– విద్యుత్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు
– విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న విద్యుత్ సరఫరాపై దురుద్దేశ్యపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలపై పరువు నష్టం (డిఫమేషన్) కేసు వేస్తున్నట్లు విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ శాఖ కార్యదర్శిగా పలుమార్లు పత్రికా విలేకర్ల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియజేస్తున్నప్పటికీ ప్రజల్లో అపోహలు రేకెత్తేవిధంగా, విద్యుత్ వినియోగదారులలో గందరగోళం సృష్టించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేవిధంగా వార్తలు ప్రచురిస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు ప్రచురించే వారిపై ఇకపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగులాపల్లి శ్రీకాంత్ ఆ ప్రకటనలో తెలిపారు.