* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు
* వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు
* హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులతో కలిసి మైదానం మొత్తం జగన్ మోహన్ రావు పరిశీలించారు. మరో పది రోజుల్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుండడంతో పనుల్లో వేగం పెంచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.
స్టేడియం మొత్తం రంగులు వేస్తున్నామని, నార్త్ స్టాండ్స్‌లో కొత్త రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నామని, క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టైల్స్ మారుస్తున్నామని చెప్పారు. స్టేడియంకు కొత్త రూపు ఇచ్చేందుకు హెచ్‌సీఏ నుంచి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, సీఎస్ఆర్ పథకం కింద ఎస్ఆర్‌హెచ్ కూడా సహకారం అందిస్తుందని జగన్ మోహన్ రావు తెలిపారు. జగన్ మోహన్ రావుతో పాటు బీసీసీఐ నుంచి వైభవ్, యువరాజ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నుంచి శరవానణ్, రోహిత్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.