-ఎన్నికల సంఘం చెప్పే కారణాలు వేరు
-విపక్షాల వాదన వేరు
-తమ ఓట్లు పోయాయని జనం గగ్గోలు
-158 నియోజకవర్గాల్లో తగ్గిన ఓటర్లు
-ఏడాది వ్యవధిలో భారీగా ఓట్ల తొలగింపు
-17 నియోజకవర్గాల్లోనే ఓటర్ల పెరుగుదల
-అత్యధికంగా ఓట్లు తగ్గిన నియోజకవర్గాల్లో మైలవరం- గాజువాక- విశాఖ తూర్పు
-అత్యధికంగా ఓట్లు పెరిగిన నియోజకవర్గాల్లో నందికొట్కూరు-దర్శి- ఒంగోలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో గల్లంతయిన ఓట్లపై గగ్గోలు మొదలయింది. దాదాపు 16 లక్షల ఓట్లు తొలగించడమే దానికి కారణం. సరైన కారణాలు చూపకుండా తమ ఓట్లు తొలగించేశారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము అన్ని ప్రాతిపదిక- తనిఖీలు- ఫిర్యాదుల తర్వాతనే ఓట్లు తొలగించామన్నది ఎన్నికల సంఘం అధికారుల జవాబు. తాజా పరిణామాలపై విపక్షాలు, సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నాయి. ఎంపిక చేసుకున్న ఇళ్ళలో ఓటర్లను తొలగించారని, అధికార పార్టీ నేతలు సూచించిన వారి పేర్లు తొలగించారని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను 158 చోట్ల ఓటర్ల సంఖ్య తగ్గింది. 2022 జనవరి 5 నాటికి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఓటర్ల కంటే ప్రస్తుతం (2023 జనవరి 5 నాటికి) తక్కువగా ఉన్నారు. ఏడాది వ్యవధిలో 15,90,802 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించటంతో 90 శాతం నియోజకవర్గాల్లో ఓటర్లు గతం కంటే తగ్గిపోయారు. జాబితాలో పేర్లు పునరావృతమైన వారివి, మరణించిన, వలసపోయిన వారి ఓట్లే తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఓటరుకు తెలియకుండానే జాబితా నుంచి పేర్లు తీసేశారని, వాలంటీర్లే వీటికి ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారని ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా గతేడాది జనవరి 5 నాటికి ఉన్న ఓటర్ల సంఖ్యను ప్రస్తుతమున్న ఓటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే కేవలం 17 చోట్ల మాత్రమే పెరుగుదల ఉంది. మిగతా అన్నిచోట్లా తగ్గింది. వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి.
17 నియోజకవర్గాల్లోనే ఓటర్ల పెరుగుదల : రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా గతేడాది జనవరి 5 నాటికి ఉన్న ఓటర్ల సంఖ్యను ప్రస్తుతమున్న ఓటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే కేవలం 17 చోట్ల మాత్రమే పెరుగుదల ఉంది. మిగతా అన్నిచోట్లా తగ్గింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు తగ్గిన నియోజకవర్గాల్లో మైలవరం- 25,189, గాజువాక- 18,224, విశాఖ తూర్పు- 16,789 మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు పెరిగిన నియోజకవర్గాల్లో నందికొట్కూరు- 2,109, దర్శి-1,964, ఒంగోలు-1,960 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఓట్లు తగ్గిన నియోజకవర్గాల వివరాలివి
* 25 వేలు అంతకంటే ఎక్కువ తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు- 1
* 20-25 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-0
* 15-20 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు -4
* 10-15 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు- 11
* 9-10 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-2
* 8-9 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-6
* 7-8 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-11
* 6-7 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-13
* 5-6 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-16
* 5 వేల ఓట్లలోపు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-94
* ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు-17
సేకరణ: ఆర్కే రెడ్డి