-కలిసికట్టుగా ‘ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ ప్రపంచానికి పరిచయం చేద్దాం!
– విద్యాశాఖ భారం కాదు.. నా బాధ్యత
– లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్(లీప్) మోడల్ తీసుకువస్తాం
– విద్యావ్యవస్థలో సంస్కరణలకు అందరం బాధ్యత తీసుకోవాలి
– పదేళ్లలో జరగని సంస్కరణలు 9 నెలల్లోనే చేపట్టాం
– గడచిన ఐదేళ్లలో 12 లక్షల మంది పాఠశాలలకు దూరమయ్యారు
– ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తాం
– వైసీపీ హయాంలో రూ.4,271 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు
– ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తాం
– విద్యారంగంలో సంస్కరణలపై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి నారా లోకేష్
అమరావతి: కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి పరిచయం చేద్దామని, విద్యాశాఖ భారం కాదు.. తన బాధ్యత అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..
విద్యాశాఖ భారం కాదు.. నా బాధ్యత. ముఖ్యమంత్రి ఏ శాఖ కావాలని అడిగినప్పుడు కఠిన శాఖ ఇవ్వాలని కోరాను. అందులో భాగంగా నేనే విద్యాశాఖ కావాలని స్వయంగా అడిగాను. అసమానతలు పోవాలంటే విద్యతోనే సాధ్యం అని చెప్పాను. నేను ఏ బాధ్యతలు తీసుకున్నా.. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది, ఏం మార్పులు చేయాలనేది చూస్తాను. గతంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నప్పుడు.. అది చాలా సులభమైన శాఖ. కష్టమని చాలా మంది చెప్పారు. కానీ ఆ శాఖ చాలా సులభం. డేటా ఉంది. ఆరునెలల్లో డ్యాష్ బోర్డు తయారుచేయించుకుని సులభంగా ట్రాక్ చేశాను.
ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు
నేను మంత్రి అయిన తర్వాత విద్యాశాఖ అధికారులను అడిగిన మొదటి ప్రశ్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారని అడిగాను. ఇందుకు ఆరు నెలల సమయం పట్టింది. మళ్లీ ఎవరో రాసిన లెక్కలు చెప్పడం కాదు.. ఆన్ లైన్ లో తెలియాలని చెప్పా. అది చూసిన తర్వాత నిజంగా బాధేసింది. గడచిన ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఇది రికార్డ్. పాఠశాల విద్య, జూనియర్ కళాశాలలను కలిపి చెప్పిన లెక్క ఇది. ఇందుకు ప్రధాన కారణం జీవో 117. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ప్రతిపక్ష నేతలు కూడా ఉంటే బాగుండేది. చర్చ జరగాలి. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. జీవో 117 వల్ల పది మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు టీడీపీ హయాంలో 1,215 ఉంటే.. వైసీపీ హయాంలో 5,500 పాఠశాలలకు పెరిగాయి. 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు గతంలో 5,520 ఉంటే… అది 13,720కి పెరిగాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,512కి పెరిగాయి. డేటా కోసం ఎందుకు ఇంత సమయం పడుతుందని మీరందరూ అడగవచ్చు. కావాలని రికార్డులను గత ప్రభుత్వం తారుమారు చేసింది. డ్రాప్ బాక్స్ లో లక్షమంది విద్యార్థులను ఉంచారు. వీరంతా 17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారు. ఎన్ రోల్ మెంట్ చూపించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా పనిచేసింది. దీనివల్ల 12.5 శాతానికి డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది.
