• అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదు
– మాజీ మంత్రి పీతల సుజాత
మంగళగిరి: అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి.. దళితుల అభివృద్ధిని మంటగలిపి… దళితులపై దమనకాండ సాగించిన వైసీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే హక్కు.. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత లేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లడారు. సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రజా పాలన ఉండాలన్న అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా వైసీపీ పాలన సాగింది. దళితులుపై అనేక నేరాలు ఘోరాలు చేయించిన ఘన చరిత్ర జగన్ రెడ్డిది. వైసీపీ నాయకులకు అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత కూడా లేదు.
చంద్రబాబు నాయుడు దళితుల విద్యోన్నతి కోసం అంబేద్కర్ విదేశీ విద్యావిదానంను తీసుకొచ్చారు. వైసీపీ వచ్చాక విదేశీ విద్యాపథకాన్ని నిలిపేయడమే కాక.. అంబేద్కర్ విదేశీ విద్యాపథకానికి పేరు మార్చి జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మార్చుకొని అంబేద్కర్ ను జగన్ రెడ్డి ఘోరంగా అవమానించినా.. నాడు వైసీపీలో ఉన్న దళిత నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
దళితుల అభివృద్ధిని అట్టడుగుకు తీసుకెళ్తే వైసీపీలో ఉండే దళిత నేతలు ఒక్కరు ప్రశ్నించలేదు. టీడీపీ పాలనలో దళిత వాడల్లో అభివృద్ధి జరిగితే… వైసీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం కోసం చంద్రబాబు రూ. 100 కోట్లతో 30 ఎకరాల్లో మంచి ప్రాజెక్ట్ ను చేపడితే.. కుట్రపూరితంగా జగన్ రెడ్డి దాన్ని అడ్డుకొని విజయవాడకు తరలించి దోచుకున్నారు. శిలాఫలకంపై ఉండాల్సిన జగన్ రెడ్డి పేరును అంబేద్కర్ పేరుకంటే పెద్దగాపెట్టారు. జగన్ పేరును తాటికాయంత అక్షరాలతో రాసి అంబేద్కర్ పేరు చిన్న అక్షరాలతో రాయడం అంబేద్కర్ ను అవమానించడం కాదా? అనాడే అంబేద్కర్ వాదులు జగన్ రెడ్డి చర్యలకు చాలా బాధపడ్డారు. ఆ బాధను అనుచుకోలేక అంబేద్కర్ వాదులే జగన్ పేరును తొలగించారు.
అంబేద్కర్ పేరును అందరికి కనిపించేలా పెట్టాలి కాని జగన్ పేరు పెట్టుకుంటారా? దీన్ని టీడీపీ మీదకు మళ్లీ కుట్రపూరితంగా నెడుతున్నారు సిగ్గులేకుండా.. ఇదే జగన్ రెడ్డి పైశాచికత్వానికి నిదర్శనం. జగన్ రెడ్డి మానసిక పరిస్థితి దిగజారిపోయింది. దళితులకు మేలు చేసింది టీడీపీ పార్టీనే. అంబేద్కర్ దళితులకు రాజ్యంగ ఫలాలు ఇస్తే.. దాన్ని అమలు చేస్తూ నందమూరి తారకరామరావు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తూ.. దళిత బిడ్డల విద్యాభివృద్ధికి కృషి చేశారు. అంబేద్కర్ ఆలోచనలను చంద్రబాబు కొనసాగిస్తూ.. దళితవాడలను అభివృద్ధి చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి ఇన్నోవా కార్లు ఇచ్చి దళితులను కార్లకు చంద్రబాబు ఓనర్లను చేశారు. దళిత బాంధవుడు చంద్రబాబు… దళిత ద్రోహి జగన్ రెడ్డి. దళితుల అభివృద్ధికోసం ఇచ్చిన హామీలు అన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.