రాజ్యసభ జీరో అవర్‌లో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: తక్షణ రుణం పేరుతో ఇన్‌స్టాంట్ లోన్ యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్ళకు అణచివేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం ఆయన ఈ అంశంపై మాట్లాడారు. అర్థిక అవసరాలతో ఇబ్బందులు పడే అమాయకులకు తక్షణమే రుణం ఇస్తామంటూ లోన్ యాప్‌లు ఆకర్షిస్తాయి. లోన్ కోసం ఈ యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసిన వారి ఫోన్ నుంచి సున్నితమైన మెసేజ్‌లు, కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలను సేకరించి వారికి రుణం మంజూరు చేస్తారు. రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా అధిక మొత్తంలో వడ్డీ, ఇతర చార్జీలు బకాయిపడినట్లుగా చూపిస్తారు. బకాయిలు చెల్లించడానికి నిరాకరించే రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్ చేస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడటం ఈ లోన్ యాప్‌లు అవలంభించే విధానమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ లోన్ యాప్‌లు అత్యధికంగా చైనా నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేకుండానే ఈ లోన్ యాప్‌లు యధేచ్చగా తమ అక్రమ ఫైనాన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇలాంటి లోన్ యాప్‌ల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, నిర్బంధ వసూళ్ళ కారణంగా రుణగ్రహీతలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూడటంతో ప్రభుత్వం వెంటనే లోన్ యాప్ ఏజెంట్లను అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఇలాంటి సైబర్ నేరాల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని రూపొందించింది. అలాగే ఇన్‌స్టాంట్ లోన్ యాప్‌లను అణచివేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సెంట్రల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్)తో కలిసి పని చేస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఈ లోన్ యాప్‌ల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజల జీవితాలతో అవి చెలగాటం ఆడుతున్నాయి. వేధింపులు, బెదిరింపులతో రుణగ్రహీతలను తీవ్రమైన మనో వ్యధకు గురి చేస్తూ అనేక సందర్భాలలో వారు ఆత్మహత్యలకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో వాటిని నిషేధించాలి. అలాంటి యాప్‌లు డెవలప్ చేసే వారిని వాటిని ప్రమోట్ చేసే వారిని కఠినంగా శిక్షించాలి. ఫోన్ డేటా ప్రైవసీకి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.