భావుకతా..భావుకతా..
ఏంటి నీ కత..అంటే..
నేను పుట్టింది
దేవులపల్లి కలంలో..
పెరిగింది ఆయన కాలంలో…
చిరస్థాయిగా
నిలిచి ఉన్నది
ఆయన పేరులో..
ఆ పేరే నా ఊరు
అందట..!
ఔను…
అది ఆయనే పెంచిన పూదోట..
మరి ఎన్నడు వాడని తోట..!
అదే భావుకత
ఇప్పటికీ ఎదురుచూస్తోందట
కృష్ణశాస్త్రి తిరిగివచ్చి
మళ్లీ తనే వస్తువుగా
మరిన్ని పాటలు రాస్తాడని…
మరచిపోకుమా తోటమాలి..
పొరపడి అయినా మతిమాలి..
అని వేడుకుంటూ…
సాహితీ మూర్తుల
కలంలో తన ఉనికిని కాపాడుకుంటూ..!
మరి ఆ భావుకత
తిరిగి వస్తే తన పిత
ఇలా పాడుకోదా..
ఎన్నినాళ్ళకీ బ్రతుకు
పండెనోనని…
రైల్లో వెళ్తూ ప్రకృతిని చూసి కావ్యమే రచించిన కవికి
నల్లని మబ్బులు
గుంపులు గుంపులు
తెల్లని కొంగలు
బారులు బారులని వర్ణించడం ఏపాటి..
అలా రాయడంలోనేగా
ఆయన ఘనాపాటి!
గోరింటనూ వదలని..
దాని పంటనూ
మరవని శాస్త్రి..
ఏ రంగు ఎందుకో
తేల్చి చెప్పిన మేస్త్రి..!
దేవులపల్లి పాట
మారుమ్రోగు గల్లీగల్లీ..
అలా రాస్తూనేగా
ఆయనయ్యాడు
ఆంధ్రా షెల్లీ..!
తేనెలొలుకుతూ
సుశీలమ్మ పాడింది
తెనుగు పాట
పరవశ అయి..
అయితే ముందుగానే
తన కలం నిండా
తేనె నింపి
ఆ పాటలో
ఒలకపోసేసాడు
పెద్దాయన…
తేట తెలుగు గీతాల
పారాయణ..!
దేవులపల్లి మధురగేయాలు వినిపించే ప్రతి ఇల్లు..
పదిలంగా అల్లూకున్నా పొదరిల్లు..
తెలుగు సినీ వినీలాకాశంలో
కృష్ణశాస్త్రి అందంగా
విరిసిన హరివిల్లు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286