– అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: తలసీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తలసీమియా రోగులకు అందుతున్న చికిత్స, ఆర్ధిక సాయం వంటి అంశాలపై బుధవారం శాసనసభలో బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తలసీమియా రోగి పరిస్థితి తీవ్రత, అందుతున్న చికిత్స , ప్రభుత్వ, లేదా ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారా అన్న అంశాలపై వ్యాధి చికిత్సకయ్యే వాస్తవ ఖర్చు ఆధారపడి వుంటుందని వివరించారు.
తలసీమియా రోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్బిటిసి, డిజిహెచ్ఎస్ మార్గదర్శకాల మేరకు అన్ని (ప్రభుత్వ, ప్రైవేట్) రక్తకేంద్రాల వద్ద అవసరమైన రక్తం యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. అదే విధంగా రక్తమార్పిడి కోసం అవసరమైన ల్యూకో డిప్లెషన్ ఫిల్టర్ కిట్లను, ఐరన్ చిలేటింగ్ మందుల్ని కూడా వారికి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. తలసీమియా రోగుల్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు వారికి నెలకు రు.10 వేలు పెన్షన్ అందజేస్తున్నామన్నారు. తలసీమియా రోగుల దరఖాస్తుల్ని సెర్ప్ పరిశీలించిన అనంతరం ఆర్ధిక శాఖ వారికి పెన్షన్లు మంజూరు చేస్తుందని, వైద్య,ఆరోగ్యశాఖ ద్వారా వారికి పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న దాదాపు1094 మంది తలసీమియా రోగులకు రక్తమార్పిడి చికిత్సను ఉచితంగా అందిస్తున్నామన్నారు. వారు ఈ చికిత్సను మూడు వారాలకోసారి తీసుకోవాల్సి వుంటుందన్నారు. రక్త మార్పిడి కారణంగా శరీరంలో ఇనుప ధాతువు (ఐరన్ కంటెంట్) పెరుగుతుంది కాబట్టి వివిధ అవయవాలు, ముఖ్యంగా గుండె దెబ్బతినే ప్రమాదం వుందని, అందువల్ల వీరికి ఐరన్ చిలేషన్ థెరపీని కూడా ఉచితంగా చేస్తున్నామన్నారు.
తలసీమియా రోగులలో వ్యాధి గ్రస్తులు, వ్యాధి వాహకులు(క్యారియర్స్) వుంటారని, వారిలో బీటాజీన్ అసాధారణ స్థితిలో వుండటం వల్ల వారికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని మంత్రి వివరించారు. వీరికి పూర్తి స్థాయి చికిత్స అందించాలంటే బోన్ మ్యారో చికిత్స చేయాల్సి వుంటుందన్నారు. ఇది అత్యంత ఖర్చుతో కూడినదైనందున దీనిపై కూడా తాము ఇటీవల సమీక్షించామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ద్రుష్టికి తీసుకెళ్లినపుడు ఆయన స్పందిస్తూ డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా వారికి ఆర్ధిక సాయమందించేందుకు అంగీకరించారని సభకు వివరించారు.
ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా కేవలం దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారికి మాత్రమే కాక ఎగువనున్న మధ్యతరగతి వారికి కూడా సాయమందించేందుకు ముఖ్యమంత్రి ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారని, తలసీమియా రోగుల్ని కూడా ఆదుకునేందుకు ఆయన అంగీకరించారని మంత్రి వివరించారు. గతంలో రాజకీయ కారణాలతో అనేక మందికి ఈ లబ్ది అందకుండా గత పాలకులు వ్యవహరించారని, ఇప్పుడు తమ ప్రభుత్వ ఎటువంటి వివక్షకూ తావులేకుండా అర్హులైన అందరికీ ఈ సాయమందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
తలసీమియా వ్యాధి గ్రస్తుల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు సేవలందిస్తున్నాయని, ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో సంగీత విభావరి నిర్వహించి నిధులు సమీకరించారని మంత్రి తెలిపారు. అదే విధంగా రెడ్ క్రాస్ సంస్థ కూడా తలసీమియా తదితర వ్యాధిగ్రస్తుల్ని ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ అంశాల్ని పరిశీలించిన తరువాత వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువగానే వుందని, వ్యాధి వాహకుల సంఖ్య ఎక్కువగా వుందన్న విషయాన్ని తాము గుర్తించామని చెప్పారు.
ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సి వుందన్నారు. తల్లిదండ్రులు మేనరికపు వివాహాల్ని తగ్గించాల్సిన అవసరం వుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి వుంటే వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం వుందన్నారు. ఈ వ్యాధితో పుట్టిన చిన్నారులు రెండు, రెండున్నరేళ్ళకే మరణించే అవకాశాలున్నాయన్నారు. తలసీమియా వ్యాధి గ్రస్తులు సగటున 35-40 ఏళ్ళ వరకూ మాత్రమే జీవించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారని మంత్రి వివరించారు.
అయితే బోన్ మ్యారో చికిత్స చేయించుకుంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉఅందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినపుడు దాదాపు 130 మంది వరకూ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలిందన్నారు. సమస్య కొంత తీవ్రంగా వున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తోందన్నారు.