-యాదవులను పట్టించుకోని పార్టీలను తిప్పికొట్టండి
-యాదవ యుద్ధభేరిలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
తెలంగాణ ప్రభుత్వం లో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎంతో .అభివృద్ధి సాధించారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో యాదవ విద్యావంతుల వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన యాదవ యుద్ధభేరిలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే చూశాయని, వీరి అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది యాదవులకు MLA లుగా, రాజ్యసభ సభ్యుడిగా, కార్పొరేషన్ చైర్మన్ లుగా అవకాశం కల్పించి రాజకీయంగా పెద్దపీట వేసిందని చెప్పారు. యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తారనే ఆలోచన తో , 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీపై గొర్రెల యూనిట్ లను పంపిణీ చేస్తుందని వివరించారు.
అంతేకాకుండా వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్య, వసతి కల్పిస్తుందని చెప్పారు. యాదవ సంఘం భవనం నిర్మాణం కోసం కోకాపీట లో అత్యంత ఖరీదైన కోట్లాది రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమి, భవన నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఇచ్చిందని, త్వరలోనే భవనం ప్రారంభించుకొనున్నామని తెలిపారు.
అధికారంలో ఉన్ననాడు యాదవుల అభివృద్ధి ని పట్టించుకోని పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. అన్ని విధాలుగా అండగా ఉండి అభివృద్ధికి చేయూత అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు చలకాని వెంకన్న యాదవ్, శ్రీహరి యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, వివిధ జిల్లాల నుండి వచ్చిన యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.