–తమ్మినేని సీతారాం గారు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదవకుండానే సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?
– తమ్మినేని సీతారాం తనదిగా చెబుతున్న హాల్ టికెట్ నెం. 1791548430 డి. భగవంత్ రెడ్డి తండ్రి బి. స్వామి రెడ్డి పేరు
– మా రికార్డులో లేవని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారికంగా ధృవీకరించింది
– దీనిని బట్టి తమ్మినేని సీతారాం వి నకిలీ సర్టిఫికెట్
– బీకాం డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ అన్ని కూడా నకిలీ
తమ్మినేని సీతారాం కి నకిలీ సర్టిఫికెట్ ఎలా వచ్చాయి?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నన్నూరి నర్సిరెడ్డి
– రెండోసారి ప్రశ్నాస్త్రం సంధించిన నర్శిరెడ్డి
– నర్శిరెడ్డి ఆరోపణలు ఖండించని తమ్మినేని
– తమ్మినేనికి నకిలీ లా డిగ్రీ సర్టిఫికెట్ తంటా
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన నీతి నిజాయితీకి నిలువుటద్దం. స్పీకర్‌గా కంటే వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. స్పీకర్‌గా .. వైసీపీ సమావేశాలకు హాజరవడం ఆయనకు మహా ఇష్టం. అదేమంటే.. ముందు నేను వైసీపీ ఎమ్మెల్యేను. తర్వాతనే స్పీకర్‌ను అని సగర్వంగా చెప్పడానికి సంకోచించరు.
అవినీతి, అక్రమాలు, అడ్డదార్లను అస్సలు సహించరు. ప్రజాస్వామ్య విలువలపై అపార నమ్మకం ఆయనకు. అయితే విచిత్రంగా… రాజకీయాల్లో నైతిక విలువల పతనంపై, తరచూ ఆవేదన చెందే వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పుడు అదే నైతిక సంకటంలో ఇరుక్కున్నారు. డిగ్రీ చదవని ఆయనకు, మూడేళ్ల లా డిగ్రీ అడ్మిషన్ ఎలా వచ్చిందంటూ.. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలతో తమ్మినేని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
* * *
ఆయన చూడ్డానికి భూమికి ఐదడుగులే ఉంటారు. కానీ నోరు తెరిచి మాట్లాడితే భూమి బద్దలయ్యేలా ఉంటుంది ఆయన ప్రసంగం. ప్రత్యర్ధులను ప్రాసలతో పీకి పాకాన పెడతారు. ఆయన మాట్లాడితే చప్పట్లు కొట్టనివారుండరు. చంద్రబాబుతో సహా ఎవరైనా ఆయన మాట్లాడుతుంటే రెప్ప వేయడం మర్చిపోతారంతే. కేసీఆర్ నుంచి జగన్ వరకూ అంతా ఆయన మాటల బాధితులే.
ఇప్పుడు ఆయన దృష్టి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదివిన లా డిగ్రీపై పడింది. అంతే.. తమ్మినేని ఎక్కడ చదివారు? ఎప్పుడు చదివారు? ఆ సర్టిఫికెట్ ఆయనకు ఎలా వచ్చింది? ఏ మార్గం ద్వారా వచ్చింది? ఆ హాల్‌టికెట్ ఎవరి పేరుతో వచ్చింది? అసలు ఆ సర్టిఫికె ట్ తమ్మినేనికి ఎలా ఇచ్చారన్న శూలశోధన దిశగా అడుగులేశారు. దాంతో కావలసినంత సమాచారం తెచ్చుకున్నారు. తన దగ్గర సర్కారు ఇచ్చిన సమాధానాలను అస్త్రంగా సంధించి తమ్మినేనిపై ప్రయోగించారు. అది ఒకసారి కాదు. రెండోసారి!
కానీ తమ్మినేని నుంచి సమాధానం కరవు. ఆయన పేరు నన్నూరి నర్శిరెడ్డి. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత. ఒకప్పటి ఉస్మానియా టీడీపీ విద్యార్థి నేత.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడకుండా.. టీడీపీ కోసం నిటారుగా నిలబడ్డ నాటి తెలుగు విద్యార్ధి రాష్ట్ర అధ్యక్షుడు.
