Suryaa.co.in

Andhra Pradesh

జగన్ నియంత పాలన

-ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ
-విపక్షాల ఉద్యమంపై పోలీసులతో ఉక్కుపాదమా?
-విద్యుత్ కొనుగోళ్లపై దమ్ముంటే చర్చకు సిద్ధమా?
-అధిక ధరలు, పన్నులు తగ్గించే వరకూ ఉద్యమం
-15న వామపక్ష పార్టీల భేటీ
-రైతుల ఆందోళనలకు సంఘీభావం
– చంద్రబాబుపై కేసులు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు కావడానికే…
-విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ఢ

అమరావతి: రాష్ట్రంలో విపక్షాల ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం అణచివేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ దాసరి భవన్ లో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు రాజ్యంతో నియంత పాలన నడుస్తుందా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా? జగన్ కేమైనా సొంత రాజ్యాంగం ఉందా? అంటూ నిలదీశారు.ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా నిరసనలు, ర్యాలీలను అడ్డుకుంటుందని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజా సమస్యలపై నిరసనలు తెలపడం పరిపాటి అని గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు చేయమని ఉద్యోగులు నిరసనలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ పోలీస్ లను పెట్టి అరెస్టులు చేశారన్నారు.చైతన్యవంతమైన నగరం విజయవాడ అని, వామపక్ష పోరాటాలకు పురిటి గడ్డయిన విజయవాడలో, ప్రజాసమస్యలపై విపక్షాలు ఉద్యమించకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాన్నదన్నారు. విజయవాడలో ఆందోళనలు నిర్వహిస్తే, ఎక్కడో ఉన్న వెలగపూడి ఏపీ సచివాలయం దగ్గర శాంతి భద్రతలకు ఆటంకం ఎలా కలుగుతుందంటూ ప్రశ్నించారు.

వాస్తవంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపడతాయని వివరించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయాల్లోనూ దిల్లీ జంతర్ మంతర్ దగ్గర విపక్షాలు నిరసనలు చేపట్టి వినతులిస్తాయన్నారు. ఏపీలో ఇవేమీ జరగకుండా జగన్ ప్రభుత్వం
26 జిల్లాల్లో నియంత పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడ ఏమైనా నిషేధిత ప్రాంతమా? లేక కమ్యూనిస్టులేమైనా టెర్రరిస్టులా? అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఖచ్చితంగా పెరిగిన ధరలు తగ్గించేంత వరకూ ఉద్యమిస్తామని చెప్పారు.గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులను ప్రజలంతా నిలదీయాలని కోరారు.ఏపీలో పన్నులు, చార్జీలు, నిత్యావసరాలు, పెరిగిపోయాయని, పక్క రాష్ట్రాలకంటే పెట్రోల్ , డీజిల్ అధిక రేట్లతో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.ఆదానితో లాలూచీ పడి అధిక ధరకు జగన్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్నారు.మార్కెట్టులో సోలార్ విద్యుత్ రూ.1.99 పైసలు ఉండగా, దీనిని రూ.2.49పైసలకు అదానీ కంపెనీతో కుమ్మకై అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఛాలెంజ్ చేస్తున్నామని, చర్చకు ప్రభుత్వం సిద్ధమా?, దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.22,500 కోట్ల భారాన్ని జగన్ మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంపై తాము హైకోర్టులో కేసు వేశామని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలను దేశంలో మొదటిగా మధ్యప్రదేశ్, రెండోదిగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం విద్యుత్ సంస్కరణలను అమలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నాయని చెప్పారు.

భవిష్యత్తులో రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేసేందుకుగాను జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిపై రైతు సంఘాలు సమావేశమై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారని చెప్పారు.మీటర్లు పెడితే కరెంటు ఆదా అవుతుందంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా అవాస్తమని ఆయన త్రోసిపుచ్చారు.ఆస్తి పన్నుపై మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినన్ని అబద్ధాలను, ఎవరూ చెప్పి ఉండబోరంటూ ఎద్దేవా చేశారు. ఈనెల 15వ తేదీన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహిస్తామని, ధరలు, పన్నులు తగ్గించే వరకు పోరాడతామని వెల్లడించారు.వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లపై మంత్రి వ్యాఖ్యలు బాధ్యతరాహిత్యమన్నారు. రైతులతో కలిసి మీటర్ల బిగింపుపై ఉద్యమిస్తామని చెప్పారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీపీఐ నేత కె.రామకృష్ణ జవాబిస్తూ…
రాని రింగురోడ్డు గురించి చంద్రబాబుపై కేసు పెడతామనడం హాస్యాస్పదమన్నారు.ఇలాంటి కేసులతో చంద్రబాబుపై సానుభూతి జగనే తెప్పిస్తారని, ఆ కేసుపై కోర్టులో మరోసారి అభాసుపాలవుతారంటూ ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE