Suryaa.co.in

National

ఆరు వేల కోట్ల అదానీ స్కాంపై ఊసే లేదు

– అంతా గప్‌..చుప్‌
– నాసిరకం బొగ్గు కొని నాణ్యమైన సరుకుగా అమ్మకం
– 2014లోనే జరిగినా స్పందించని తమిళ పార్టీలు, ప్రభుత్వం
– సార్వత్రికంలో ప్రధాన పార్టీల నేతలు సైలెంట్‌
– బొగ్గు అక్రమాలపై విచారణకు సీపీఐ(ఎం) డిమాండ్‌

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓ మీడియా సంస్థ ఆరు వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టింది. అదానీ గ్రూప్‌ 2014లో నాసిరకం బొగ్గును నాణ్యమైన బొగ్గుగా చూపి తమిళనాడు ప్రభుత్వ జనరేషన్‌-డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (టాంగెడ్కో)కి విక్రయించిందని లండన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక వారం రోజుల క్రితం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ ఒప్పందం విలువ అక్షరాలా ఆరు వేల కోట్ల రూపాయలు. భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలేవీ దానిపై స్పందించలేదు. బొగ్గు కుంభకోణంపై ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) రూపొందించిన నివేదికనే ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది.

అయితే ఓసీసీఆర్‌పీ నివేదికపై ప్రధాన పార్టీలేవీ వ్యాఖ్యలు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దశాబ్ద కాలంగా అదానీ, అంబానీలే కాదు కోట్లు కొల్లగొట్టి ..బ్యాంకుల్ని నిట్టనిలువునా ముంచేసి ఉడాయించిన పెద్దల గురించి తెలిసినా…మోడీ ప్రభుత్వం పల్లెత్తుమాట అనలేదు. అక్రమాలకు పాల్పడిన కార్పొరేట్లు, పెద్దల్ని తమ పార్టీలో చేర్చుకోవటమో.. విరాళాలు ఇచ్చిన వారిని కాపాడుకోవడమో చేస్తూ వచ్చింది.

అందువల్లే అదానీ బొగ్గు స్కాంలో కోట్లు దండుకున్నా…పోనీలే మనోడు అన్న తీరులోనే వ్యవహరించారు. పిల్లి కండ్లుమూసుకుని పాలు తాగుతున్న చందాన అక్రమార్కులకు అండగా నిలిస్తే.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ఈ ఉదంతం పతాక శీర్షికల్లో నిలించింది. గోడి మీడియా మాత్రం దాన్నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చిందని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్‌ నిలదీస్తే..
పదేండ్లుగా గుజరాత్‌ దోస్తులైన అంబానీ, అదానీలతో అంటకాగిన మోడీ.. వారిద్దరూ తమవాళ్లు కాదన్నట్టుగా ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్‌ నెత్తిన రుద్దే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిస్పం దించిన కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం తగ్గలేదు. కార్పొరేట్లు ఇచ్చిన విరాళాలు సహా అన్నింటిపై విచారణ చేసుకోవాలని ఘాటుగా సమాధానమిచ్చింది. దీంతో బీజేపీ సైలెంట్‌ అయిపోయింది.

ఏం జరిగింది?
‘2014 జనవరిలో అదానీ ఇండొనేషియా నుండి బొగ్గును కొనుగోలు చేశారు. ఈ బొగ్గులో కిలోకు 3,500 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇదే సరుకును 6,000 కేలరీల బొగ్గుగా చూపించి విక్రయిం చారు. ఆరు వేల కేలరీలు అంటే బాగా విలువైన గ్రేడ్‌గా పరిగణిస్తారు. ఈ అమ్మకం ప్రక్రియ ద్వారా అదానీ రవాణా ఖర్చులు పోను రెట్టింపు కంటే ఎక్కువగానే లాభం గడించారు’ అని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వివరిం చింది. ఆ సంవత్సరం మొత్తం 22 నౌకల ద్వారా బొగ్గు రవాణా జరిగింది. విద్యుదుత్పత్తి కోసం తక్కువ గ్రేడ్‌ ఉన్న బొగ్గును ఉపయోగిస్తే ఇంధనాన్ని ఎక్కువ పరిమాణంలో మండించాల్సి వస్తుంది. దీనివల్ల గాలి నాణ్యత పడిపోతుంది. కాలుష్యం పెరుగుతుంది. అంటే అదానీ గ్రూపు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి లాభార్జనే ధ్యేయంగా అవినీతికి పాల్పడిందని అర్థమవుతోంది.

నోరు మెదపని తమిళ పార్టీలు
తమిళనాడులో ఇంత పెద్ద అవినీతి కుంభకోణం జరిగితే డీఎంకే కానీ, అన్నా డీఎంకే కానీ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఈ కుంభకోణం అన్నా డీఎంకే పాలనలో జరిగినప్పటికీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పాలక పక్షాన్ని ఎండగట్టలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మౌనాన్నే ఆశ్రయిం చింది.

రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై పత్రికా ప్రకటనలు విడుదల చేసే పట్టాలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) సైతం నోరు మెదపడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ కుంభకోణంపై స్పందించింది. కేంద్రంలో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపింది. ఇంత బహిరంగంగా అవినీతి జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రశ్నించారు.

2018లోనే ఫిర్యాదు చేశాం
రాజకీయ నాయకుల మౌనం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ అరప్పోర్‌ ఇయక్కమ్‌ కన్వీనర్‌ జయరామ్‌ వెంకటేశన్‌ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంపై తాము 2018లో రాష్ట్ర విజిలెన్స్‌, అవినీతి నిరోధక డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని చెప్పారు. ఈ విషయాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) కూడా ఆరేండ్ల కిందటే ప్రస్తావించింది. కాగా తనపైవచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. అవి తప్పుడు ఆరోపణలని, ఆధారాలు లేవని తెలిపింది.

విచారణకు సీపీఐ (ఎం) డిమాండ్‌
2014లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అదానీ గ్రూప్‌ కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కుంభకోణంపై స్పందించేందుకు తమిళనాడు ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి తంగమ్‌ తెన్నరసు అందుబాటులోకి రాలేదు. టాంగెడ్కో అధికారులు కూడా దీనిపై ఏమీ మాట్లాడడం లేదు.

LEAVE A RESPONSE