Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజల కొంప ముంచిన ‘‘చేపల పులుసు’’

575 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే సంతకం చేసిన కేసీఆర్
నాటి ఎపీ సీఎం బాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి ముమ్మాటికీ కారకుడు కేసీఆరే
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోనే కేసీఆర్ ను నిలదీసిన మాట నిజం కాదా?
మోదీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణకు న్యాయం జరగబోతోంది
వడ్ల కొనుగోలు టెండర్ల పేరుతో మరో రూ.500 కోట్లు దండుకునేందుకు సీఎంఓ స్కెచ్
రీ టెండర్ల పేరుతో మరో రూ. 2 వేల కోట్లు నష్టపోనున్న సివిల్ సప్లయిస్ కార్పొరేషన్
మోటార్లకు మీటర్లు, సింగరేణి ప్రైవేటీకరణ ఒట్టి బూటకం
కేసీఆర్ మోసాలకు బుద్ది చెప్పే టైమొచ్చింది
బీఆర్ఎస్ ను ఓడించండి… కేసీఆర్ కు ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు పోయి తిన్న చేపల పులుసే తెలంగాణ ప్రజల కొంప ముంచింది. చేపల పులుసు, పైసల కోసం ఏపీకి అమ్ముడుపోయిండు. క్రిష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, 299 టీఎంసీలకే అంగీకరించి సంతకం పెట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిండు. ఎన్నికల టైమొచ్చింది. పోలింగ్ రోజున చేపల పులుసును గుర్తుకు తెచ్చుకోండి. పళ్లు(దంతాలు) పటపట కొరకండి. ఓటుతో కేసీఆర్ కు బుద్ది చెప్పండి. ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ రూ. 500 కోట్లను దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందన్నారు. కేసీఆర్ నిర్వాకంవల్ల ఇప్పటికే రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘రైతు సదస్సు’’కు హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

కృష్ణా జలాల వాటా, వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటును స్వాగతిస్తూ రైతు సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం అలుపెరగని క్రుషి చేశాం. క్రిష్ణా నీటి వాటాలో తెలంగాణకు కొంప ముంచింది చేపల పులుసే. రాయలసీమలో కేసీఆర్ కు పెట్టిన చేపల పులుసే. కేసీఆర్ దంతా తాను చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అని ప్రచారం చేసుకుంటారు.

తెలంగాణకు నీటి కేటాయింపులో తీరని ద్రోహం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్. విభజన సమయంలోనే తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా… ఏపీ సీఎంతో లాలూచీ పడి డబ్బులకు కక్కుర్తిపడి 299 టీఎంసీల నీటికే అంగీకరిస్తూ సంతకం పెట్టిన మూర్ఖుడు కేసీఆర్. దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తే నోరుమెదపని మూర్ఖుడు కేసీఆర్. పైగా నీటి కేటాయింపులో కేంద్రం మోసం చేస్తోందంటూ లేఖ పేరుతో ప్రజలను, మీడియాను తప్పుదారి పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్.

నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ లో నాటి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీలకే అంగీకరించిన విషయాన్ని బయటపెట్టడంతో నోరు మూసుకున్న వ్యక్తి కేసీఆర్. అదే సమయంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటేనే ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యమవుతుందని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేయడంతోపాటు విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించిన కేసీఆర్ మళ్లీ రెండేళ్ళపాటు నాన్చిన తరువాత గతేడాది పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

కృష్ణా జలాల వివాదాలు, కేటాయింపులపై ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తే కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కూడా తెలపని మూర్ఖుడు కేసీఆర్. ట్రిబ్యునల్ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. థ్యాంక్స్ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలుతాయా?

మొన్నటికి మొన్న పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ మాత్రమే ఆన్ చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నడు.
ప్రపంచంలోనే ఇంతకంటే మోసగాడు ఎవరూ లేరు.

కేసీఆర్ చేసిన నిర్వాకంవల్ల ఏపీకి క్రిష్ణా నీళ్లను తాకట్టు పెట్టడంవల్ల ఇయాళ నాగార్జున సాగర్ నీళ్లు అడుగంటి పోయినయ్. ఇంకా ఎండాకాలమే రాకపాయే.. ఇప్పుడే నీళ్లు అడగంటి పోతే తరువాత పరిస్థితి ఏంది.

కేసీఆర్ దరిద్రపు పాలనలో తెలంగాణలో ఒక్క ఎకరాకు అదనపు నీరు రాకపాయే. పంటలు పండకపాయే. ఇంకా సిగ్గు లేకుండా కేంద్రాన్ని బదనాం చేస్తున్నడు. వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ…. టెండర్ పేరుతో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ను మళ్లీ దివాళా తీయించి దోచుకునేందుకు సీఎంఓ కుట్ర చేస్తోంది. వీళ్లంతా కలిసి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ను నిండా ముంచబోతున్నరు. ఇప్పటికే కేసీఆర్ దుర్మార్గాలు, అవినీతివల్ల కార్పొరేషన్ 40 వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది.

ఈ రీ టెండర్ ప్రక్రియవల్ల మరో 2 వేల కోట్ల రూపాయల భారం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ పై పడబోతోంది. ఇట్లాంటి గలీజు దందా కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించుకున్నరు. కేసీఆర్ లాంటి గలీజు దందా గాడు ఇంకోరు లేరు. అసలు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఇంకా ఎట్లా కొనసాగిస్తారు?

ఈయనే కాదు…రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన అధర్ సిన్హా పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా, రాణికుముదిని లేబర్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా ఎట్లా కొనసాగిస్తారు? అసలే… రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లతోపాటు రిటైర్డ్ అధికారులను ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లుగా నియమించి జీతభత్యాలు, రవాణా, మెయింటెనెన్స్ ఖర్చుల పేరుతో ఏటా వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? తక్షణమే వాళ్లను తొలగించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

మరోవైపు కేసీఆర్ బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని దుష్ర్పచారం చేస్తున్నడు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఇట్లనే చెప్పిండు.. కానీ మీటర్లు పెట్టారా? కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. ‘‘కేసీఆర్… నువ్వు గనక కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ నుండి గుంజుకొస్తాం’’అని హెచ్చరిస్తే నోరు మూసుకున్నడు.

మళ్లీ సింగరేణి విషయంలోనూ కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరించాలని కుట్ర చేసిండు… 51 శాతం వాటా ఉన్న రాష్ట్రం అంగీకారం లేకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్రం సింగరేణిని ఎట్లా ప్రైవేటీకరణ సాధ్యం? ఆ ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రే ప్రకటించినా విష ప్రచారం మాత్రం బీఆర్ఎస్ నేతలు ఆపడం లేదు.

వడ్ల కొనుగోలులో ప్రతి పైసా ఇచ్చేది కేంద్రమే. సుతిలితాడు, గోనె సంచా, రవాణ ఖర్చులతోపాటు చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి బ్రోకరేజీ కింద కమీషన్ పైసలు కూడా ఇచ్చేది కేంద్రమే.

అందుకే తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలి. ఎన్నికలొచ్చినయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా, ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు లేకపోయినా కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం. పంచాయతీలకు మొదలు.. మున్సిపాలిటీ ల వరకు మీకు పోలింగ్ రోజు చేపల పులుసు గుర్తుకు రావాలే. పండ్లు పటపట కొరకండి. బీజేపీకి ఓట్లు వేయాలి. బీఆర్ఎస్ ను ఓడించి ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వాలి.

LEAVE A RESPONSE