కేంద్రం జీతాలిస్తుంటే మూసేయడానికి రాష్ట్రానికి ఉన్నహక్కు ఎక్కడిది.?

– ‘‘నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు’’ అన్న బైబిల్ సూక్తి గుర్తులేదా..?
– తెలుగుదేశం ఏపీ అధికార ప్రతినిధి దివ్యవాణి
ఎన్టీఆర్ భవన్(హైదరాబాద్) లో విలేకరుల సమావేశంలో తెలుగుదేశం ఏపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ఏపి అంతటా ఒకటే నినాదం..వుయ్ వాంట్ జస్టిస్, వుయ్ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి అని నినదిస్తున్నారు..పసిబిడ్డలనుంచి, ముసలివాళ్ల వరకు అన్ని వయస్కులు, అన్నివర్గాల వాళ్లు తమ సమస్యలపై రోడ్డెక్కడం వైసిపి తెచ్చిన దౌర్భాగ్యం.
అనంతపురంలో ఎస్ ఎస్ బిఎన్ కళాశాల వద్ద నిన్న జరిగిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం.
అసలు ఎయిడెడ్ స్కూళ్లు మీకు చేసిన అన్యాయం ఏమిటి..? వాటి భూములపై కన్నేసి, ఆస్తులు ఆక్రమించడానికే ఎయిడెడ్ స్కూళ్లను మూసేయాలని చూస్తున్నారు. అనాలోచితంగా ఇటువంటి పిచ్చ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు..? కేంద్రం జీతాలిస్తుంటే మూసేయడానికి రాష్ట్రానికి ఉన్నహక్కు ఎక్కడిది.?
ఆర్ధికంగా చేయూత ఇస్తే పేద విద్యార్ధులకు బడుగు బలహీన వర్గాల వారికి చదువులు అందుబాటులో ఉంటాయనే సదుద్దేశంతో ఎయిడెడ్ స్కూళ్ల ఏర్పాటు జరిగింది.నిరుపేద విద్యార్ధుల చదువులకు చేయూతనిచ్చే ఈ స్కూళ్లను మూసేయడం అన్యాయం.‘‘మా చదువులను ఆపకండి మా స్కూళ్లను మూసేయకండి’’ అని అడిగిన చిన్నారి బిడ్డల తలలు పగులకొట్టే కర్కశత్వం ఎక్కడిది..?
రక్షకులే భక్షకులైతే సామాన్య ప్రజలు ఇక ఎవరిని ఆశ్రయించాలి..?విద్యార్ధుల నిరసనలు, వాళ్ల తల్లిదండ్రుల ఆందోళన మీకు పట్టదా..?రాత్రికి రాత్రే జీవోలిచ్చి పిచ్చ నిర్ణయాలు తీసుకుంటూ పసిబిడ్డల భవిష్యత్ కాలరాసే అధికారం మీకెక్కడిది..?
మీరు పెంచిన ఫీజులు రూ 10వేలు, 11వేలు 12వేలు ఫీజులను పేదలు, సామాన్యులు ఎక్కడనుంచి తెచ్చి కట్టగలరు..? కరోనాతో ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో వేలాది రూపాయిల ఫీజులు ఎలా చెల్లిస్తారు..?
విజయవాడలో మాంటిస్సోరి మూసేశారు. విశాఖలో సేక్రడ్ హార్ట్స్ మూసేశారు. అనంతపురం ఎస్ ఎస్ ఎన్ పాఠశాల ముక్కుపచ్చలారని బిడ్డల బుర్రలు పగులకొట్టారు.యువత తిరగబడితే ప్రభుత్వాలే తిరగబడ్తాయని గుర్తుపెట్టుకోండి.రైతులను రోడ్డెక్కించారు, మహిళలను రోడ్డెక్కించారు, ఇప్పుడు విద్యార్ధులను రోడ్లపాలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పాలన లేదు.
‘‘నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు’’ అన్న బైబిల్ సూక్తి గుర్తులేదా..? ఆ మాట అర్ధం ఈ ముఖ్యమంత్రికి, డిజిపికి తెలుసా…? దానిని పాటిస్తున్నారా..? మీరు పాటించే క్రైస్తవం ఇదేనా..?
విద్యార్ధుల తలలు పగులకొట్టడమేనా మీ పాలన..పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడమేనా మీ పాలన..?
ఇంటింటికీ అమ్మవడి ఇస్తానన్నారు, ఇదేనా అమ్మవడి..? లాఠీలతో కొట్టించడమా అమ్మవడి..? మీ ఓట్ల కోసం ఇంటింటికి తిరిగారే, మీ తండ్రి మరణాన్ని కూడా ఓట్లుగా మార్చుకోవాలని చూశారే..? మీ చిన్నాయన హత్యను ఓట్లుగా మార్చుకోవాలని చూశారే..? మీ అధికారం కోసం ఆరాటమే తప్ప పేదల సంక్షేమం పట్టదా..?పేద బిడ్డల ఆక్రందన మీకు వినబడటంలేదా..? బడుగు బలహీనవర్గాల విద్యార్ధుల భవిష్యత్ కాలరాసే హక్కు ఎవరిచ్చారు..?విద్యార్ధులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై మీరు తీసుకున్న చర్యలేమిటి..?2వేల ఎయిడెడ్ స్కూళ్ల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారు. 7వేల ఉపాధ్యాయులు, లక్షలాది విద్యార్ధులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు..
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు అనంతపురంలో విద్యార్ధుల లాఠీఛార్జ్ పట్టదా..? జగన్మోహన్ రెడ్డి సిఎం కావడం వెనుక నువ్వుకూడా ఉన్నావు..సిఎం అంటే కామన్ మేన్ అన్న షర్మిల మీ కామన్ మ్యాన్ ఏపిలో చేస్తున్న దుర్మార్గం పట్టదా…?అమరావతిలో రైతులపై అక్రమ కేసులు పెట్టారు.. మహా పాదయాత్ర చేస్తున్న మహిళలకు నరకం చూపిస్తున్నారు. రాజధాని మహిళలపై పోలీసుల జులుం ఎవరూ మరిచిపోరు.వుయ్ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డెక్కిన విద్యార్ధులు మీకు పట్టదా..?వుయ్ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డెక్కిన అమరావతి మహిళల ఆక్రందన వినిపించదా..?వుయ్ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డెక్కిన విశాఖ ఉక్కు కార్మికుల గోడు మీకు వినబడదా..?ఇసుక లేక ఉపాధి పోయి, ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డునపడ్డ కూలీల ఆక్రందన మీకు పట్టదా..?అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా..? అదేమని అడిగితే అక్రమ కేసులు పెడతారా..?చివరికి చెత్తమీద కూడా పన్నులేసే చెత్త ప్రభుత్వం ఇది..
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీరు రోడ్డుపాలు చేసిన విద్యార్ధులు, రైతులు, మహిళలు, కార్మికులే మీకు బుద్దిచెప్పే రోజు త్వరలోనే ఉంది.ఇప్పటికైనా సిఎం జగన్ మేల్కొనాలి, భావితరాల భవిష్యత్ ను దెబ్బకొట్టే చర్యలు మానుకోవాలి. దైవవాక్యం అనుసరించి పాలన చేయండి. ప్రజా క్షేమానికి పాటుబడండి’’ అని దివ్యవాణి పేర్కొన్నారు.