Suryaa.co.in

Andhra Pradesh

చట్టాల అవగాహనతో మహిళల్లో మనోధైర్యం

– మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– సత్వర న్యాయంతో మహిళలకు రక్షణ
– ‘మహిళలు- సత్వరన్యాయం’ పై చర్చాగోష్టి
మంగళగిరి: మహిళలపై, బాలికలపై జరిగే లైంగిక హింసను ఎదుర్కోవడానికి సమర్థమైన విచారణ, త్వరితగతిన నేరస్థులకు శిక్షలు పడేటట్లు చూడడం మాత్రమే సత్వరన్యాయానికి పరిష్కారమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళలు- సత్వరన్యాయం’ అంశంపై జరిగిన చర్చాగోష్టికి రిటైర్డ్ జడ్జిలు, న్యాయ నిపుణులు, దిశ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్ అధ్యక్షత వహించగా వారంతా మాట్లాడుతూ తమ విలువైన సూచనలు వెల్లడించారు. కోర్టులు, పోలీసుస్టేషన్లను బలపరిచి మహిళలపై నేరాల విచారణ సమర్థంగా జరిగేటట్లు చూడడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను సిద్ధపరచడంపై కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్రిమినల్ కోర్టుల్లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీతో పాటు ప్రతీ వారంలో ఒకరోజు మహిళా సమస్యలు, కేసులపైనే కోర్టులు నడవడం మంచిదని.. ఆమేరకు న్యాయస్థానాలు ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
మహిళా కోర్టుల్లో, పోక్సో కోర్టుల్లో పూర్తిస్థాయి జడ్జీల నియామకం ఉండాలన్నారు. కోర్టుల కెళ్లే మహిళలు న్యాయం కోసం సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తుందన్నారు.హింసకు ప్రధానంగా మూలమైన పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు దానికి ప్రోత్సాహమే కలుగుతుంది గానీ తగ్గే మార్గాలుండవన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలన్నారు. చట్టాలపై అవగాహనతో మహిళల్లో మనోధైర్యాన్ని అందించేందుకు మహిళా కమిషన్ కృషి చేస్తుందన్నారు. వరకట్నం, గృహహింస, లైంగిక వేధింపులపై ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్లతో పరిశీలన చేయిస్తే క్రిమినల్ కేసుల తీవ్రత తెలుస్తుందన్నారు.
దిశ పోలీసు స్టేషన్ల సత్వర స్పందనతో పాటు పలు కేసుల్లో పోలీసు ల్యాబ్ నివేదికలు కీలకమని… ల్యాబ్ ల పెరుదల ఉండాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పుణ్యాన మహిళల జీవితాల్లో మార్పును గమనిస్తున్నామని.. మహిళా సాధికారత విషయంలో ప్రభుత్వ విధానాలుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ మహిళల ప్రాథమిక హక్కుల్లో మహిళకు సత్వర న్యాయం ముఖ్య విషయన్నారు. బాధితులకు నష్ట పరిహారం అందజేత వ్యవహారంలో వివిధ శాఖల అధికారుల సఖ్యత ముఖ్యమన్నారు.
రిటైర్డ్ సీనియర్ జడ్జి జస్టిస్ జి.వి. కృష్ణయ్య మాట్లాడుతూ గృహ హింస, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు ప్రొటెక్షన్ అధికారులు అండగా ఉండాలన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి రక్షణ కల్పిస్తే 304(బి), 306 ఐపిసీలకు తావుండదన్నారు. కృష్ణా జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి రాజారాం మాట్లాడుతూ లోక్ అదాలత్ లలో కేసుల పరిష్కారంతో బాధితులకు పరిహారం త్వరగా అందించే ప్రయత్నాలు చేయాలన్నారు. కృష్ణా జిల్లాల్లోని 1050 గ్రామాల్లో పారా లీగల్, ప్యానల్ న్యాయవాదులతో లీగల్ సర్వీసెస్ అథారిటీ పనితీరుపై అవగాహన చేస్తున్నామని వివరించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలను అందిస్తున్నామన్నారు.
భార్యభర్తల మధ్య గల వివాహ సంబంధ వివాదం, మనోవర్తి, విడాకులు, అత్తింటివారి ఆరళ్లు, పిల్లల మనోవర్తి, భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల సివిల్‌, క్రిమినల్‌ కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా ఎలాంటి ఫీజులూ లేకుండా శాశ్వతమైన, అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం అందించేందుకు లోక్‌ అదాలత్‌ తోడ్పడుతుందని వివరించారు.
ఈ చర్చాగోష్టిలో రాష్ర్టసాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శ్రీలక్ష్మి, పోస్కో పీపి నారాయణ రెడ్డి, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ఆర్.కె.శర్మ, బార్ కౌన్సిల్ మెంబర్ రోళ్ల మాధవి, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డిపి రామకృష్ణ, గుంటూరు, కృష్ణా జిల్లాల దిశ డీఎస్పీలు రవిచంద్ర, నాయుడు, లీగల్ కౌన్సిలర్లు కోటేశ్వరి, పద్మ, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ప్రతినిధి సత్యవతి, దళిత స్త్రీ శక్తి ప్రతినిధి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE