మూడు పార్టీలు జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నం
ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు
బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు అందరూ కలిశారు
ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారు.
జగన్ గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది
వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అప్పుడూ ఇప్పుడూ నిర్మాణాత్మకంగా:
‘గత కొన్నాళ్లుగా తిరుపతి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అదే విధంగా ఏడాది క్రితం ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికతో పాటు, ఈ ఎన్నికల ప్రచారంలో కూడా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాము. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే పని చేశాము. ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్తున్నాము.
అధికారం చేపట్టాక ఈ 22 నెలలు ఏమేం చేశాము? ఇచ్చిన హామీలు ఏమేం నిలబెట్టుకున్నాం? వంటి అంశాలు చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నాం’.
వారికి ఏ ఎజెండా లేదు:
‘కానీ టీడీపీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఒక ఎజెండా లేకుండా, ప్రజలకు సంబంధం లేని అంశాలతో ముందుకు సాగుతున్నారు. టీడీపీ ఎప్పుడూ అదే చేస్తుంది. ఈసారి వారికి బీజేపీ తోడైంది. వ్యక్తిగత విమర్శలు. రాజకీయ సంస్కారం లేని మాటలు. తిట్టడం, నిందించడం వంటివి ఇప్పుడు చూస్తున్నాం. టీడీపీతో పాటు, రాత్రి ఒకరు, పగలు మరొకరితో తిరుగుతున్న పవన్‌కళ్యాణ్‌ను కూడా ఇప్పుడు చూస్తున్నాము’.
ఆయనది పూటకో మాట:
‘జనసేన పవన్‌కళ్యాణ్‌లో ఒక్క విషయంలో అయినా స్థిరత్వం చూశామా? పూటకో మాట. ఆ స్టేజీ మీద అప్పుడు ఆవేశంగా కనిపించడం, గర్జించడం, కన్నెర్ర చేయడం ఆయనకు అలవాటు. ఈ ఎన్నికల్లో అలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. నిజంగా ఆయా పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్‌గా పరిగణిస్తున్నాయా?’.
బాధ్యతాయుతంగా అడుగులు:
‘ఉప ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే చెప్పాలి. కానీ ఇక్కడ అవేవీ లేకపోవడం వల్ల, వ్యక్తిగత నిందలకు దిగుతున్నారు. టీడీపీ వదిలిపెట్టిన దాదాపు రూ.2.60 లక్షల కోట్ల బకాయిలు. కోవిడ్ వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది. అయినా వాటిని తట్టుకుంటూ సీఎం శ్రీవైయస్ జగన్ నిబ్బరంగా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా పథకాలు ఆపడం లేదు. ప్రజలకు ఏ సహాయాన్ని ఆపకుండా అత్యంత బాధ్యతాయుతంగా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు నచ్చాయి’.
అందుకే ఆదరించారు:
‘20 నెలల్లోనే హామీలన్నీ అమలు చేయడం, చెప్పనివి కూడా చేయడం.. ఇవన్నీ ప్రజలు గుర్తించారు. కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రజలు చూశారు కాబట్టే, పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారు. మున్సిపాలిటీలలో కూడా అఖండ మెజారిటీ ఇచ్చారు’.
విచిత్రంగా వ్యవహారశైలి:
‘ఇక తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక. ఇందులో ఏదైన మిరాకిల్ జరిగితే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని భావించి నానా వేషాలు వేస్తున్నారు. ఇది సాధారణ ఎన్నిక కూడా కాదు. సిట్టింగ్ ఎంపీ చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో గత వారం రోజులుగా విపక్షాలు ఎక్కడా ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించడం లేదు. చాలా విచిత్రంగా గతంలో ఎన్నికలు వద్దన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం వద్దన్నా కావాలన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వద్దంటున్నారు. ఇది ఒక విచిత్రం. ప్రతి దాంట్లో కోర్టుకు వెళ్లడం. ఒక లిటిగెంట్‌కు అదే పని. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్, ఒక ఎంపీ మళ్లీ కోర్టుకు వెళ్లారు. అసలు ఎన్నికలను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా లేరా?’.
‘కానీ మేము ఏనాడూ ఎన్నికలకు భయపడలేదు. «ధైర్యంగా ఎదుర్కొన్నాము. నిజానికి చంద్రబాబు ఏనాడూ సొంత బలంతో గెలవలేదు. తొలిసారి మామ పుణ్యం, ఆ తర్వాత వాజ్‌పేయి ఛరిస్మా, మళ్లీ 2014లో మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చారు’.
ఎప్పుడూ అదే పాట:
‘అందుకే ప్రతి సారి పాత పాట పాడుతున్నారు. జగన్ పై పెట్టిన కేసులు, వివేకానందరెడ్డి గారి హత్య కేసులను ప్రస్తావిస్తున్నారు. జగన్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టారు. వేధించారు. దీన్ని గతంలో బీజేపీ నేతలు కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బెయిల్ రద్దు అవుతుందని ఏ ధైర్యంతో చెబుతున్నారు. జగన్ గారు అక్రమంగా జైలుకు పంపినా ఆయన చలించలేదు. ఆయన, ఆయన కుటుంబం ఎన్నెన్నో ఎదుర్కొంది’.