వైసీపీ పాలనలో ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ పడిపోయాయి
ఎన్ఏఎస్ సర్వే ప్రకారం 2017 నుంచి 2021 వరకు 3వ తరగతి లాంగ్వేజ్ లో టీడీపీ ప్రభుత్వంలో మొదటి స్థానంలో ఉంటే.. 2021కి వచ్చేనాటికి 27వ స్థానానికి పడిపోయాం. పదోతరగతి మ్యాథ్స్ సబ్జెక్టుకు వస్తే.. మనం మొదటి స్థానం నుంచి 12వ స్థానానికి, సైన్స్ మొదటి స్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం. ఇంగ్లీష్ ఏకంగా 4వ స్థానం నుంచి 14వ స్థానానికి పడిపోయాం. ఏఎస్ఈఆర్ సర్వే ప్రకారం ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని 2018లో 57శాతం మంది చదవగా.. అది 37శాతానికి పడిపోయింది. 8వ తరగతి విద్యార్థులు కూడా గతంలో 78 శాతం మంది రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగా.. నేడు 53 శాతానికి పడిపోయింది. 90 శాతం మంది ముడో తరగతి విద్యార్థుల్లో ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ లేవు.
సీబీఎస్ఈ విధానంపై కసరత్తు చేయలేదు
మండలిలో నిరసన తెలుపుతూ సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ గురించి మాట్లాడారు. నేను కూడా సీబీఎస్ఈ స్టూడెంట్ నే. ఇందుకు చాలా కసరత్తు అవసరం. గత ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత లేకుండా వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్ టెస్ట్ పెడితే 90 శాతం మంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెట్ లో ఫెయిల్ అయ్యారు. అందుకే అందరినీ సన్నద్ధం చేసిన తర్వాతనే సీబీఎస్ఈ విధానానికి వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యం. టోఫెల్ అమలుచేసేందుకు ఆ సంస్థకు రూ.59 కోట్లు చెల్లించారు. పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఐబీ విషయానికి వస్తే మధ్యంతర నివేదికకే రూ.5 కోట్లు వృధా చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది.
అక్రమ కేసులను ఎత్తివేస్తాం
గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నో రకాలుగా అవమానించింది. ఏకంగా మద్యం షాపుల ముందు కాపలాగా పెట్టారు. ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే కేసుల పేరుతో వేధించారు. గతంలో పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 2022లో 1,570 మంది ఉపాధ్యాయులను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. 45 యాప్ లు తీసుకువచ్చారు. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టారు. టాయిలెట్ క్లీనింగ్ దగ్గర యాప్ తొలగించాం. మిగతా యాప్ ల భారాన్ని తగ్గిస్తాం. సింగిల్ ఫ్లాట్ ఫాం తీసుకువస్తాం.
కేంద్రం నిధులకు కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు
నాడు-నేడు కింద మొదటి విడత పనులు పూర్తిచేసేందుకు రూ.881 కోట్లు అవసరం. నాడు-నేడులో బెంచ్ లు అందించిన పాఠశాలలను 117 జీవో ద్వారా మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.900 కోట్లు మౌలిక సదుపాయాలకు కేటాయిస్తే.. గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు.
పారదర్శకంగా టెండర్లు
పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం. ఒక్క స్కూల్ కిట్లలోనే వచ్చే ఐదేళ్లలో 300 కోట్ల రూపాయలు ఆదా చేయనున్నాం. 9.4శాతం ధరలు తగ్గించాం. ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు పెట్టలేదు. ఎవరి సందేశాలు లేవు. మంచి నాణ్యతతో రెండు వైపు ప్రింటింగ్ చేసి స్కూల్ యూనిఫామ్స్ అందిస్తున్నాం. పొలిటకల్ రంగులు ఎక్కడా లేవు. గత ప్రభుత్వం బ్యాగులను కూడా వదిలిపెట్టలేదు. జగన్ రెడ్డి పేరు రాసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. ఎక్కడా మా పార్టీ రంగులు లేవు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఎక్కడా మా ఫోటోలు, రంగులు లేవు. ఎక్కడా రీసైక్లింగ్ అవ్వకూడదని చిక్కీల్లో కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం. బెల్ట్ పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ముద్రించాం.