* * *
విద్యార్ధి నేతగా ఉంటూ టీడీపీలో చేరిన నర్శిరెడ్డి.. ఇప్పుడు సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ప్రయోగించి, విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ఆర్టీఐ దరఖాస్తు… తమ్మినేని రాజకీయ భవిష్యత్తుకు సవాలుగా పరిణమించింది. దీనికి సంబంధించి గతంలో నర్శిరెడ్డి సంధించిన ప్రశ్నలలకు తమ్మినేని నుంచి జవాబు రాలేదు.
టీడీపీ దాడిపై ఎదురుదాడి చేసే వైసీపీ ఈ అంశంలో మాత్రం కుక్కినపేలులా మౌనం వహించడం ఆశ్చర్యం. తాజాగా తాను ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను నర్శిరెడ్డి వెల్లడించినప్పటికీ, తమ్మినేని నుంచి జవాబు రాకపోవడం వైసీపీని రాజకీయంగా ఇరుకున పడేసింది. అది నిజమైతే తన దగ్గరున్న పత్రాలను మీడియా ముందు ప్రదర్శించడం గానీ, అబద్ధమైతే ఖండించడం గానీ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిజానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనే నర్శిరెడ్డి ఈ ఆరోపణలు సంధించినా, తమ్మినేని ఖండించకపోవడం బట్టి… మౌనం అంగీకారం అన్న సంకేతాలకు తావిస్తోంది.
డిగ్రీ డిస్ కంటిన్యూడ్… తమ్మినేని సీతారాం గారు.. మూడేళ్ల ఎల్ఎల్బి కార్స్లో ఎలా అడ్మిషన్ పొందారని సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటే , అనేక విషయాలు నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. మహాత్మాగాంధీ లా కాలేజీలో తన మూడేళ్ల ఎలిల్బి కోర్స్ ఆడ్మిషన్‌కు సంబంధించి తమ్మినేని సీతారాం గారు సమర్పించిన సర్టిఫికేట్ల కాపీలను సమాచార హక్కు చట్టం క్రింద తాము డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీ సేకరించాం.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం తమ్మినేని సీతారాం , డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని, నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుండి 2015-18 మద్య (హాల్ టికెట్ నెం. 1791548430) బికాం పూర్తి చేసినట్లు సర్టిఫికేట్లు సమర్పించారు.
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారిని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్లో 2015 సంవత్సరంలో చదివిన మొత్తం విద్యార్థుల వివరాలు (పేర్లు, హల్‌టికెట్ నెంబర్, కోర్స్) సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది.
నాగర్ కర్నూల్ స్టడీ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) సెంటర్ లో చదవిన మొత్తం 839 మంది విద్యార్థుల పేర్ల లిస్టులో తమ్మినేని సీతారాం పేరు లేదు. తమ్మినేని సీతారాం తనదిగా చెబుతున్న హాల్ టికెట్ నెం. 1791548430 మాత్రం డి. భగవంత్ రెడ్డి తండ్రి బి. స్వామి రెడ్డి పేరు మీద ఉన్నది. దీనిని బట్టి తమ్మినేని సీతారాం వి నకిలీ సర్టిఫికెట్ అని స్పష్టంగా అర్థం అవుతున్నది.
28.07.2021 రోజున మూడేళ్ల ఎల్ఎల్డీ కోర్సు కోసం తమ్మినేని సీతారాం సమర్పించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్ పత్రులు నిజమైనావా? కావా తేల్చమని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి ఇచ్చి రికార్డులు పరిశీలించి తెలపమని సమాచార హక్కు చట్టం ద్వారా సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి సమాచారం అడగడం జరిగింది.
తమ్మినేని సీతారాం సర్టిఫికేట్స్ రికార్డులలో పరిశీలించి, తమ రికార్డులో మ్యాచ్ కావడం లేదని మా రికార్డులో లేవని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారికంగా ధృవీకరించింది. తమ్మినేని సీతారాం బికాం డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ అన్ని కూడా నకిలీ వని స్పష్టంగా అర్థం అవుతోంది.
తమ్మినేని సీతారాం కి నకిలీ సర్టిఫికేట్స్ ఎలా వచ్చాయి? నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.