ధైర్యంగా ఎదుర్కొన్నారు:
‘2014లో కూడా జగన్ గారు ధైర్యంగా ఎన్నికల్లో పోరాడారు. మీది పొత్తు. కానీ ఆయన ఒంటరిగా పోరాడి ఓట్లు సాధించారు. ఓడిపోయినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉండి ముందుకు సాగారు. అందుకే 2019లో ఆయనకు ప్రజలు తిరుగులేని అఖండ మెజారిటీ ఇచ్చారు. మీరు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టే, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 20 నెలల తర్వాత జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో జగన్‌గారు చేసిన మంచి పనులు చూసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తున్నారు’.
లోపాయకారి జట్టు:
‘టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు లోపాయికారిగా జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు. అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారు. జగన్ గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడమే అందుకు నిదర్శనం’.
‘మండల ఎన్నికల్లో పోటీలో ఉండడం అనేది ఒక రాజకీయ పార్టీ బాధ్యత. కానీ బహిష్కరిస్తున్నట్లు చెప్పడం అంటే సిగ్గు లేకపోవడమే.ఇలా కుట్రలు చేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మోదీ గారు కూడా అన్నీ చూస్తున్నారు’.
‘ఇంత ఛండాలమైన వ్యూహరచన చేసి, పోటీలో లేకుండా పని చేస్తున్న వీరికి ఏమైనా విలువ ఉందా? ఇంత కంటే హీనమైన కుసంస్కారంతో కూడిన రాజకీయం ఉంటుందా? కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆత్మ తృప్తి పొందుతున్నారు. దీని వల్ల ప్రజల్లో ఆదరణ రాదు. ఏమీ లేని అబద్ధాలు, అసత్యాలను తిప్పి కొట్టడానికి మాట్లాడాల్సి వస్తోంది. తప్ప మాకు మాట్లాడాలని లేదు’.
‘ఈ వారం, పది రోజుల నుంచి కొత్త రాజకీయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం అనిపిస్తుంది. ఆయన పిటిషన్‌కు కారణం ఏమిటో తెలియదు’.
‘జగన్ గారిపై తప్పుడు కేసులు. అవి రుజువు కావు. అయినా 16 నెలలు జైలులో ఉంచారు. బెయిల్ రాకుండా కుట్ర చేశారు. దీన్ని ప్రజలు కూడా గుర్తించారు. నిజానికి ఆయనపై కేసులు నిలబడవు. అయినా మొన్న బీజేపీ నాయకుడు జగన్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దు అవుతుందని అనడం, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేయడం.. వీటన్నింటి ద్వారా ప్రజల్లో ఒక అపోహ సృష్టించి దాని ద్వారా కొన్ని ఓట్లు రాబట్టాలన్న యోచన కనిపిస్తోంది’.
‘జగన్ పాలన చూసి, తమకు పుట్టగతులు ఉండవని తెలిసి, పిల్లి శాపాలు పెట్టడం, ఆకాశాన ఉమ్మేయడం చేస్తున్నారు. కానీ అది వాళ్ల ముఖం మీదే పడుతోంది’.
ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..:
‘వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. మరి ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఆదినారాయణరెడ్డిని పక్కన పెట్టుకుని పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఆరోజు హత్య విషయం బయటకు రాగానే, అప్పటి ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ చేయడంతో 20 నిమిషాల్లో సీఐ వెళ్లారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారు. కానీ కేసు సక్రమంగా దర్యాప్తు చేయలేదు. ఆ హత్య కేసులో ఎవరి మీద అయితే అనుమానం ఉందని చెప్పామో, అది ఈరోజుకు ఉంది. సాధారణ ఎన్నికల్లో జగన్ గారు గట్టిగా ప్రచారం చేయకుండా ఆయనను మానసికంగా ఒత్తిడికి గురి చేసేలా ఆ హత్య చేశారు’.
‘జగన్ గారు సీఎం అయిన తర్వాత కూడా కేసు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయి. వాటిని ప్రభావితం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ జగన్ గారు ప్రత్యర్థులను వేధించాలి అనుకుంటే, ఆ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబును చేర్చాలి. కానీ ఆయన ఆ కేసులో ఇన్‌వాల్వ్ కావడం లేదు. అదే విధంగా తన మీద జరిగిన హత్యా యత్నం కేసును కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది కాబట్టి, అందులోనూ జోక్యం ఎందుకని జగన్ గారు భావిస్తున్నారు. అంతే తప్ప, ఈ కేసులను ఆయన ప్రభావితం చేయదల్చుకోలేదు’.. అని స్పష్టంగా వివరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముగించారు.