తిగతం. తెలంగాణకు ఏం సంబంధం? లిక్కర్ కుంభకోణంతో తనకు ఏ సంబంధం లేదని, తాను ఎటువంటి మానిటరీ బెనిఫిట్ పొందలేదని చెప్పింది. తాను కడిగిన ముత్యాన్నని చెబుతోంది. తన పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవంటోంది. ఆమె కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.