రాజకీయ నేతల ఫోటోలు లేవు
పుస్తకాల బరువు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర వెళ్లి పరిశీలన చేశాం. మొదటి తరగతి ఫస్ట్ సెమ్ కి రెండే రెండు పుస్తకాలు ఇవ్వనున్నాం. సెకెండ్ సెమ్ కు రెండు పుస్తకాలు ఇస్తాం. గతంలో ఎనమిది పుస్తకాలు ఇచ్చేవారు. వీటిని నాలుగు చేశాం. అన్ని తరగతుల్లో తగ్గించాం. ప్రభుత్వ లోగో తప్ప ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు లేవు. చిక్కీల్లో ఐదేళ్లలో 240 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నాం. కోడిగుడ్ల రవాణలో 144 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నాం. చాలా పారదర్శకంగా చేస్తున్నాం. గత ప్రభుత్వం సుమారు రూ.352 కోట్ల బకాయిలు పెట్టారు. గుడ్లకు రూ.200 కోట్లు, చిక్కీలకు రూ.60 కోట్లు, ఆయా, నైట్ వాచ్ మెన్ లకు రూ.65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ కు 22 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. అవన్నీ కూటమి ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం ట్యాబ్ ల కోసం రూ.1300 కోట్లు వృధా చేసింది. సూపర్ విజన్ తో ప్రభుత్వ పాఠశాలల్లో డెస్క్ టాప్ కంప్యూటర్లు అందజేస్తాం.
మొదటి ఏడాదిలోనే ఇంటర్ లో ప్రవేశాలు పెరిగాయి
కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే జూనియర్ కాలేజీల్లో 16.61 శాతం ప్రవేశాలు పెరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఉత్తీర్ణత 42శాతం ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 30శాతానికి పడిపోయింది. రెండో ఏడాదిలో 58 శాతం ఉంటే.. వైసీపీ హయాంలో 39శాతానికి పడిపోయింది. ఇంటర్ విద్యార్థులకు స్కూల్స్ కిట్స్ ను, మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశారు. హైస్కూల్ ప్లస్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను వీసీలు
ఉన్నత విద్య విషయానికి వస్తే 2014 నుంచి 2019 వరకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో 200 లోపు ర్యాంకుల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 9 ఉండగా.. నేడు 5కి పడిపోయాయి. 2019లో ఏయూ యూనివర్సిటీ 29వ ర్యాంకులో ఉంటే.. నేడు 41వ ర్యాంకుకు పడిపోయింది. ఎస్వీయూ 72 నుంచి 100-150 మధ్య పడిపోయింది. ఏఎన్ యూ అసలు ర్యాంకింగ్ కు ఎంపిక కాలేదు. 2024లో 97వ స్థానానికి వచ్చింది. జేఎన్టీయూ అనంతపూర్, కాకినాడ, ఎస్కేయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీ లు ర్యాంకింగ్ కు ఎంపిక కాలేదు. ఇందుకు కారణం జగన్ రెడ్డి, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను ఏకంగా వీసీలుగా నియమించారు. ఏయూ యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డి, ఎస్వీయూ యూనివర్సిటీ వీసీ ఏకపక్షంగా వ్యవహరించారు.
వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం
వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం. ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ఐటీ వరంగల్ లో పనిచేసిన వారిని వీసీలుగా నియమించాం. అద్భుతమైన వైస్ ఛాన్స్ లర్స్ ను జల్లెడ పట్టి తీసుకువచ్చాం. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి మన వైఎస్ ఛాన్స్ లర్ ను తీసుకెళ్లారు. వీసీలుగా ఉన్నవారు ఎవరూ నా బంధువులు కాదు. నా మిత్రులు కాదు. ఒక్కసారి కూడా ఫేస్ టూ ఫేస్ కలవలేదు. విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తాం. అందులో భాగంగానే వీసీల నియామకం చేప్టటాం. ఐఐఐటీలకు గవర్నర్ ఛాన్స్ లర్ గా ఉంటారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చాన్స్ లర్ గా చేసే ప్రయత్నం చేశారు. దానిని రద్దు చేశాం. తిరిగి గవర్నర్ కే ఆ బాధ్యత అప్పగించాం.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టింది
గత ప్రభుత్వం ట్యూషన్ ఫీజు రూ.2,832 కోట్లు బకాయిలు పెట్టారు. హాస్టల్ ఫీజు రూ.989 కోట్లు బకాయిలు పెట్టారు. పీజీ ఫీజురీయింబర్స్ మెంట్ రూ.450 కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తం రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వ బకాయిల విషయంలో.. మన ప్రభుత్వం తప్పనిసరిగా దశలవారీగా ఫీజులు చెల్లించే బాధ్యత తీసుకుంటుంది. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ తిరిగి ప్రారంభిస్తాం. ఎయిడెడ్ వ్యవస్థపై ఆనాడు కలిసికట్టుగా పోరాడాం. ఆనాడు పోలీసులను పంపి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించారు. జగన్ రెడ్డి నిర్వాకంతో ఎయిడెడె లో సుమారు 1,100 మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రత్యామ్నాయం తీసుకువస్తాం.
వైసీపీ హయాంలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పడిపోయింది
ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాలంటే జాయింట్ కొలాబరేషన్ డిగ్రీ ఉంటేనే ఇవ్వొచ్చు. అది కూడా టాప్-100 యూనివర్సిటీ ఉంటేనే ఇవ్వొచ్చని నిబంధన పెట్టారు. దీనివల్ల అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి రావాలంటే ఇబ్బంది పడుతున్నాయి. ఇదంతా గత ప్రభుత్వ నిర్వాకం. కేంద్ర ప్రభుత్వం సమర్థ్, స్వయం ప్లస్ తీసుకువచ్చింది. దీనిని అమలుచేయలేదు. వీటిన్నింటి వల్ల మన గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పడిపోయింది. తమిళనాడులో 47, ఢిల్లీలో 46 శాతం ఉంటే.. ఏపీలో 36శాతానికి పడిపోయింది. రీసెర్చ్, ఇన్నోవేషన్ లో పేటెంట్ ఫైలింగ్స్ తమిళనాడులో 7,600 చేస్తే మనం కేవలం 1400 చేస్తున్నాం. పీహెచ్ డీ చదువుతున్న వారిలో తమిళనాడులో 26వేల మంది ఉంటే.. ఏపీలో కేవలం 5,600 మంది మాత్రమే ఉన్నారు.
ఐటీఐ, పాలిటెక్నిక్ లకు భవనాలు
పాలిటెక్నిక్ ల విషయానికి వస్తే.. ప్రవేశాలు గతంలో 81 శాతం ఉంటే వైసీపీ హయాంలో 69శాతానికి పడిపోయాయి. పాలిటెక్నిక్ లో నాణ్యత లేకుండా పోయింది. 21 ఐటీఐలకు, 12 పాలిటెక్నిక్ లకు ప్రభుత్వ భవనాలు లేవు. కొన్నింటికి భూములు లేవు, కొన్నింటికి సిబ్బంది కొరత ఉంది. ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ లకు సొంత భూమి, భవనాలు నిర్మించి సిబ్బందిని సమకూరుస్తాం.
లెర్నిగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్(లీప్) మోడల్ తీసుకువస్తాం
లెర్నిగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మోడల్(లీప్) తీసుకువస్తున్నాం. విజన్ తో పనిచేస్తున్నాం. వాల్యూ బేస్డ్, ఫ్యూచర్ రెడీ గ్లోబల్లీ రిలవెంట్ లెర్నింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దశలవారీగా సంస్కరణలు తీసుకువస్తాం. మొదట క్లస్టర్ రీస్ట్రక్చరింగ్ పూర్తిచేశాం. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసుకున్నాం. మీరు కూడా భాగస్వామ్యం కావాలి. చర్చించి మెరుగైన ప్రత్యామ్నాయం తీసుకువద్దాం.
కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ బలోపేతం
ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయకూడదనేది మా లక్ష్యం. ప్రతి గ్రామానికి మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుచేస్తాం. అంటే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తాం. దీనికి లీప్ పాఠశాలలు అని పేరు పెడతాం. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలను బలోపేతం చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ బలోపేతం చేస్తాం. ప్రతి చాప్టర్ కు క్యూఆర్ కోడ్ పెట్టాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించాం. ఉపాధ్యాయులకు శిక్షణ అనేది పెద్ద సబ్జెక్ట్. స్కూల్ ప్రారంభానికి ముందే ట్రైనింగ్ ఉండాలనేది మా విధానం. ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతాం. ఉపాధ్యాయుల కోసం అమరావతిలో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
పారదర్శకంగా సీనియారిటీ లిస్ట్
టీచర్ల సీనియారిటీ విషయంలో ఏపీ చరిత్రలో మొదటిసారి సినియారిటీ లిస్ట్ ను పారదర్శకంగా రూపొందిస్తున్నాం. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలి. టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ ను ఈ సమావేశాల్లోనే తీసుకువస్తాం. నేను ఐదున్నర గంటల పాటు సంఘాలతో కూర్చొని చర్చించాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఎలాంటి అనుమానం అవసరం లేదు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక వచ్చింది. ప్రభుత్వ పరిశీలనలో ఉంది. చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ కు పంపి, నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల నియామకం చేపడతాం. ఇప్పటికే టెట్ నిర్వహించాం. సింగిల్ యాప్ తీసుకువస్తాం.
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు కృషి
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీడ్ గా ఇస్తాం. మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పుడు చెక్ చేద్దాం. పిల్లల రిపోర్ట్ కార్డ్ కూడా పారదర్శకంగా చేస్తాం. యాక్టివ్ లెర్నింగ్ విధానంతో ముందుకు వెళ్తాం. లీప్ యాప్ ద్వారా అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుస్తాం. ప్రభుత్వ విద్యపై సీరియస్ గా ఉన్నాం. మొదటిసారిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశాం. విద్యార్థుల భవిష్యత్ విషయంలో తల్లిదండ్రులను కుడా భాగస్వామ్యం చేశాం. పాఠశాలల్లో ఒకేషనల్, స్కిల్స్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అపార్ ఐడీ అనివార్యం. ఇది మంచి నిర్ణయం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించాం. మార్పు విద్య తీసుకువస్తుంది.
రాజ్యాంగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తాం
అమర్ చిత్ర కథ వాళ్లతో ఒప్పందం చేసుకుని బాలభారత రాజ్యాంగం పేరుతో పుస్తకాన్ని విద్యార్థులకు అందజేస్తాం. రాజ్యాంగం గురించి అవగాహన కల్పిస్తాం. స్వాతంత్య్ర సమరయోధుల గురించి వివరిస్తాం. నేను 3,132 కి.మీల మేర పాదయాత్ర చేశానంటే రాజ్యంగం ఇచ్చిన హక్కు. నన్ను ఎంతో ఇబ్బంది పెడితే రాజ్యాంగం చూపించాను. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్ చాలా అవసరం. 280 మంది కౌన్సిలర్లను నియమించాం. ముందుగానే లక్షణాలను గుర్తిస్తాం. క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం.
