Suryaa.co.in

Andhra Pradesh

దళిత మహిళ హనుమాయమ్మ హత్య కేసులో డీజీపీ ప్రెస్ నోట్ బాధాకరం, బాధ్యతారాహిత్యం

– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో హనుమాయమ్మ అనే దళిత మహిళ వైకాపా నాయకుల మద్దతుతో ట్రాక్టర్ తో తొక్కించబడి అతి దారుణంగా హత్యకు గురైతే, ఆ హత్య గురించి రాష్ట్ర డీజీపీ శ్రీ రాజేంద్రనాధ్ రెడ్డి ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ నోట్ చాలా హాస్యాస్పదంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది.

ఒక దళిత మహిళ అధికారపార్టీ అహంకారానికి బలై ట్రాక్టర్ తో చెరుకు మిషన్ లో చెరుకు గెడ నలగగొట్టబడినట్లు తొక్కించి, తొక్కించి చంపబడితే.. ఆ కేసు దర్యాప్తు ఏం జరిగింది? అందులో ముద్దాయిలెవరు?, వారిని ప్రోత్సహించిందెవరు?, అధికారపార్టీ నాయకుల హస్తం ఎంతవరకు ఉంది?, ఎందుకు అంత కక్షపూరితంగా చంపబడింది?, ముద్దాయిలను ఎప్పుడు అరెస్టు చేస్తారు?, పోలీసుల ప్రణాళిక ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయకుండా, బాధ్యతారాహిత్యంగా, ఇది హత్య కేసు, పోలీసులు అరెస్టు చేస్తారు, అరెస్టు చేసినప్పుడు వారిని రిమాండ్ కు పంపుతారు అని పాత్రికేయులకు నోటు పంపడం డీజీపీ గారి ప్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం.

దళిత మహిళ ఘోరాతిఘోరంగా హత్య గావించబడితే డీజీపీ స్పందించిన తీరు చాలా బాధాకరం. ఆయన హోదాకు, స్థాయికి తగని పని. ఈ ప్రభుత్వంలో దళితుల స్థానం ఏమిటీ, ప్రభుత్వపరంగా వారికున్న ప్రాధాన్యత ఏమిటీ అనేది డీజీపీ ప్రెస్ నోటు ద్వారా దళితులందరికీ సుస్పష్టంగా అర్ధమైంది. దళిత మహిళ దారుణ హత్య కేసులో దర్యాప్తు సరిగా చేయని అధికారులు కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నేరస్తులని డీజీపీ గ్రహించాలి. ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిగా డీజీపీ బాధ్యతారహిత ప్రెస్ నోటును ఖండిస్తున్నాను.

ఇప్పటికైనా డీజీపీ ఈ దళిత మహిళ హత్య కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, ఆమె హత్యకు కారకులైన మద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని, హత్యకు ప్రోత్సహించిన వారిని, హంతకులకు దౌర్యమిచ్చిన అధికారపార్టీ పెద్దలను కూడా అరెస్టు చేయాలని, ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా ఘోరాతిఘోరంగా హత్యగావించబడిన దళిత మహిళ హనుమాయమ్మ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE