ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. క్రికెట్ ప్రముఖులతో పాటు క్రీడా ప్రేమికులు, అభిమానులు ఈ దిగ్గజ క్రీడాకారుడికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాథాయిలాండ్‌లోని కోహ్ సమీపంలోని విల్లాలో షేన్ వార్న్అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా క్రికెట్ లో ఆల్ టైం గ్రేటెస్ట్ స్పిన్నర్ గా పేరొందిన షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. వార్న్ తన మొదటి మ్యాచ్ ను టీమిండియాపైనే ఆడడం గమనార్హం. మొత్తం కెరీర్ లో 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. కాగా సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో క్రికెటర్ గా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.
ఇండియాతోనూ అనుబంధం..
ఐపీఎల్ తొలి ట్రోఫీ అందుకున్న మొదటి కెప్టెన్ షేన్ వార్న్
షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్‌లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
తొలి సీజన్‌లో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండానే వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు బరిలోకి దిగింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఊహకు అందని రీతిలో వార్న్ తన జట్టును
ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్‌లో పకడ్బందీ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపాడు. నాడు ఐపీఎల్ తొలి టైటిల్‌ను ముద్దాడిన వార్న్.. కప్‌తో జట్టు సభ్యులతో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. కాగా వార్న్ మృతిపై ఇప్పటికే భారత క్రికెట్ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.