నాడు చావాలనుకుంది.. నేడు కోట్ల సామ్రాజ్యానికి అధిపతి

Spread the love

సక్సెస్ స్టోరీలు చదువుతూనే ఉంటాం. అయితే వీటిల్లో కొన్ని మాత్రమే మన మనసుకు హత్తుకుంటాయి. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు, వాటిని జయిస్తేనే విజయం సాధ్యమౌతుంది. వీటికి కల్పనా_సరోజ్ జీవితమే ఉదాహరణ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని, అత్తారింట్లో నరకం అనుభవించింది.
అక్కడి నుంచి బయటపడి వస్తే సమాజం హేళన చేసింది. ఊరు వదిలి ముంబై చేరింది. నెలకు రూ.60 సంపాదనతో ఆరంభమైన ఆమె ప్రస్థానం.. నేడు రూ.700 కోట్ల స్థాయికి చేరింది. నిజమైన స్లమ్‌డాగ్ మిలియనీర్‌‌కు ఆమె జీవితాన్ని నిర్వచనంగా చెప్పుకోవడంలో తప్పేమీలేదనిపిస్తోంది.
కల్పనా సరోజ్‌ది మహరాష్ట్రలోని అలోకా జిలాల్లోని చిన్న గ్రామం. తల్లిదండ్రులు 12 ఏళ్లకే పెళ్లి చేసేశారు. పెళ్లైన ఆరు నెలలకే భర్త నరకం చూపించడం ప్రారంభించాడు. తనవాళ్లతో కూడా మాట్లాడిచ్చే వాడు కాదు. అయితే ఒక రోజు అనుకోకుండా ఆమె నాన్న ఇంటికి వచ్చాడు. పరిస్థితి తెలుసుకొని ఆమెను వెంటనే ఇంటికి తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి మళ్లీ కష్టాలు. ఊర్లో అందరూ ఆమెను హేళనగా మాట్లాడేవారు.
మళ్లీ స్కూల్‌కు వెళితే విచిత్రంగా చూసేవారు. చిన్న వయసులోనే ఆ కష్టాలు భరించలేకపోయింది. పరిస్థితులను తట్టుకోలేక ఎలుకల మందు తాగేసింది. ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బతికింది. పునర్ జన్మ లభించింది. 1972లో ఇంట్లో వారిని ఒప్పించి ముంబైకి వచ్చింది.
తెలిసిన బంధువుల ఇంట్లో ఉండేది. బట్టల షాపులో పనికివెళ్లేది. నెలకు రూ.60 జీతం తీసుకునేది. తర్వాత కొన్ని నెలలకు బట్టలకు కుట్టడం ప్రారంభించింది. దీంతో రూ.100 వచ్చేవి. ఇప్పుడు ఆమె తొలిసారి రూ.100 నోటు చూసింది. తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. రెండేళ్లు డబ్బుల్ని కుడబెట్టింది. తర్వాత చిన్న ఇల్లును అద్దుకు తీసుకుంది.
అయితే అప్పుడు మళ్లీ విషాదం. కల్పన అక్క మరణించింది. మందులకు డబ్బుల లేకపోవడం ఇందుకు కారణం. ‘తన మొహంపై చిరునవ్వును నేను ఎప్పటికీ మరువను. తను నా నుంచి సహాయం ఆశించింది. కానీ నేను చేయలేకపోయాను. తనను కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నా’ అని ఒక ఇంటర్వ్యులో చెప్పింది కల్పన.
1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద రూ.50,000 లోన్ తీసుకుంది. బట్టల షాపు ప్రారంభించింది. బిజినెస్ బాగా జరుగుతోంది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది. సుశిక్షిత్ బెరోజ్‌గర్ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది.దీంతో 3,000 మందికి పైగా చేరారు. ఇక్కడే ఆమె 11 మంది టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. కల్పన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది. అతితక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఏకంగా రూ.4 కోట్లు సంపాదించింది..
రోవైపు ఎన్.ఆర్.కామానీ 1960లో కామాని_ట్యూబ్స్ కంపెనీని స్థాపించారు. లేబర్ యూనియన్లు, మేనేజ్‌మెంట్ మధ్య వివాదాల కారణంగా ఈ కంపెనీ 1985లో మూతపడింది. సుప్రీం కోర్టు 1988లో ఈ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. అధికారాన్ని వర్కర్లకు అప్పగించింది. అయితే ఆర్థిక అంశాలపై అవగాహన లేకపోవడంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. రుణ భారం ప్రతి రోజూ పెరుగుతూ వెళ్లింది. దీంతో వారు కల్పనను సంప్రదించారు.
కంపెనీ పునరుద్ధణకు1999లో కల్పన 10 మంది సభ్యులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మార్కెటింగ్, బ్యాంక్, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు. ఆర్థిక మంత్రిని, కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిశారు. బ్యాంకులు పెనాల్టీలు, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి.
కంపెనీ పునరుద్ధరణకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. 2006లో కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రుణాలను తీర్చడమే తొలి లక్ష్యంగా ముందుకు కదిలారు. దీని కోసం ఆమె తన ప్రాపర్టీలను కూడా అమ్మేశారు. 2009లో కంపెనీ ఎస్‌ఐసీఏ (సిక్ ఇండస్ట్రీయల్ కంపెనీస్ యాక్ట్) నుంచి బయట పడింది. 2010లో కంపెనీని వాదా ప్రాంతానికి మార్చారు. రూ.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏడాది గడవక ముందే 2011లో రూ.3 కోట్ల లాభం వచ్చింది.
కల్పన తర్వాత ఇతర వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ రూ.2,000 కోట్లు. ఏడు కంపెనీలకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కామాని ట్యూబ్స్ ఇప్పుడు లాభదాయకమైన కంపెనీ. ప్రతి ఏడాది రూ.5 కోట్ల లాభాన్ని అందిస్తోంది. 2013లో పద్మశ్రీ గౌరవం కూడా లభించింది. భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో కూడా నియమితులయ్యారు..

Leave a Reply