గంజాయి, డ్రగ్స్ కు ఫుల్ స్టాప్ పెడతాం
గంజాయి, డ్రగ్స్ ను నియంత్రణకు యుద్ధం ప్రకటించాం. గంజాయి, డ్రగ్స్ కు ఫుల్ స్టాప్ పెడతాం. డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ప్రతిస్కూల్ లో ఈగల్ కమిటీలు ఏర్పాటుచేస్తాం. సైన్స్ ఫెయిర్స్, కల్చరల్ ఫెస్ట్, యాన్యువల్ డేస్ నిర్వహిస్తాం. ఈ సభలోనే స్టూడెంట్ పార్లమెంట్, స్టూడెంట్ కౌన్సిల్ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. మొక్కలు నాటేలా గ్రీన్ క్లబ్స్ ఏర్పాటుచేస్తాం, గ్రీన్ పాస్ పోర్ట్స్ ఇస్తాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత సెంటర్లు కూడా చాలా ముఖ్యం. 125 కొత్త భవిత సెంటర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదించాం. ఇందుకోసం కమిటీ ఏర్పాటుచేస్తున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉంటే పేర్లు ఇవ్వాలి.
మోడల్ ప్రైమరీ స్కూల్స్, హైస్కూల్స్ కు కంప్యూటర్ ల్యాబ్స్ ఇస్తాం. పిల్లల ఫెర్ఫార్మెన్స్ కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటుచేస్తాం. మౌలిక వసతుల కోసం స్టార్ రేటింగ్ ఏర్పాటుచేశాం. లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనా రేటింగ్స్ ఇస్తాం. పెండింగ్ పనులు పూర్తిచేస్తాం. మెగా పీటీఎం నిర్వహించాం. ప్రతి శుక్రవారం కమిషనర్ గారు సంఘాలతో సమావేశం అవుతున్నారు.
విద్యావ్యవస్థలో సంస్కరణలకు బాధ్యత తీసుకోవాలి
అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటేనే విద్యావ్యవస్థలో ఆశించిన సంస్కరణలు తీసుకురాగలగుతాం. పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్పు అవ్వొచ్చు. సరిదిద్దుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు అసెంబ్లీకి రావాలంటే పరదాలు లేవు. పోలీసుల సంఖ్య తగ్గింది. డిప్యూటీ డీఈవో నియామకాలు త్వరలో పూర్తిచేస్తాం. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. భోజన నాణ్యత పెంచాలని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. లోకల్ మెనూ ఏర్పాటుచేశాం.
15 ఏళ్ల తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు
15 ఏళ్ల తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. అందరూ ఒప్పుకున్న నిర్ణయాలనే ముందుకు తీసుకెళ్తున్నాం. కరిక్యులమ్ టెక్ట్స్ బుక్స్ రివిజన్ చేశాం. అనవసరమైన సబ్జెక్టుల భారాన్ని తగ్గించాం. ఎంబైపీసీ తీసుకువచ్చాం. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. అదేవిధంగా జూనియర్ కాలేజీలను కూడా బలోపేతం చేయాలి. టైమింగ్స్ పెంచాల్సిన అవసరం ఉంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తిరిగి ప్రారంభిస్తాం. మెటిరీయిల్ అందజేస్తున్నాం. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నాం. స్కూల్ కిట్స్ అందజేశాం.
విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు అవసరం
విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు అవసరం. ఎవరిపాత్ర ఏంటో తెలియాలి. దీనిపై సీరియస్ గా వర్క్ చేస్తున్నాం. ఖాళీగా ఉన్న 3,282 పోస్టులు భర్తీ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకువస్తాం. డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. లా, స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో సమస్యలు పరిష్కరిస్తాం. పబ్లిక్ లైబ్రరీల విషయానికి వస్తే.. సెస్ డైరెక్ట్ గా లైబ్రరీలకు వచ్చేవిధంగా చేస్తాం. మెరుగైన లైబ్రరీలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.
పాదయాత్ర తర్వాత లైబ్రరీల ప్రాముఖ్యతను తెలుసుకున్నా. మండల, నియోజకవర్గ, జిల్లా, రీజనల్, సెంట్రల్ లైబ్రరీలను బలోపేతం చేస్తాం. అవకతవకలను అరికడతాం. మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. ఏడాదిలో పబ్లిక్ లైబ్రరీస్ లో మార్పు తీసుకువస్తాం. ప్రపంచస్థాయి సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటుచేస్తాం. అక్కడే అర్కైవ్స్ ఏర్పాటుచేస్తాం. అమీర్ పేటలో నాలుగు నెలల శిక్షణ తీసుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి. కరిక్యులమ్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
విద్యార్థులను ఇబ్బందిపెట్టేవారిపై కఠిన చర్యలు
కొత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంలో ఏప్రిల్ 24 తర్వాత నేరుగా కాలేజీ అకౌంట్ లోకి నిధులు జమచేస్తాం. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాం. ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కావాలని కొంతమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సంఘలతో ఇప్పటికే మేం మాట్లాడాం, చర్చించాం. వారు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వం ఒప్పుకుంది. డబ్బులు విడుదల చేస్తాం. దయచేసి పిల్లలను ఇబ్బంది పెట్టవద్దు.
ఇండస్ట్రీ కనెక్టివిటీ కరిక్యులమ్ తీసుకువస్తాం
ఒకేరాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి. ఇండస్ట్రీ కనెక్టివిటీ కరిక్యులమ్ తీసుకువస్తాం. ఈ రోజు రెండు భాషలా, మూడు భాషలా అనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి గారు ఐదు కాదు.. పది భాషలు నేర్చుకుంటే తప్పేంటి అని స్పష్టంగా చెప్పారు. మన నర్సులు జర్మనీ, జపాన్ వెళ్లబోతున్నారు. వారికి జర్మన్, జపనీస్ నేర్పించి పంపిస్తున్నాం. యూరప్ లో ట్రక్ డ్రైవర్స్ నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు.
ఓంక్యాప్ ద్వారా మంచి శిక్షణ అందిస్తాం. మంగళగిరిలో స్కిల్ సైన్సెస్ పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాం. చాలా నేర్చుకున్నాం. స్కిల్ అసెస్ మెంట్ ఏవిధంగా చేయాలనే దానిపై ఇరుక్కుపోయాం. ఐటీ స్కిల్స్ అసెస్ చేయడం చాలా తేలికైంది. కార్పెంటరీ స్కిల్స్, రిపేర్స్ అంటే స్కూటర్ మెకానిక్, కార్ మెకానిక్ స్కిల్స్ ఎలా అసెస్ చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నాం. ఒకమార్గం దొరికింది. ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో అమలుచేస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి పరిచయం చేద్దాం
ఇదొక మిషన్ మోడ్ లో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మనందరం భాగస్వామ్యం కావాలి. ఒకటికి పదిసార్లు చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి పరిచయం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరినప్పుడే ప్రభుత్వ విద్య మెరుగైందని నమ్ముతారు. ఆ విధమైన ప్రమాణాలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ అందరి సహకారం అవసరం. ఇక్కడున్న సభ్యులు ఒక్కో మండలంలో ఒక పాఠశాలను దత్తత తీసుకుని, మెరుగైన విద్య అందించేందుకు కృషిచేయాలని కోరుతున్నా.
ఈ యజ్ఞం వల్ల బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు మెరుగైన విద్యను మనం అందించగలుగుతాం. సంపన్నులకు, నిరుపేద కుటుంబాలకు ఒకేరకమైన విద్య అందించేందుకే ఈ లీప్ మోడల్ ను తీసుకువస్తున్నాం. ఇందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్ లో 9.8శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. విద్యారంగంలో పదేళ్లలో జరగని సంస్కరణలు కూటమి ప్రభుత్వ 9 నెలల కాలంలోనే చేపట్టాం.
శాసన సభ్యులు, ఉపాధ్యాయులు, సంఘాలు, సంఘ నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసికట్టుగా మాట్లాడుకున్నాం కనుకనే ఇంతవరకైనా వచ్చింది. దీనివల్లే ఏపీ మోడల్ రాబోతోందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ నాటికి అన్ని సంస్కరణలు పూర్తవుతాయని, వచ్చే నాలుగేళ్లు విద్యపైనే దృష్టిపెడతామని మంత్రి చెప్పారు.