వద్దన్న చోట ధర్నా చేయడానికి టీఆర్‌ఎస్‌కు సిగ్గుందా?

– ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతల ధ్వజం
తమదాకా వస్తేగానీ తెలియదంటారు. ఇప్పుడు అది టీఆర్‌ఎస్ విషయంలో నిజమయింది. తమ ప్రభుత్వంలో ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదన్న కేసీఆర్ నాయకత్వంలోని అదే టీఆర్‌ఎస్ ఇప్పుడు సరిగ్గా.. తాను ఎక్కడైతే ధర్నాలు వద్దన్న ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్దనే, ధర్నా నిర్వహించి విమర్శల పాలయింది. అప్పుడు ధర్నాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న ప్రభుత్వమే.. ఇప్పుడు స్వయంగా ధర్నా నిర్వహిస్తే, మరి ప్రజలకు ఇబ్బందులుండవా అని ధర్నాచౌక్ పరిరక్షణ సమితి ఆక్షేపించింది.
ధర్నా చౌక్‌ను ఎత్తేసిన టీఆర్ఎస్.. అక్కడే ధర్నా చేయడానికి సిగ్గుండాలని పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. ప్రజల ఇబ్బందులు గులాబీ పార్టీకి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇకమీదట ప్రతిపక్షాల ఆందోళనకు కూడా అవాంతరాలు లేకుండా అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నేతలుఆందోళన చేపట్టారు.
గతంలో ఇక్కడ ఆందోళనలు చేసే అవకాశం ఉండేది.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను ఎత్తివేసింది. ఈ సందర్భంగా ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతలు మాట్లాడుతూ.. ఆనాడు ధర్నా చౌక్ వల్ల ప్రజలకు ఇబ్బందులని చెప్పి ఎత్తేశారని, ఇవాళ టీఆర్ఎస్ ఇక్కడ ధర్నా చేస్తోందని, మరి ప్రజలకు ఇబ్బంది కలగదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ఇది అంతమని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎవరూ ధర్నా చేయాల్సిన అవసరం ఉండదని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఆ పార్టే ధర్నా చేస్తోందని ఎద్దేవా చేశారు.

Leave a Reply