-27 పథకాలు నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డి కే సొంతం
-ప్రశ్నించకుండా చోద్యం చూస్తూ దళిత, గిరిజనులకు ద్రోహం చేస్తున్న దళిత ప్రజాప్రతినిధులు
-సబ్ ప్లాన్ నిధులు స్వంత పథకాలకు మళ్లింపు
-నవరత్నాల ముసుగులో దళిత, గిరిజనుల కు నవ వినాశనాలు
-ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ధ్వజం
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులను, గిరిజనులను చిన్నచూపు చూస్తోందని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ద్వజమెత్తారు. సోమవారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో వైసిపి ప్రభుత్వం దళిత, గిరిజనలకు చేస్తోన్న ద్రోహంపై తప్పుపట్టారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటుచేసిన సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం తమ పార్టీ ప్రవేశపెట్టిన స్వంత పథకాలైన నవరత్నాల కు వాడుకుంటుందని విమర్శించారు. అవి నవరత్నాలు కావని దళిత, గిరిజనుల పట్ల నవవినాశకాలని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వాలు దళిత, గిరిజన ల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని. నాటి ఇందిరాగాంధీ గరీబి హాటావో నే ఈ దేశంలో దళిత, గిరిజన అభ్యున్నతి కి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఈనాడు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి 27 పథకాలను రద్దుచేయటం చూస్తుంటే దళిత, గిరిజనుల అభ్యున్నతి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంతమంది దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు వున్నా ఒక్కరు కూడా దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత, గిరిజనులకు అధికారం అందని ద్రాక్ష గానే మిగిలిపోతొందని, వైసిపి ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు అనేక పదవులు ఇచ్చాం అని వూకడంపుడు మాటలు చెప్పుకునే ఈ ప్రభుత్వం, కనీసం వాళ్ళు కూర్చోవటానికి కుర్చీ, బల్ల కూడా లేదని అన్నారు. కొద్దిపాటి గౌరవం కూడా దక్కట్లేదని విచారం వ్యక్తంచేశారు.
దేశంలోను, రాష్ట్రంలోను దళితుల పరిస్థితి మరీ దారుణంగా వున్నదని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తూ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే దేశంలో దళితుల పరిస్థితి స్వాతంత్ర్య పూర్వ రోజులను గుర్తుచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటి ప్రతిపక్షనేత గా వున్న నేటి ముఖ్యమంత్రి దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, గద్దెనెక్కిన తరవాత విచిత్రమైన సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టించిన ప్రభుత్వంగా పేరుతెచ్చుకున్నదని గిడుగు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దళితులపై సవతిప్రేమ మాని వారికి రావాల్సిన సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించకుండా దళిత, గిరిజన అభ్యున్నతికి కృషి చేయాలని, రద్దు చేసిన 27 పథకాలను తక్షణమే ప్రవేశపెట్టాలని, లేనిచో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.