Suryaa.co.in

Telangana

స్పెషల్ డ్రైవ్ తో కొలిక్కి వస్తున్న ధరణి భూసమస్యలు

– ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం
– రెవెన్యూ సిబ్బంది కి అభినందనలు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణితో సమస్యలను ఎదుర్కొంటుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.

ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఈ నెల 1వ తేది నుండి ఎమార్వో స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ స్పెషల్ డ్రైవ్ లో 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్ స్థాయిలో 76,382 ధరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రోజుకు 15వేలకు పైగా ధరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ప్రధానంగా పెండింగ్ మ్యూటేషన్ కు సంబంధించి 15,070 దరఖాస్తులకు 5,471 పరిష్కరించడం జరిగింది. గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ 40,605 దరఖాస్తులకు గాను 17,372; పాస్ బుక్ డేటా కలెక్షన్ కు సంబంధించి 1,01,132 దరఖాస్తులకు గాను 27,047 పరిష్కరించడం జరిగింది. కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తులకు గాను 9,883 పరిష్కరించడం జరిగింది.

ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న భూసమస్యలను అధికారుల సిబ్బంది పరిష్కరించడంపట్ల మంత్రిగారు వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని మంత్రి గారు అభిలాషించారు.

LEAVE A RESPONSE