– టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి ఇ-మెయిల్
తిరుమలలో ట్యాక్సీలో మరిచిపోయిన లగేజి బ్యాగును వెంటనే గుర్తించి అప్పగించినందుకు గాను మహారాష్ట్రకు చెందిన భక్తుడు విజిలెన్స్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని, తిరుమల పోలీసులను అభినందించారు. ఈ మేరకు భక్తుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి బుధవారం ఇ-మెయిల్ పంపారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన కేదార్ రాజేంద్ర కులకర్ణి అనే భక్తుడు నవంబరు 16వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో కౌస్తుభం విశ్రాంతి గృహానికి వెళ్లేందుకు ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. విశ్రాంతి గృహానికి చేరుకున్న హడావిడిలో ఒక బ్యాగును ట్యాక్సీ డిక్కీలో మరిచిపోయారు.
మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో గుర్తించి తిరుమల పోలీసులను, టిటిడి విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులను ఆశ్రయించారు. నిఘా మరియు భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి పోగొట్టుకున్న బ్యాగును మధ్యాహ్నం 1.50 గంటలకల్లా భక్తుడికి తిరిగి అప్పగించారు.భక్తుడి లగేజి బ్యాగును సత్వరం వెతికి తిరిగి అప్పగించిన టిటిడి విజిలెన్స్ కంట్రోల్ రూమ్, భద్రతా సిబ్బందిని సివిఎస్వో గోపినాథ్ జెట్టి అభినందించారు.